బవుమా.. ద రియల్‌ కెప్టెన్‌.. ఓటమి ఎరుగని ధీరుడు..! | SA VS PAK 2nd Test: Temba Bavuma Has Not Lost A Single Test Match As Captain | Sakshi
Sakshi News home page

బవుమా.. ద రియల్‌ కెప్టెన్‌.. ఓటమి ఎరుగని ధీరుడు..!

Published Tue, Jan 7 2025 3:38 PM | Last Updated on Tue, Jan 7 2025 4:30 PM

SA VS PAK 2nd Test: Temba Bavuma Has Not Lost A Single Test Match As Captain

సౌతాఫ్రికా టెస్ట్‌ జట్టు సారథి టెంబా బవుమాపై ప్రశంసల వర్షం ​కురుస్తుంది. బవుమా తన సారథ్యంలో సౌతాఫ్రికాను తొమ్మిదింట ఎనిమిది మ్యాచ్‌ల్లో గెలిపించాడు. ఓ మ్యాచ్‌ డ్రా ముగిసింది. జట్టును విజయవంతంగా ముందుండి నడిపించడంతో పాటు బవుమా వ్యక్తిగతంగానూ అద్భుతంగా రాణిస్తున్నాడు. 

బవుమా సౌతాఫ్రికా కెప్టెన్‌గా 9 మ్యాచ్‌ల్లో 3 శతకాలు, 4 అర్ద శతకాల సాయంతో 809 పరుగులు (57.78 సగటున) చేశాడు. బవుమా తొలిసారి సౌతాఫ్రికాను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేర్చాడు. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా అగ్రస్థానంలో ఉంది.

ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సౌతాఫ్రికా చాలాకాలం తర్వాత సెకెండ్‌ ప్లేస్‌కు చేరింది. బవుమా సారథ్యంలో సౌతాఫ్రికా ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. బవుమా కెప్టెన్సీ స్కిల్స్‌కు ముగ్దులవుతున్న అభిమానులు అతన్ని గొప్ప సారధిగా కొనియాడుతున్నారు. బవుమా.. ద రియల్‌ కెప్టెన్‌.. ఓటమి ఎరుగని ధీరుడని జేజేలు పలుకుతున్నారు. బ్యాటర్‌గానూ పోరాట యోధుడని కితాబునిస్తున్నారు. బవుమా కెప్టెన్సీ భారాన్ని మోస్తూనే బ్యాటర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు.

గత 10 మ్యాచ్‌ల్లో బవుమా ప్రదర్శనలు ఇలా ఉన్నాయి..
పాక్‌పై రెండో టెస్ట్‌లో 106 (179)
పాక్‌పై తొలి టెస్ట్‌లో 31 (74), 40 (78)
శ్రీలంకపై రెండో టెస్ట్‌లో 78 (109), 66 (116)
శ్రీలంకపై తొలి టెస్ట్‌లో 70 (117), 113 (228)
వెస్టిండీస్‌పై రెండో టెస్ట్‌లో 0 (2), 4 (18)
వెస్టిండీస్‌పై తొలి టెస్ట్‌లో 86 (182), 15 (17)
భారత్‌తో తొలి టెస్ట్‌లో 0 (0)
వెస్టిండీస్‌తో రెండో టెస్ట్‌లో 28 (64), 172 (280)
వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో 0 (2), 0 (1)
ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌లో 35 (74), 17 (42)

బవుమా సారథ్యంలో సౌతాఫ్రికా వరుసగా ఏడు టెస్ట్‌ మ్యాచ్‌ల్లో గెలిచింది. అలాగే వరుసగా మూడు సిరీస్‌ల్లో 2-0 తేడాతో విజయాలు సాధించింది. కెరీర్‌లో 63 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన బవుమా 38 సగటున 3606 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 24 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా తాజాగా పాకిస్తాన్‌తో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో (రెండో టెస్ట్‌) సౌతాఫ్రికా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో కూడా గెలిచిన ప్రొటీస్‌ పాక్‌ను 2-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది.

పాక్‌తో రెండో టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 615 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ ర్యాన్‌ రికెల్టన్‌ భారీ డబుల్‌ సెంచరీతో (259) అదరగొట్టగా.. టెంబా బవుమా (106), వికెట్‌ కీపర్‌ కైల్‌ వెర్రిన్‌ (100) సెంచరీలు చేశారు. ఆఖర్లో మార్కో జన్సెన్‌ (62), కేశవ్‌ మహారాజ్‌ (40) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. 

అనంతరం పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్లు తలో చేయి వేసి పాక్‌ ఇన్నింగ్స్‌ నేలకూల్చారు. రబాడ 3, మఫాకా, మహారాజ్‌ తలో 2, మార్కో జన్సెన్‌, వియాన్‌ ముల్దర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్‌ ఆజమ్‌ (58) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మొహమ్మద్‌ రిజ్వాన్‌ (46) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ‍ప్రదర్శన కారణంగా పాక్‌ ఫాలో ఆడింది.

సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో పాక్‌ అద్భుతంగా పోరాడింది. ఫాలో ఆడుతూ సౌతాఫ్రికా గడ్డపై రికార్డు స్కోర్‌ (478) చేసింది. కెప్టెన్‌ షాన్‌ మసూద్ (145) సూపర్‌ సెంచరీతో మెరవడంతో పాక్‌ ఇన్నింగ్స్‌ పరాజయం బారి నుంచి తప్పించుకుంది. మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (81), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (41), సల్మాన్‌ అఘా (48) ఓ మోస్తరు స్కోర్లు చేసి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌ను దాటేలా చేశారు.

పాక్‌ నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్‌ కోల్పోకుండా ఛేదించి జయకేతనం ఎగురవేసింది. బెడింగ్హమ్‌ (47), మార్క్రమ్‌ (14) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌తో సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో మ్యాచ్‌లన్నీ పూర్తి చేసుకుంది. జూన్‌ 11 నుంచి లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఢీకొంటుంది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement