కొలంబో: శ్రీలంకలోని వ్యూహాత్మకంగా కీలకమైన హంబన్‌టోట పోర్టులో మకాం వేసిన చైనా నిఘా నౌక ఆరు రోజుల అనంతరం సోమవారం అక్కడి నుంచి వెళ్లిపోయింది. బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలు, శాటిలైట్ ట్రాకింగ్ సామర్థ్యం కలిగిన యువాన్ వాంగ్ 5 రాకపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ నౌక హంబన్‌టోటకు ఈనెల 11వ తేదీనే రావాల్సి ఉంది. భారత్ భద్రతాపరమైన ఆందోళనల నడుమ శ్రీలంక అధికారులు అనుమతులను వెంటనే ఇవ్వలేదు.
చైనా నిర్వహణలో ఉన్న హంబన్‌టోటకు ఈ నెల 16వ తేదీన చేరుకుని ఇంధనం నింపుకునే కారణంతో సోమవారం వరకు అక్కడే లంగరేసింది. యువాన్ వాంగ్ 5 సోమవారం సాయంత్రం 4 గంటలకు చైనాలోని జియాంగ్ యిన్ పోర్టు దిశగా తిరిగి బయలుదేరి వెళ్లిపోయిందని హార్బర్ అధికారులు వెల్లడించారు. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం పోర్టులో ఉన్న సమయంలో నౌకలోని సిబ్బందిని మార్చలేదని వివరించారు. తమ ప్రాదేశిక జలాల్లో ఉన్న సమయంలో ఈ నౌకలోని ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ వ్యవస్థ స్విఛాన్ చేసి ఉంటుందని, ఎటువంటి పరిశోధనలు జరపరాదనే షరతులతోనే అనుమతులు ఇచ్చినట్లు శ్రీలంక ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment