ఉత్కంఠ పోరులో పాక్ విజయం
శ్రీలంకతో తొలి వన్డే
హంబన్‌టోట: శ్రీలంకతో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన వన్డేలో పాకిస్థాన్ జట్టు నెగ్గింది. 106 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన దశలో పాక్ ఇన్నింగ్స్‌ను సోహైబ్ మక్సూద్ (73 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు), ఫవాద్ ఆలం (61 బంతుల్లో 62; 7 ఫోర్లు) అద్భుత రీతిలో ఆదుకున్నారు. ఫలితంగా శనివారం మహింద రాజపక్స అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో మిస్బా సేన డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది. మూడు వన్డేల సిరీస్‌లో పాక్ 1-0 ఆధిక్యం సాధించగా రెండో వన్డే 26న జరుగుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక నిర్ణీత 45 ఓవర్లలో ఏడు వికెట్లకు 275 పరుగులు చేసింది. ఆరో ఓవర్ అనంతరం భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను కుదించారు.
పాక్ బౌలర్లు లంక టాప్ ఆర్డర్ పని పట్టడంతో 75కే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జయవర్ధనే (66 బంతుల్లో 63; 8 ఫోర్లు)తో కలిసి కెప్టెన్ మాథ్యూస్ (85 బంతుల్లో 89; 9 ఫోర్లు; 2 సిక్సర్లు) జట్టును ఆదుకున్నాడు. వీరి జోరుకు ఐదో వికెట్‌కు 116 పరుగులు వచ్చాయి. చివర్లో ప్రియంజన్ (15 బంతుల్లో 39; 8 ఫోర్లు; 2 సిక్సర్లు) దూకుడు కారణంగా పరుగులు ధారాళంగా వచ్చాయి. వహాబ్ రియాజ్‌కు మూడు వికెట్లు దక్కాయి.
ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన పాక్ 44.5 ఓవర్లలో మరో బంతి మిగిలి ఉండగా ఆరు వికెట్లకు 277 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్ షెహజాద్ (61 బంతుల్లో 49; 5 ఫోర్లు) మినహా టాప్ ఆర్డర్ విఫలమైంది. ఈ క్రమంలో మ్యాచ్‌పై పట్టు జారినట్టు కనిపించిన పాక్‌ను అనూహ్యంగా మక్సూద్, ఆలం జోడి ఆదుకుంది. 44 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన మక్సూద్ వేగంగా ఆడుతూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. 19.3 ఓవర్లపాటు కొనసాగిన వీరి హవాతో ఆరో వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఆఫ్రిది (10 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు. మాథ్యూస్, పెరీరాకు రెండేసి వికెట్లు దక్కాయి.