
ఆసియా చాంపియన్ శ్రీలంకపై పాకిస్తాన్ ఘనవిజయం
షార్జా: కెప్టెన్ ఫాతిమా సనా ఖాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టడంతో మహిళల టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు శుభారంభం చేసింది. గురువారం జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్ 31 పరుగుల తేడాతో ఆసియా చాంపియన్ శ్రీలంక జట్టును ఓడించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది.
ఫాతిమా (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... నిదా దర్ (23; 1 సిక్స్), ఉమైమా సోహైల్ (18; 1 ఫోర్) రాణించారు. శ్రీలంక బౌలర్లలో చమరి ఆటపట్టు, ప్రబోధిని, సుగంధిక తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసి ఓడిపోయింది.
విష్మి గుణరత్నె (20), నీలాక్షిక సిల్వా (22) రెండంకెల స్కోరు చేయగా... కెపె్టన్ చమరి ఆటపట్టు (6) విఫలమైంది. పాకిస్తాన్ బౌలర్లలో సాదియా 3... ఫాతిమా, ఉమైమా, నష్ర తలా రెండు వికెట్లు తీశారు. ఫాతిమా సనాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.