హంబన్‌టొట నౌకాశ్రయంలో వాంగ్ 5 కు మంగళవారం పోర్టు సిబ్బంది స్వాగతం
భారత్ అభ్యంతరాలు, ఆందోళనలు బేఖాతర్ చేస్తూ చైనా హైటెక్ నిఘా నౌక యువాన్ వాంగ్ 5 శ్రీలంకలోని హంబన్‌టొట రేవు పట్టణంలోకి మంగళవారం ఉదయం ప్రవేశించింది. ఈ విషయాన్ని పోర్టు అధికారులు వెల్లడించారు. ఇంధనం నింపుకోవడానికే ఈ రేపులో ఆగినట్టుగా చైనా బయటకి చెబుతున్నప్పటికీ మన దేశ రక్షణ కార్యకలాపాలపై నిఘా వేయడం కోసమే డ్రాగన్ ఈ నౌకను పంపినట్టుగా అనుమానాలు వెలువడుతున్నాయి.
ఆగస్టు 11వ తేదీనే ఈ నౌక శ్రీలంకకు రావాల్సి ఉంది. అయితే ఈ నౌక రాకను అడ్డుకోవాల్సిందిగా శ్రీలంకలోని రణిల్ సింఘె ప్రభుత్వానికి భారత్ విజ్ఞప్తి చేసింది. భారత్ అభ్యంతరాలను చైనా దృష్టికి తీసుకువెళుతూ చైనా ఆ నౌక రావడానికి తొలుత అనుమతి నిరాకరించింది. కానీ చైనా నుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి ఆఖరి నిమిషంలో అనుమతినిచ్చింది.
2020లో లద్ధాఖ్‌లోని గల్వాన్ లోయలో ఘర్షణలతో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు రాజుకుంటూనే ఉన్నాయి. ఈ నిఘా నౌకతో అవి మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు భారత్ ఆందోళనల్ని చైనా కొట్టి పారేస్తోంది. తమ నౌక కార్యకలాపాలు ఏ దేశ భద్రతకు ముప్పు కావని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ అన్నారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడే సర్వసాధారణంగా జరిగే పరిశోధనలనే యువాన్ వాంగ్ 5 చేస్తుందని అంటున్నారు.
భారత రక్షణ ప్రమాదంలో పడుతుందా ?
యువాన్ వాంగ్ 5 ఒక పరిశోధన నౌక అని చైనా చెప్పుకుంటోంది. కానీ ఇది పరిశోధనలు, సర్వేలతో పాటు నిఘా కూడా పెట్టగలదు. భారత్ మిలటరీ ప్రాంతాలన్నింటిపైనే నిఘా ఉంచే సామర్థ్యం ఈ నౌకకి ఉంది. యువాన్ వాంగ్ సిరీస్‌లో మూడో జనరేషన్‌కు చెందిన ట్రాకింగ్ నౌక ఇది. ఖండాంతర క్షిపణులు, ఉపగ్రహాలు, రాకెట్లను ట్రాక్ చేసే ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఈ నౌకలో ఉంది. 750 కి.మీ. దూరంలో ఉన్నవన్నీ ఈ నౌక రాడార్ పరిధిలోకి వస్తాయి.
శ్రీలంకలోని హంబన్‌టొట రేవులోకి ఈ నౌక ప్రవేశించడం వల్ల భారత్‌లోని తూర్పు కోస్తా రేవు పట్టణాల్లో జరిగే వ్యూహాత్మక కార్యకలాపాలన్నీ ఈ నౌక రాడార్ పరిధిలోకి వస్తాయి. శ్రీలంక తీరంలో ఆ నౌక ఉన్న సమయంలో భారత్ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తే వాటి గురించి మొత్తం ఆ నౌక ద్వారా తెలుసుకోవచ్చు. శ్రీలంక రేవులో యువాన్ వాంగ్5 ఉన్నంతవరకు తమిళనాడులో ఉన్న 1,076 కి.మీ. తీర ప్రాంతంపై నిఘా పెట్టొచ్చు.
కల్పకం, కూడంకుళం వంటి అణు విద్యుత్ కేంద్రాలు ఈ నౌక రాడార్‌లోకి రావడం వల్ల భారత్‌లో ఆందోళన పెరుగుతోంది. ఇంధనం నింపుకోవడానికే హంబన్‌టొటలో ఆగుతున్నామని చైనా చెబుతోంది. అయితే జూలై 14న చైనా నుంచి బయల్దేరిన ఈ నౌక ఇప్పటివరకు ఏ రేవు పట్టణంలోనూ ఆగకపోవడంతో మన దేశ మిలటరీ కార్యకలాపాలను పసిగట్టడం కోసమే వచ్చిందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి సముద్ర గర్భంలో సర్వేలు నిర్వహించే సత్తా కూడా ఈ నౌకకి ఉంది. దీనివల్ల జలాంతర్గాముల గుట్టు మట్లు కూడా తెలుసుకునే అవకాశం ఉంది.
చైనా కంపెనీ అధీనంలో హంబన్‌టొట పోర్టు
శ్రీలంక రేవు పట్టణంలో చైనా నౌక ఉన్నంతవరకు ఎలాంటి శాస్త్రీయమైన పరిశోధనలు జరపడానికి తాము అనుమతించబోమని శ్రీలంక పోర్ట్ అథారిటీ చెబుతోంది. నౌకకు సంబంధించిన ఆటోమేటిక్ ఐడెంటిఫికేసన్ సిస్టమ్‌ని ఆఫ్‌లో ఉంచాలన్న నిబంధన పైనే నౌక రావడానికి అనుమతిచ్చామని అంటోంది. అయితే హంబన్‌టొట పోర్టు చైనా కంపెనీ చేతిలో లీజులో ఉంది. ఈ ఓడరేవు నిర్మాణానికి చైనాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ 120 కోట్ల డాలర్లు రుణంగా ఇచ్చింది.
ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక ఆ రుణాలు తీర్చలేకపోవడంతో చైనా మర్చంట్ పోర్టు సంస్థ 2017లో 99 ఏళ్ల పాటు ఈ పోర్టుని లీజుకి తీసుకుంది. ఈ కంపెనీయే రేవు పట్టణంలో రోజు వారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఇది భారత్‌కు మరింత ఆందోళన పెంచుతోంది.. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కనుసన్నల్లోనే ఈ నౌక నడుస్తుందని అమెరికా రక్షణ శాఖ కూడా ధ్రువీకరించింది.
వ్యూహాత్మక ప్రాంతంలో పోర్టు
అంతర్జాతీయ నౌకలు ప్రయాణించే మార్గంలో తూర్పు, పశ్చిమ సముద్ర ప్రాంతాలు కలిసే చోటుకి 10 నాటికల్ మైళ్ల దూరంలో హంబన్‌టొట ఉంది. ఆసియా, యూరప్ మధ్య నిత్యం 36 వేల రవాణా నౌకలు తిరుగుతూ ఉంటాయి. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చే చమురులో 50% ఈ మార్గం ద్వారానే సరఫరా అవుతుంది.ఈ రేవు ద్వారా వెళ్లడం ద్వారా ఆసియా, యూరప్ మధ్య మూడు రోజుల ప్రయాణం కలిసొస్తుంది. ఆ మేరకు చమురు ఆదా అవుతుంది.
డ్రాగన్ కొత్త ఎత్తులు
ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న దేశాల అవసరాలను తీరుస్తామన్న చెప్పుకొని డ్రాగన్ దేశం తమ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకుంటోంది. శ్రీలంక ఆర్థికంగా కుంగిపోయి అధ్యక్షుడు మహీందా రాజపక్స దేశం విడిచిపోయిన పారిపోయిన పరిస్థితుల్లో భారత్ ఆ దేశాన్ని ఎన్నో విధాలుగా ఆదుకుంది. 350 కోట్ల డాలర్లను అప్పుగా ఇవ్వడంతో పాటు ఆహారం, మందులు, చమురు పంపించింది. అటు చైనా నుంచి కూడా శ్రీలంక చాలా అప్పులు చేసింది.
2005–2017 మధ్యలో 1500 కోట్ల డాలర్లను అప్పుగా ఇచ్చింది. ఇప్పుడు భారత్ కూడా సాయం చేస్తూ ఉండడంతో లంకపై భారత్ పట్టు పెరిగిపోతుందన్న భయం చైనాకు పట్టుకుంది. అందుకే శ్రీలంకలో భారత్ ప్రాభవాన్ని తగ్గించడం కోసం వ్యూహాలు పన్నుతోంది. ఆ దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు, రోడ్డు, రైలు, విమానాశ్రయాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. శ్రీలంక కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి అప్పు తేవడానికి కావల్సిన మాట సాయాన్ని చైనా నుంచి ఆశిస్తోంది. దీనిపై ఇరు దేశాల మధ్య చర్చలు సాగుతున్నాయి. ఎవరినీ నొప్పించకూడదన్న లక్ష్యంతో శ్రీలంక ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్నా చైనా నుంచి వస్తున్న ఒత్తిళ్లే ఆ దేశంపై అధికంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
యువాన్ వాంగ్ 5
► చైనాలోని జియాంగ్నన్ షిప్‌యార్డ్‌లో నిర్మాణం
► 2007 నుంచి విధుల్లోకి
► పొడవు 222 మీటర్లు –
► వెడల్పు 25.2 మీటర్లు
► నౌకలో అత్యంత ఆధునిక సాంకేతిక నిఘా వ్యవస్థ
► నింగి నేల నీరు అన్నింటిపై నిఘా పెట్టే సామర్థ్యం
► గత నెలలో చైనా లాంగ్ మార్చ్
► 5బీ రాకెట్ ప్రయోగంపై నిఘా
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment