సౌతాఫ్రికాతో వన్డే.. 353 పరుగుల లక్ష్యాన్ని ఊదేసిన పాక్‌.. ఆల్‌టైమ్‌ రికార్డు | Pakistan enters tri nation tournament final with win over South Africa | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికాతో వన్డే.. 353 పరుగుల లక్ష్యాన్ని ఊదేసిన పాక్‌.. ఆల్‌టైమ్‌ రికార్డు

Feb 13 2025 4:10 AM | Updated on Feb 13 2025 9:39 AM

Pakistan enters tri nation tournament final with win over South Africa

‘శత’క్కొట్టిన రిజ్వాన్, సల్మాన్‌

దక్షిణాఫ్రికాపై విజయంతో ముక్కోణపు టోర్నీ ఫైనల్లోకి  

కరాచీ: చాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభానికి ముందు సొంతగడ్డపై పాకిస్తాన్‌ జట్టు అదరగొట్టింది. వన్డే క్రికెట్‌ చరిత్రలో తమ అత్యధిక లక్ష్యాన్ని ఛేదించింది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన మూడో మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్‌ 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈ విజయంతో పాకిస్తాన్‌ జట్టు ముక్కోణపు టోర్నీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిన పాకిస్తాన్‌... కీలక పోరులో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంది. 

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. కెప్టెన్‌ తెంబా బవుమా (96 బంతుల్లో 82; 13 ఫోర్లు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (56 బంతుల్లో 87; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), మాథ్యూ బ్రిజ్‌కీ (83; 10 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. పాకిస్తాన్‌ బౌలర్లలో షాహీన్‌ షా అఫ్రిది 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 49 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 355 పరుగులు చేసింది. 

కెప్టెన్ మొహమ్మద్‌ రిజ్వాన్‌ (128 బంతుల్లో 122 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), సల్మాన్‌ ఆఘా (103 బంతుల్లో 134; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో విజృంభించారు. ఒక దశలో 91 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పాక్‌ జట్టును సల్మాన్‌తో కలిసి రిజ్వాన్‌ ఆదుకున్నాడు. సఫారీ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ... నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 229 బంతుల్లోనే 260 పరుగులు జోడించింది. 

ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ (28 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపు ఆరంభాన్నిచ్చాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ముల్డర్‌ 2 వికెట్లు తీశాడు. సల్మాన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్‌తో శుక్రవారం పాకిస్తాన్‌ తలపడుతుంది.

1 వన్డే క్రికెట్‌ చరిత్రలో పాకిస్తాన్‌ జట్టుకు ఇదే (353)  అత్యధిక పరుగుల ఛేదన. 2022లో ఆ్రస్టేలియాపై చేసిన 349 పరుగుల ఛేదన రెండో స్థానంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement