డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌పై అడపాదడపా ఆశలు పెట్టుకున్న సౌతాఫ్రికాకు ఊహించిన షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ లుంగి ఎంగిడి గాయం కారణంగా త్వరలో జరుగబోయే నాలుగు టెస్ట్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఎంగిడి తిరిగి వచ్చే ఏడాది జనవరిలో యాక్టివ్ క్రికెట్‌లోకి వస్తాడు. డబ్ల్యూటీసీ 2023-25లో భాగంగా జరిగే తదుపరి మ్యాచ్‌లకు ఎంగిడి దూరం కావడం సౌతాఫ్రికా విజయావకాశాలను ప్రభావితం చేస్తుంది.
సౌతాఫ్రికా ఈ నెల 27 నుంచి శ్రీలంకతో.. ఆతర్వాత డిసెంబర్ 26 నుంచి పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవడం ఖాయం. ఇలా జరగాలంటే ఎంగిడి లాంటి బౌలర్ సేవలు సౌతాఫ్రికాకు ఎంతో ముఖ్యం. ఎంగిడికి స్వదేశంలో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఎంగిడి సొంతగడ్డపై ఆడిన 9 మ్యాచ్‌ల్లో 17.30 సగటున 39 వికెట్లు పడగొట్టాడు.
ఎంగిడి గాయంతో పాటు సౌతాఫ్రికాను మరో పేసర్ నండ్రే బర్గర్ గాయం కూడా వేధిస్తుంది. బర్గర్ కూడా గాయం కారణంగా త్వరలో జరుగబోయే టెస్ట్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు. అయితే మార్కో జన్సెన్, గెరాల్డ్ కొయెట్జీ సరైన్ ఫిట్‌నెస్ కలిగి అందుబాటులో ఉండటం సౌతాఫ్రికాకు ఊరట కలిగించే అంశం. వీరిద్దరు ప్రస్తుతం టీమిండియాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు భారత్‌తో టీ20 సిరీస్‌కు కగిసో రబాడకు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. రబాడ.. శ్రీలంకతో జరుగబోయే టెస్ట్ సిరీస్ సమయానికి అందుబాటులో ఉంటాడని సమాచారం.
సౌతాఫ్రికా పర్యటనలో శ్రీలంక ఆడబోయే రెండు టెస్ట్‌ల వివరాలు..
నవంబర్ 27-డిసెంబర్ 1- తొలి టెస్ట్ (డర్బన్)
డిసెంబర్ 5-9- రెండో టెస్ట్ (గెబెర్హా)
సౌతాఫ్రికా పర్యటనలో పాకిస్తాన్ ఆడబోయే రెండు టెస్ట్‌ల వివరాలు..
డిసెంబర్ 26-30- తొలి టెస్ట్ (సెంచూరియన్)
జనవరి 3-7- రెండో టెస్ట్ (కేప్‌టౌన్)
ఈ నాలుగు టెస్ట్‌లు డబ్ల్యూటీసీ 2023-25లో భాగంగా జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment