Hambantota
-
‘చేతనైతే శ్రీలంకకు సాయం చేయండి.. కానీ’.. చైనాకు భారత్ చురకలు!
కొలంబో: శ్రీలంకలోని హంబన్‌టోటా నౌకాశ్రయానికి ఇటీవలే హైటెక్ నిఘా నౌకను తీసుకొచ్చింది చైనా. ఈ నౌకను హంబన్‌టోటాలో కొన్ని రోజులు నిలిపి ఉంచటంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే.. భారత్ ఆందోళనలను తోసిపుచ్చుతూ చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో చైనాకు చురకలు అంటించింది న్యూఢిల్లీ. కొలంబోకు ప్రస్తుతం మద్దతు కావాలని, అనవసరమైన ఒత్తిడి, అనవసర వివాదాలతో ఇతర దేశాల ఎజెండాను రుద్దటం కాదని స్పష్టం చేసింది. ‘చైనా రాయబారి చేసిన వ్యాఖ్యలను పరిశీలించాం. ఆయన ప్రాథమిక దౌత్య మర్యాదలను ఉల్లంఘించడం వ్యక్తిగత లక్షణం కావచ్చు లేదా ఆ దేశ వైఖరిని సూచించొచ్చు. చైనా రాయబారి క్వి జెన్‌హాంగ్ భారతదేశం పట్ల చూపుతున్న దృక్పథం అతని స్వంత దేశం ఎలా ప్రవర్తిస్తుందనే దానిని సూచిస్తోంది. భారత్ అందుకు చాలా భిన్నమని ఆయనకు తెలుపుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీలంకకు మద్దతు అవసరం. కానీ అనవసరమైన ఒత్తిడి, ఇతర దేశాల ఎజెండాను రుద్దేందుకు అవసరం లేని వివాదాలు కాదు.’ అని ట్వీట్ చేసింది శ్రీలంకలోని భారత హైకమిషన్. భారత్ అభ్యంతరాలపై చైనా రాయబారి గత శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా భద్రతా పరమైన ఆందోళనలను లేవనెత్తటం బయటినుంచి అవరోధం కలిగించటమేనన్నారు. అలాగే.. అది శ్రీలంక సార్వభౌమత్వం, స్వంతంత్రతలో కలుగజేసుకోవటమేనని భారత్‌పై ఆరోపణలు చేశారు. అయితే, నౌకపై శ్రీలంక, చైనాలు ఉమ్మడిగా చర్చించి ఇరు దేశాల ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమత్వం, స్వతంత్రతను కాపాడుకునేందుకు నిర్ణయించటం సంతోషంగా ఉందన్నారు. ఇదీ చదవండి: శ్రీలంకను వీడిన చైనా నిఘా నౌక -
శ్రీలంకను వీడిన చైనా నిఘా నౌక
కొలంబో: శ్రీలంకలోని వ్యూహాత్మకంగా కీలకమైన హంబన్‌టోట పోర్టులో మకాం వేసిన చైనా నిఘా నౌక ఆరు రోజుల అనంతరం సోమవారం అక్కడి నుంచి వెళ్లిపోయింది. బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలు, శాటిలైట్ ట్రాకింగ్ సామర్థ్యం కలిగిన యువాన్ వాంగ్ 5 రాకపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ నౌక హంబన్‌టోటకు ఈనెల 11వ తేదీనే రావాల్సి ఉంది. భారత్ భద్రతాపరమైన ఆందోళనల నడుమ శ్రీలంక అధికారులు అనుమతులను వెంటనే ఇవ్వలేదు. చైనా నిర్వహణలో ఉన్న హంబన్‌టోటకు ఈ నెల 16వ తేదీన చేరుకుని ఇంధనం నింపుకునే కారణంతో సోమవారం వరకు అక్కడే లంగరేసింది. యువాన్ వాంగ్ 5 సోమవారం సాయంత్రం 4 గంటలకు చైనాలోని జియాంగ్ యిన్ పోర్టు దిశగా తిరిగి బయలుదేరి వెళ్లిపోయిందని హార్బర్ అధికారులు వెల్లడించారు. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం పోర్టులో ఉన్న సమయంలో నౌకలోని సిబ్బందిని మార్చలేదని వివరించారు. తమ ప్రాదేశిక జలాల్లో ఉన్న సమయంలో ఈ నౌకలోని ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ వ్యవస్థ స్విఛాన్ చేసి ఉంటుందని, ఎటువంటి పరిశోధనలు జరపరాదనే షరతులతోనే అనుమతులు ఇచ్చినట్లు శ్రీలంక ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. -
‘లంక రేవు’ను పర్యవేక్షిస్తున్నాం: జైశంకర్
బ్యాంకాక్: శ్రీలంక పోర్టు హంబన్‌టొటలో చైనా నిఘా నౌక యువాన్ వాంగ్ 5 రావడంతో భారత్ భద్రతకు భంగం వాటిల్లే పరిణామమేదైనా జరుగుతుందేమోనని పర్యవేక్షిస్తున్నామని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ చెప్పారు. భారత్ థాయ్‌లాండ్ జాయింట్ కమిషన్ భేటీ సందర్భంగా జైశంకర్ మాట్లాడారు. మా పొరుగు దేశంలో జరిగే ఎలాంటి పరిణామాలైననా గమనిస్తూ ఉంటామని చెప్పారు. చైనాకు చెందిన హైటెక్ నౌక యువాన్ వాంగ్ 5 శాంతి, స్నేహ సంబంధాల మిషన్ అని ఆ నౌక కెప్టెన్ జాంగ్ హాంగ్వాంగ్ పేర్కొన్నారు. భారత్ అభ్యంతరాలు, ఆందోళనలు బేఖాతర్ చేస్తూ చైనా హైటెక్ నిఘా నౌక యువాన్ వాంగ్ 5 శ్రీలంకలోని హంబన్‌టొట రేవు పట్టణంలోకి మంగళవారం ఉదయం ప్రవేశించింది. ఈ విషయాన్ని పోర్టు అధికారులు వెల్లడించారు. ఇంధనం నింపుకోవడానికే ఈ రేపులో ఆగినట్టుగా చైనా బయటకి చెబుతున్నప్పటికీ మన దేశ రక్షణ కార్యకలాపాలపై నిఘా వేయడం కోసమే డ్రాగన్ ఈ నౌకను పంపినట్టుగా అనుమానాలు వెలువడుతున్నాయి. ఇదీ చదవండి: భారత్, శ్రీలంక.. ఒక చైనా నౌక -
భారత్, శ్రీలంక.. ఒక చైనా నౌక
భారత్ అభ్యంతరాలు, ఆందోళనలు బేఖాతర్ చేస్తూ చైనా హైటెక్ నిఘా నౌక యువాన్ వాంగ్ 5 శ్రీలంకలోని హంబన్‌టొట రేవు పట్టణంలోకి మంగళవారం ఉదయం ప్రవేశించింది. ఈ విషయాన్ని పోర్టు అధికారులు వెల్లడించారు. ఇంధనం నింపుకోవడానికే ఈ రేపులో ఆగినట్టుగా చైనా బయటకి చెబుతున్నప్పటికీ మన దేశ రక్షణ కార్యకలాపాలపై నిఘా వేయడం కోసమే డ్రాగన్ ఈ నౌకను పంపినట్టుగా అనుమానాలు వెలువడుతున్నాయి. ఆగస్టు 11వ తేదీనే ఈ నౌక శ్రీలంకకు రావాల్సి ఉంది. అయితే ఈ నౌక రాకను అడ్డుకోవాల్సిందిగా శ్రీలంకలోని రణిల్ సింఘె ప్రభుత్వానికి భారత్ విజ్ఞప్తి చేసింది. భారత్ అభ్యంతరాలను చైనా దృష్టికి తీసుకువెళుతూ చైనా ఆ నౌక రావడానికి తొలుత అనుమతి నిరాకరించింది. కానీ చైనా నుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి ఆఖరి నిమిషంలో అనుమతినిచ్చింది. 2020లో లద్ధాఖ్లోని గల్వాన్ లోయలో ఘర్షణలతో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు రాజుకుంటూనే ఉన్నాయి. ఈ నిఘా నౌకతో అవి మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు భారత్ ఆందోళనల్ని చైనా కొట్టి పారేస్తోంది. తమ నౌక కార్యకలాపాలు ఏ దేశ భద్రతకు ముప్పు కావని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ అన్నారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడే సర్వసాధారణంగా జరిగే పరిశోధనలనే యువాన్ వాంగ్ 5 చేస్తుందని అంటున్నారు. భారత రక్షణ ప్రమాదంలో పడుతుందా ? యువాన్ వాంగ్ 5 ఒక పరిశోధన నౌక అని చైనా చెప్పుకుంటోంది. కానీ ఇది పరిశోధనలు, సర్వేలతో పాటు నిఘా కూడా పెట్టగలదు. భారత్ మిలటరీ ప్రాంతాలన్నింటిపైనే నిఘా ఉంచే సామర్థ్యం ఈ నౌకకి ఉంది. యువాన్ వాంగ్ సిరీస్‌లో మూడో జనరేషన్‌కు చెందిన ట్రాకింగ్ నౌక ఇది. ఖండాంతర క్షిపణులు, ఉపగ్రహాలు, రాకెట్లను ట్రాక్ చేసే ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఈ నౌకలో ఉంది. 750 కి.మీ. దూరంలో ఉన్నవన్నీ ఈ నౌక రాడార్ పరిధిలోకి వస్తాయి. శ్రీలంకలోని హంబన్‌టొట రేవులోకి ఈ నౌక ప్రవేశించడం వల్ల భారత్‌లోని తూర్పు కోస్తా రేవు పట్టణాల్లో జరిగే వ్యూహాత్మక కార్యకలాపాలన్నీ ఈ నౌక రాడార్ పరిధిలోకి వస్తాయి. శ్రీలంక తీరంలో ఆ నౌక ఉన్న సమయంలో భారత్ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తే వాటి గురించి మొత్తం ఆ నౌక ద్వారా తెలుసుకోవచ్చు. శ్రీలంక రేవులో యువాన్ వాంగ్5 ఉన్నంతవరకు తమిళనాడులో ఉన్న 1,076 కి.మీ. తీర ప్రాంతంపై నిఘా పెట్టొచ్చు. కల్పకం, కూడంకుళం వంటి అణు విద్యుత్ కేంద్రాలు ఈ నౌక రాడార్లోకి రావడం వల్ల భారత్‌లో ఆందోళన పెరుగుతోంది. ఇంధనం నింపుకోవడానికే హంబన్‌టొటలో ఆగుతున్నామని చైనా చెబుతోంది. అయితే జూలై 14న చైనా నుంచి బయల్దేరిన ఈ నౌక ఇప్పటివరకు ఏ రేవు పట్టణంలోనూ ఆగకపోవడంతో మన దేశ మిలటరీ కార్యకలాపాలను పసిగట్టడం కోసమే వచ్చిందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి సముద్ర గర్భంలో సర్వేలు నిర్వహించే సత్తా కూడా ఈ నౌకకి ఉంది. దీనివల్ల జలాంతర్గాముల గుట్టు మట్లు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. చైనా కంపెనీ అధీనంలో హంబన్‌టొట పోర్టు శ్రీలంక రేవు పట్టణంలో చైనా నౌక ఉన్నంతవరకు ఎలాంటి శాస్త్రీయమైన పరిశోధనలు జరపడానికి తాము అనుమతించబోమని శ్రీలంక పోర్ట్ అథారిటీ చెబుతోంది. నౌకకు సంబంధించిన ఆటోమేటిక్ ఐడెంటిఫికేసన్ సిస్టమ్‌ని ఆఫ్‌లో ఉంచాలన్న నిబంధన పైనే నౌక రావడానికి అనుమతిచ్చామని అంటోంది. అయితే హంబన్‌టొట పోర్టు చైనా కంపెనీ చేతిలో లీజులో ఉంది. ఈ ఓడరేవు నిర్మాణానికి చైనాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ 120 కోట్ల డాలర్లు రుణంగా ఇచ్చింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక ఆ రుణాలు తీర్చలేకపోవడంతో చైనా మర్చంట్ పోర్టు సంస్థ 2017లో 99 ఏళ్ల పాటు ఈ పోర్టుని లీజుకి తీసుకుంది. ఈ కంపెనీయే రేవు పట్టణంలో రోజు వారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఇది భారత్‌కు మరింత ఆందోళన పెంచుతోంది.. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కనుసన్నల్లోనే ఈ నౌక నడుస్తుందని అమెరికా రక్షణ శాఖ కూడా ధ్రువీకరించింది. వ్యూహాత్మక ప్రాంతంలో పోర్టు అంతర్జాతీయ నౌకలు ప్రయాణించే మార్గంలో తూర్పు, పశ్చిమ సముద్ర ప్రాంతాలు కలిసే చోటుకి 10 నాటికల్ మైళ్ల దూరంలో హంబన్‌టొట ఉంది. ఆసియా, యూరప్ మధ్య నిత్యం 36 వేల రవాణా నౌకలు తిరుగుతూ ఉంటాయి. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చే చమురులో 50% ఈ మార్గం ద్వారానే సరఫరా అవుతుంది.ఈ రేవు ద్వారా వెళ్లడం ద్వారా ఆసియా, యూరప్ మధ్య మూడు రోజుల ప్రయాణం కలిసొస్తుంది. ఆ మేరకు చమురు ఆదా అవుతుంది. డ్రాగన్ కొత్త ఎత్తులు ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న దేశాల అవసరాలను తీరుస్తామన్న చెప్పుకొని డ్రాగన్ దేశం తమ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకుంటోంది. శ్రీలంక ఆర్థికంగా కుంగిపోయి అధ్యక్షుడు మహీందా రాజపక్స దేశం విడిచిపోయిన పారిపోయిన పరిస్థితుల్లో భారత్ ఆ దేశాన్ని ఎన్నో విధాలుగా ఆదుకుంది. 350 కోట్ల డాలర్లను అప్పుగా ఇవ్వడంతో పాటు ఆహారం, మందులు, చమురు పంపించింది. అటు చైనా నుంచి కూడా శ్రీలంక చాలా అప్పులు చేసింది. 2005–2017 మధ్యలో 1500 కోట్ల డాలర్లను అప్పుగా ఇచ్చింది. ఇప్పుడు భారత్ కూడా సాయం చేస్తూ ఉండడంతో లంకపై భారత్ పట్టు పెరిగిపోతుందన్న భయం చైనాకు పట్టుకుంది. అందుకే శ్రీలంకలో భారత్ ప్రాభవాన్ని తగ్గించడం కోసం వ్యూహాలు పన్నుతోంది. ఆ దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు, రోడ్డు, రైలు, విమానాశ్రయాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. శ్రీలంక కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి అప్పు తేవడానికి కావల్సిన మాట సాయాన్ని చైనా నుంచి ఆశిస్తోంది. దీనిపై ఇరు దేశాల మధ్య చర్చలు సాగుతున్నాయి. ఎవరినీ నొప్పించకూడదన్న లక్ష్యంతో శ్రీలంక ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్నా చైనా నుంచి వస్తున్న ఒత్తిళ్లే ఆ దేశంపై అధికంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. యువాన్ వాంగ్ 5 ► చైనాలోని జియాంగ్నన్ షిప్‌యార్డ్‌లో నిర్మాణం ► 2007 నుంచి విధుల్లోకి ► పొడవు 222 మీటర్లు – ► వెడల్పు 25.2 మీటర్లు ► నౌకలో అత్యంత ఆధునిక సాంకేతిక నిఘా వ్యవస్థ ► నింగి నేల నీరు అన్నింటిపై నిఘా పెట్టే సామర్థ్యం ► గత నెలలో చైనా లాంగ్ మార్చ్ ► 5బీ రాకెట్ ప్రయోగంపై నిఘా – నేషనల్ డెస్క్, సాక్షి -
చైనా ‘స్పై షిప్’తో భారత్ ఆందోళనకు గల కారణాలేంటి?
న్యూఢిల్లీ: భారత్ భద్రతా పరమైన ఆందోళనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ చైనాకు చెందిన నిఘా నౌకా శ్రీలంకలోని హంబన్‌తోటా పోర్టుకు మంగళవారం చేరింది. తొలుత నౌక ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని చైనాకు సూచించిన శ్రీలంక.. భారత్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అనుమతులు ఇచ్చింది. అసలు.. ఇంతకి చైనా స్పై షిప్‌తో భారత్ ఆందోళన చెందేందుకు గల 5 ప్రధాన కారణాలు తెలుసుకుందాం. ► చైనా యాంగ్ వాంగ్ 5 నిఘా నౌక సెన్సార్లు కలిగి ఉంది. భారత్ బాలిస్టిక్ మిసైల్స్‌ను ప్రయోగిస్తే వాటిని ట్రాక్ చేయగలదు. ఈ మిసైల్స్‌ను భారత్ ఒడిశాలోని అబ్దుల్ కలామ్ ఐలాండ్ నుంచి ప్రయోగిస్తుంటుంది. ► యాంగ్ వాంగ్ 5లోని అత్యాధునిక సాంకేతిక సామర్థ్యాలను ఉపయోగించికొని.. భారత క్షిపణుల పరిధి, ఖచ్చితత్వాన్ని అంచనా వేయగలగుతుంది చైనా. దీంతో మన క్షిపణుల వివరాలు డ్రాగన్ చేతికి చిక్కినట్లవుతుంది. ఆ నౌక ఆగస్టు 22 వరకు శ్రీలంకలోనే ఉండనుంది. ► యాంగ్ వాంగ్ 5 సముద్రంలో సర్వేలు నిర్వహించగలదు. దాంతో హిందూ మహా సముద్రంలో సబ్‌మెరైన్ కార్యకలాపాలు సాగించేందుకు వీలు కలగనుంది. 2021లో చైనాకు చెందిన సర్వే నౌక షియాంగ్ యాంగ్ హంగ్ 03 ఇలాంటి సర్వేలే నిర్వహించింది. ► 2014లో చైనాకు చెందిన అణ్వాయుధ సామర్థ్యం కలిగిన నౌకను ఓ పోర్టులోకి శ్రీలంక అనుమతించింది. దాంతో భారత్-శ్రీలంక మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, ఈసారి చైనా నౌక ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఆన్ చేసి ఉంటుందని, శాస్త్రపరమైన పరిశోధనలు చేసేందుకు అనుమతించటం లేదని శ్రీలంక పేర్కొంది. హంబన్‌తోటా నౌకాశ్రయం కార్యకలాపాలను చైనా సంస్థ నిర్వహిస్తున్నప్పటికీ ఆపరేషనల్ సమస్యలను తామే చూసుకుంటున్నట్లు శ్రీలంక పోర్ట్స్ అథారిటీ తెలిపింది. ► చైనాకు రుణాలు చెల్లించలేక హంబన్‌తోటా నౌకాశ్రయాన్ని 99 ఏళ్ల లీజుకు ఇచ్చిన క్రమంలో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ పోర్టును మిలిటరీ అవసరాల కోసం ఉపయోగించే ప్రమాదం ఉందని ముందు నుంచే హెచ్చరిస్తోంది భారత్. ఇదీ చదవండి: భారత్ హెచ్చరికలు బేఖాతరు.. శ్రీలంక చేరిన చైనా ‘స్పై షిప్’ -
భారత్ హెచ్చరికలు బేఖాతరు.. శ్రీలంక చేరిన చైనా ‘స్పై షిప్’
కొలంబో: చైనాకు చెందిన ఉన్నతస్థాయి పరిశోధక నౌక శ్రీలంకలోని హంబన్‌తోటా నౌకాశ్రయానికి మంగళవారం చేరుకుంది. స్పై షిప్ రాకపై భారత్ భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తం చేసిన కొద్ది రోజుల్లోనే పోర్టుకు చేరుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వాంగ్ యాంగ్ 5 నౌక శ్రీలంక పోర్టుకు చేరుకున్నట్లు హర్బర్ మాస్టర్ కెప్టెన్ నిర్మల్ డీ సిల్వా తెలిపారు. పొరుగు దేశంలో చైనా నౌక ఉండటంపై భారత్ ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌కు చెందిన వ్యవస్థలపై నిఘావేసే ప్రమాదం ఉందని పేర్కొంది. దీంతో షిప్ రాకను వాయిదా వేసుకోవాలని చైనాకు సూచించింది శ్రీలంక. అయితే, చైనా ఒత్తిడికి తలొగ్గి గత శనివారం అనుమతులు జారీ చేసింది. ఆగస్టు 16 నుంచి 22 మధ్య నౌక తమ పోర్టులో ఉండేందుకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ‘చైనాకు చెందిన వాంగ్ యాంగ్ 5 నౌక నిర్వహణలో పొరుగు దేశం భద్రతకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. అందరి ఆందోళనలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.’ అని శ్రీలంక విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది. అంతకు ముందు భారత్, అమెరికాల ఆందోళనలను తప్పుపట్టింది చైనా. శ్రీలంకపై ఒత్తిడి పెంచేందుకు భద్రతాపరమైన అంశాలను లేవనెత్తటం పూర్తిగా అసంబద్ధమని పేర్కొంది. చైనా సముద్ర శాస్త్ర పరిశోధన కార్యకలాపాలను హేతుబద్ధమైన కోణంలో చూడాలని, చైనా, శ్రీలంక మధ్య సహకారానికి అంతరాయం కలిగించకుండా ఆపాలని సంబంధిత పక్షాలను కోరుతున్నామని చెలిపారు డ్రాగన్ విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్. ఇదీ చదవండి: భారత ఆందోళనను లెక్కచేయని శ్రీలంక.. చైనా నిఘా నౌకకు అనుమతి -
భారత్ వ్యూహంతో చైనా ఉక్కిరిబిక్కిరి
కొలంబో: శ్రీలంకలోని హంబన్‌టోటా నౌకాశ్రయానికి నిఘా నౌక రాకుండా చేసిన భారత్ వ్యూహంతో చైనా ఉక్కిరిబిక్కిరవుతోంది. తాము అనుకున్న పనికి ఆటంకం ఏర్పడటంతో ఆందోళన చెందుతోంది. భారత్ ఒత్తిడి మేరకు నిఘా నౌక పర్యటనను నిరవధికంగా వాయిదా వేసుకోమని చైనాకు శ్రీలంక అభ్యర్థించింది. ఎలాగూ శ్రీలంక మన మాట కాదనదులే అనుకుని ప్రయాణం ప్రారంభించిన నౌక ప్రస్తుతం శ్రీలంకకు సమీపంలోని మార్గం మధ్యలో ఉంది. దీంతో శ్రీలంకతో అత్యవసర సమావేశానికి సిద్ధమైంది చైనా. కొలంబోలోని చైనా రాయబార కార్యాలయం.. శ్రీలంక ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. మరోవైపు.. ఈ విషయంపై శ్రీలంక అధ్యక్షుడు రణీల్ విక్రమసింఘే చైనా రాయబారి కిజెన్‌హోంగ్‌తో ప్రత్యేకంగా సమావేశమైనట్లు కొలంబో మీడియా పోర్టల్స్ పేర్కొన్నాయి. తదుపరి కార్యాచరణపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. అయితే.. ఈ సమావేశంపై మీడియాలో వచ్చిన వార్తలను అధ్యక్ష కార్యాలయం ఖండించింది. యువాన్వాంగ్ 5 రెండు రకాలగా ఉపయోగపడే గూఢచారి నౌక, పైగా దీన్ని అంతరిక్ష ఉపగ్రహ ట్రాకింగ్‌తోపాటు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలలోనూ వినియోగిస్తారు. అయితే ఈ నౌక తమ కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు చైనా ఉపయోగిస్తుందేమోనని భారత్ తీవ్ర ఆందోళన చెందుతుంది. ఈ విషయమై కొలంబోలో ఫిర్యాదు చేసింది కూడా. అదీగాక భారత్‌కి పొరుగున ఉన్న శ్రీలంక నుంచి చైనా బలపడుతుందేమోనని అనుమానిస్తోంది. ఇదీ చదవండి: భారత్‌కు హామీ ఇచ్చిన శ్రీలంక...చైనా నౌకకు చెక్! -
శ్రీలంక పోర్టుకు చైనా షిప్.. స్పందించిన భారత్!
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతోంది శ్రీలంక. కొలంబో సంక్షోభానికి చైనా కుట్రపూరిత రుణాలేనని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవలే.. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో మళ్లీ తన లీలలు మొదలు పెట్టింది చైనా. తన అధీనంలో ఉన్న శ్రీలంక దక్షిణ ప్రాంతంలోని హమ్‌బన్‌తోటా పోర్టుకు పరిశోధన, సర్వే నౌకను పంపిస్తోంది. అది ఆగస్టు 11న శ్రీలంక నౌకాశ్రయానికి చేరుకోనుంది. ఈ నేపథ్యంలో స్పందించింది భారత్. పరిస్థితులను ఎప్పటికప్పుడు సునిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించింది. చైనా నౌక సోమవారం పోర్టుకు వచ్చే అంశంపై కేబినెట్ చర్చించినట్లు శ్రీలంక ప్రభుత్వ ప్రతినిధి బందులా గుణవర్ధెన పేర్కొన్నారు. ‘తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న తరుణంలో భారత్, చైనాలు మాకు సాయం అందించాయి.’ అని పేర్కొన్నారు. అయితే.. చైనా వల్లే దేశంలో పరిస్థితులు దిగజారాయనే వాదనలు వినిపిస్తున్న తరుణంలో ప్రభుత్వ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నిరసన క్యాంపులను ఖాళీ చేసేందుకు ససేమిరా.. శ్రీలంకలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అధ్యక్ష భవనం సమీపంలోని గాలే ఫేస్ నిరసన క్యాంప్‌ను శుక్రవారం సాయంత్రానికి ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు. అయితే.. వాటిని తిరస్కరించారు నిరసనకారులు. నిరసనలు కొనసాగుతాయని, క్యాంపులను ఖాళీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఖాళీ చేయించేందుకు పోలీసుల వద్ద కోర్టు ఆదేశాలు లేవని పేర్కొన్నారు. గతంలో మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఈ ప్రాంతాన్ని నిరసనలు చేసుకునేందుకు అనుమతించారని గుర్తు చేశారు. ఇదీ చదవండి: Raghuram Rajan: అందుకే భారత్‌కు శ్రీలంక పరిస్థితి రాలేదు -
శ్రీలంకలో చైనా పాగా..!
కొలంబో : దక్షిణ తీరంలో ఉన్న హంబన్‌తోట ఓడరేపును శ్రీలంక ప్రభుత్వం శనివారం చైనాకు అధికారికంగా 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. శ్రీలంక ప్రభుత్వం హంబన్‌తోట నౌకాశ్రయాన్ని ఇన్వెస్ట్మెంట్ జోన్‌గా ప్రకటించడంతో చైనా ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఈ నౌకాశ్రయాన్ని ఇకపై చైనా మర్చెంట్స్ పోర్ట్ హోల్డింగ్స్ కంపెనీ అధికారికంగా నిర్వహించనుంది. ఈ ఓడరేవే లీజులో భాగంగా శ్రీలంకు చైనా ఇప్పటికే 300 మిలియన్ డాలర్ల మొత్తాన్ని చెల్లించింది. గత ఏప్రిల్‌లో చైనాలో పర్యటించిన ప్రధాని రణిల్ విక్రమసింఘే హంబన్ తోటకు నౌకాశ్రయానికి సంబంధించి చైనాతో ఒప్పందాలు చేసుకున్నారు. అందులో భాగంగానే చైనా ఇక్కడ భారీ పెట్టుబడులు పెట్టింది. ఇదిలా ఉండగా హిందూమహాసముద్రంలో అతి పెద్ద ఓడరేపుగా హంబన్‌తోటను తీర్చిదిద్దనున్నట్లు చైనా అధికారలు తెలిపారు. హంబన్‌తోట ఓడరేపుతో ఈ ప్రాంతం ఎకనమిక్ జోన్‌గా, ఇండస్ట్రియల్ జోన్, టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చెందుతుందని శ్రీలంక అధికారులు చెబుతున్నారు. -
భారత్ వ్యూహాత్మక ఆట
కొలంబో/న్యూఢిల్లీ : పొరుగుదేశాలను కలుపుకుతూ ఒన్ బెల్ట్ ఒన్ రోడ్ నిర్మిస్తున్న చైనాకు.. భారత్ ఊహించని షాక్ ఇచ్చింది. శ్రీలంకలోని హంబన్‌తోట ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న ఓడరేపుకు సమీపంలోని మట్టాల ఎయిర్‌పోర్టును ఆధునీకరించేందుకు భారత్ సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ ఎయిర్‌పోర్ట్‌ను భారీ నిధులతో అభివృద్ధి చేసి నిర్వహణ వ్యవహారాలను భారత్ పర్యవేక్షించేందుకు సిద్ధమవుతోంది. ఇదే విషయాన్ని శ్రీలంక పౌరవిమానయాన శాఖ మంత్రి నిమల్ సిరిపాల ప్రకటించారు. ఈ ఎయిర్పోర్ట్ నిర్వహణ, ఆధునికీకరణకు సంబంధించిన ప్రతిపాదనలను భారత్ ఇప్పటికే సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఎయిర్పోర్ట్ నిర్వహణ, అభివృద్ధి విషయంలో భారత్‌లో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఆయన ప్రకటించారు. హంబన్‌తోట ఓడరేవు ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే ఓడరేవుల్లో ఒకటి. ఆసియా, ఐరోపాల మధ్య జలరవాణకు ఈ ఓడరేవు ఒక వారధిలా వ్యవహరిస్తోంది. చైనా ఇక్కడే ఒన్‌బెల్ట్ ఒన్ రోడ్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం చైనా 15 వేల ఎకరాల భూమిని 99 ఏళ్ల పాటు శ్రీలంక ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకుంది. ఇక్కడేఘొక భారీ నూనె శుద్ధి కర్మాగారాన్ని నిర్మించాలని చైనా భావిస్తోంది. చైనాకు పెద్ద ఎత్తున భూమికి లీజుకు ఇవ్వడంపై స్థానికులు ఆందోళన చేస్తున్నారు. చైనా నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌ను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. శ్రీలంకలోని కొలంబో విమానాశ్రయం తరువాత అత్యంత ముఖ్యమైనది మట్టాల విమానాశ్రయమే. అయితే ఇది కొంతకాలంగా నష్టాలతోనూ, ఇతర సమస్యల్లోనూ ఉంది. ఈ నేపథ్యంలో దీనిని అభివృద్ధి చేసి, నిర్వహణ చేపట్టుందుకు శ్రీలంకతో కలిసి భారత్ పనిచేయనుంది. ఈ విమానాశ్రయాన్ని భారత్‌కు శ్రీలంక 40 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనుంది. మట్టాలా విమానాశ్రమం అభివృద్ధికి తన వాటాగా భారత్ 70 శాతం పెట్టుబడిని పెట్టనుంది. -
ఉత్కంఠ పోరులో పాక్ విజయం
శ్రీలంకతో తొలి వన్డే హంబన్‌టోట: శ్రీలంకతో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన వన్డేలో పాకిస్థాన్ జట్టు నెగ్గింది. 106 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన దశలో పాక్ ఇన్నింగ్స్‌ను సోహైబ్ మక్సూద్ (73 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు), ఫవాద్ ఆలం (61 బంతుల్లో 62; 7 ఫోర్లు) అద్భుత రీతిలో ఆదుకున్నారు. ఫలితంగా శనివారం మహింద రాజపక్స అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో మిస్బా సేన డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది. మూడు వన్డేల సిరీస్‌లో పాక్ 1-0 ఆధిక్యం సాధించగా రెండో వన్డే 26న జరుగుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక నిర్ణీత 45 ఓవర్లలో ఏడు వికెట్లకు 275 పరుగులు చేసింది. ఆరో ఓవర్ అనంతరం భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను కుదించారు. పాక్ బౌలర్లు లంక టాప్ ఆర్డర్ పని పట్టడంతో 75కే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జయవర్ధనే (66 బంతుల్లో 63; 8 ఫోర్లు)తో కలిసి కెప్టెన్ మాథ్యూస్ (85 బంతుల్లో 89; 9 ఫోర్లు; 2 సిక్సర్లు) జట్టును ఆదుకున్నాడు. వీరి జోరుకు ఐదో వికెట్‌కు 116 పరుగులు వచ్చాయి. చివర్లో ప్రియంజన్ (15 బంతుల్లో 39; 8 ఫోర్లు; 2 సిక్సర్లు) దూకుడు కారణంగా పరుగులు ధారాళంగా వచ్చాయి. వహాబ్ రియాజ్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన పాక్ 44.5 ఓవర్లలో మరో బంతి మిగిలి ఉండగా ఆరు వికెట్లకు 277 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్ షెహజాద్ (61 బంతుల్లో 49; 5 ఫోర్లు) మినహా టాప్ ఆర్డర్ విఫలమైంది. ఈ క్రమంలో మ్యాచ్‌పై పట్టు జారినట్టు కనిపించిన పాక్‌ను అనూహ్యంగా మక్సూద్, ఆలం జోడి ఆదుకుంది. 44 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన మక్సూద్ వేగంగా ఆడుతూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. 19.3 ఓవర్లపాటు కొనసాగిన వీరి హవాతో ఆరో వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఆఫ్రిది (10 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు. మాథ్యూస్, పెరీరాకు రెండేసి వికెట్లు దక్కాయి.