శతక్కొట్టిన బవుమా | Temba Bavuma Completes Hundred In Second Test Vs Pakistan | Sakshi
Sakshi News home page

శతక్కొట్టిన బవుమా

Published Fri, Jan 3 2025 9:27 PM | Last Updated on Fri, Jan 3 2025 9:27 PM

 Temba Bavuma Completes Hundred In Second Test Vs Pakistan

కేప్‌టౌన్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికా సారధి టెంబా బవుమా సెంచరీతో కదంతొక్కాడు. బవుమా 166 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్‌ల్లో బవుమాకు ఇది నాలుగో శతకం. సెంచరీ అనంతరం బవుమా (106) ఔటయ్యాడు. 

మరో ఎండ్‌లో ర్యాన్‌ రికెల్టన్‌ (219 బంతుల్లో 172; 21 ఫోర్లు, సిక్స్‌) డబుల్‌ సెంచరీకి చేరువయ్యాడు. 76.4 ఓవర్ల అనంతరం సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌ 307/4గా ఉంది. ఎయిడెన్‌ మార్క్రమ్‌ (17), వియాన్‌ ముల్దర్‌ (5), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (0), బవుమా ఔట్‌ కాగా.. రికెల్టన్‌, డేవిడ్‌ బెడింగ్హమ్‌ క్రీజ్‌లో ఉన్నారు. పాకిస్తాన్‌ బౌలర్లలో సల్మాన్‌ అఘా 2, ఖుర్రమ్‌ షెహజాద్‌, మొహమ్మద్‌ అబ్బాస్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

రికార్డు భాగస్వామ్యం
ఈ మ్యాచ్‌లో టెంబా బవుమా, ర్యాన్‌ రికెల్టన్‌ నాలుగో వికెట్‌కు 204 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. సౌతాఫ్రికా తరఫున నాలుగో వికెట్‌ ఇదే అత్యధిక భాగస్వామ్యం. సౌతాఫ్రికా తరఫున ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యాన్ని గ్రేమ్‌ స్మిత్‌, హెర్షల్‌ గిబ్స్‌ నమోదు చేశారు. 2002-03 కేప్‌టౌన్‌ టెస్ట్‌లో గిబ్స్‌-స్మిత్‌ జోడీ తొలి వికెట్‌కు 368 పరుగులు జోడించారు.

భీకర ఫామ్‌లో బవుమా
ఇటీవలి కాలంలో బవుమా భీకర ఫామ్‌లో ఉన్నాడు. బవుమా గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు, రెండు హాఫ్‌ సెంచరీలు చేశాడు.

ఫైనల్‌ల్లో సౌతాఫ్రికా
దక్షిణాఫ్రికా జట్టు ఇదివరకే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది. 2023-25 ఎడిషన్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన తొలి జట్టు సౌతాఫ్రికానే. తొలి టెస్ట్‌లో పాకిస్తాన్‌పై విజయం అనంతరం సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. మరో బెర్త్‌ కోసం ఆస్ట్రేలియా, భారత్‌ పోటీపడుతున్నాయి.

కాగా, పాక్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో జయభేరి మోగించింది. సెంచూరియన్‌ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 211, రెండో ఇన్ని​ంగ్స్‌లో 237 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 301, రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులు (8 వికెట్లు కోల్పోయి) చేసింది.

పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో కమ్రాన్‌ గులామ్‌ (54) అర్ద సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో డేన్‌ పీటర్సన్‌ 5, కార్బిన్‌ బాష్‌ 4 వికెట్లు తీశారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఎయిడెన్‌ మార్క్రమ్‌ (89), కార్బిన్‌ బాష్‌ (81 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్‌ బౌలర్లలో ఖుర్రమ్‌ షెహజాద్‌, నసీం షా తలో మూడు వికెట్లు తీశారు. 

పాక్‌ రెండో ఇన్నింగ్స్‌లో బాబర్‌ ఆజమ్‌ (50), సౌద్‌ షకీల్‌ (84) అర్ద సెంచరీలు చేశారు. మార్కో జన్సెన్‌ 6 వికెట్లు తీసి పాక్‌ పతనాన్ని శాశించాడు. 150 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా తడబడింది. మార్క్రమ్‌ (37), బవుమా (40),రబాడ (31 నాటౌట్‌) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి సౌతాఫ్రికాను గెలిపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement