
స్వదేశంలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు ఓవరాక్షన్ చేస్తున్నారు. సౌతాఫ్రికాతో నిన్న (ఫిబ్రవరి 12) జరిగిన మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది (Shaheen Afridi), సౌద్ షకీల్ (Saud Shakeel), కమ్రాన్ గులామ్ (Kamran Ghulam) తమ పరిధులు దాటి ప్రవర్తించారు. ఫలితంగా ఐసీసీ (ICC) ఈ ముగ్గురికి మొట్టికాయలు వేసింది. అఫ్రిది మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం.. షకీల్, గులామ్ మ్యాచ్ ఫీజుల్లో 10 శాతం కోత విధించింది. అలాగే ఈ ముగ్గురికి తలో డీమెరిట్ పాయింట్ కేటాయించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 28వ ఓవర్‌లో పరుగు తీసేందుకు ప్రయత్నించిన సౌతాఫ్రికా బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కీను షాహీన్ అఫ్రిది ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అఫ్రిది.. బ్రీట్జ్కీను కొట్టేస్తా అన్నట్లు చూశాడు. అతని మీదిమీదికి వెళ్లాడు. అఫ్రిది ఓవరాక్షన్‌ను సీరియస్‌గా తీసుకున్న ఐసీసీ ఆర్టికల్ 2.12 ఉల్లంఘణ కింద చర్యలు తీసుకుంది.
ఆ మరుసటి ఓవర్‌లోనే (29వ ఓవర్) సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను రనౌట్ చేసిన ఆనందంలో సౌద్ షకీల్, సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ కమ్రాన్ గులామ్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఔటైన బాధలో వెళ్తున్న బవుమా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి గెటౌట్ అన్నట్లు రియాక్షన్ ఇచ్చారు. షకీల్, గులామ్‌ల ఓవరాక్షన్‌ను ఫీల్డ్ అంపైర్లే తప్పుబట్టారు. ఈ విషయమై వారి కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్‌కు కంప్లైంట్ చేశారు. ఐసీసీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని షకీల్, గులామ్‌కు అక్షింతలు వేసింది.
కాగా, ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ సంచలన విజయం సాధించింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 353 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే ఊదేసింది. పాక్ వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అత్యుత్తమ లక్ష్య ఛేదన. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. బవుమా (82), బ్రీట్జ్కీ (83), క్లాసెన్ (87) అర్ద సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 352 పరుగులు చేసింది.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. మొహమ్మద్ రిజ్వాన్ (122 నాటౌట్), సల్మాన్ అఘా (134) సెంచరీలతో కదంతొక్కడంతో 49 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో పాక్ ముక్కోణపు సిరీస్‌లో ఫైనల్‌కు చేరింది. రేపు (ఫిబ్రవరి 14) జరుగబోయే ఫైనల్లో పాక్.. న్యూజిలాండ్‌ను ఢీకొట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment