అశుతోష్‌పై మండిపడ్డ ఇషాంత్‌ శర్మ.. వేలు చూపిస్తూ వార్నింగ్‌ | GT Ishant Sharma Fumes At DC Ashutosh Sharma Points Finger Warning Reason Is | Sakshi
Sakshi News home page

అశుతోష్‌ శర్మపై మండిపడ్డ ఇషాంత్‌ శర్మ.. వేలు చూపిస్తూ వార్నింగ్‌! కారణం ఇదే..

Published Sun, Apr 20 2025 11:20 AM | Last Updated on Sun, Apr 20 2025 12:05 PM

GT Ishant Sharma Fumes At DC Ashutosh Sharma Points Finger Warning Reason Is

అశుతోష్‌కు ఇషాంత్‌ వార్నింగ్‌ (Photo Courtesy: BCCI)

గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ (Ishant Sharma) సహనం కోల్పోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటర్‌ అశుతోష్‌ శర్మ (Ashuthosh Sharma)కు వేలు చూపిస్తూ మైదానంలోనే వార్నింగ్‌ ఇచ్చాడు. ఫీల్డ్‌ అంపైర్‌తో పాటు.. టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అసలేం జరిగిందంటే..

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌- ఢిల్లీ క్యాపిటల్స్‌ (GT vs DC) మధ్య శనివారం మ్యాచ్‌ జరిగింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్‌ గెలిచిన టైటాన్స్‌.. ఢిల్లీని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

అశుతోష్‌ శర్మ ధనాధన్‌
ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ ఎనిమిది వికెట్ల నష్టానికి 203 పరుగులు సాధించింది. ఓపెనర్లు అభిషేక్‌ పోరెల్‌ (9 బంతుల్లో 18), కరుణ్‌ నాయర్‌ (18 బంతుల్లో 31) వేగంగా ఆడగా.. కేఎల్‌ రాహుల్‌ (14 బంతుల్లో 28) కాసేపు మెరుపులు మెరిపించాడు.

ఇక అక్షర్‌ పటేల్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ (21 బంతుల్లో 31)తో మెరవగా.. ఢిల్లీ నయా ఫినిషర్‌ అశుతోష్‌ శర్మ (19 బంతుల్లో 37) ధనాధన్‌ బ్యాటింగ్‌తో దంచికొట్టాడు. అయితే, ఢిల్లీ ఇన్నింగ్స్‌లో పందొమ్మిదో ఓవర్‌లో గుజరాత్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ బంతితో బరిలోకి దిగాడు.

అప్పటికి డొనొవన్‌ ఫెరీరా, అశుతోష్‌ క్రీజులో ఉన్నారు. ఇషాంత్‌ బౌలింగ్‌లో తొలి బంతిని ఎదుర్కొన్న అశుతోష్‌ సింగిల్‌ తీయగా.. మరుసటి బంతికి ఫెరీరా రన్‌ పూర్తి చేశాడు. మూడో బంతికి మళ్లీ అశుతోష్‌ సింగిల్‌ తీయగా.. నాలుగో బంతికి ఫెరీరా సాయి కిషోర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఏడో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు.

వేలు చూపిస్తూ వార్నింగ్‌
ఫెరీరా స్థానంలో వచ్చిన మిచెల్‌ స్టార్క్‌ సింగిల్‌ తీయగా.. అశుతోష్‌ మళ్లీ స్ట్రైక్‌లోకి వచ్చాడు. అయితే, ఆఖరి బంతిని ఇషాంత్‌ వైడ్‌గా వేయగా.. అశుతోష్‌కు మరో బంతి ఆడే అవకాశం వచ్చింది. ఈ క్రమంలో ఇషాంత్‌ సంధించిన బౌన్సర్‌ను అశుతోష్‌ ఎదుర్కోలేకపోయాడు.

ఇక బంతి వెళ్లి వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌ చేతుల్లో పడింది. ఈ క్రమంలో బంతి అశుతోష్‌ గ్లోవ్స్‌ను తాకిందని భావించిన గుజరాత్‌ ఆటగాళ్లు బిగ్గరగా అవుట్‌కి అప్పీలు చేశారు. అయితే, అంపైర్‌ నుంచి మాత్రం ఎటువంటి స్పందనా రాలేదు. 

ఇంతలో అశుతోష్‌ బంతి భుజాన్ని రాసుకుని వెళ్లిందన్నట్లుగా సైగ చేశాడు. అశుతోష్‌ శర్మ చర్యను సహించలేకపోయిన ఇషాంత్‌ శర్మ అతడి దగ్గరికి వెళ్లి వేలు చూపిస్తూ వార్నింగ్‌ ఇచ్చినట్లు కనిపించింది.  తర్వాత అశుతోష్‌ తన షర్టును పైకెత్తి బంతి భుజానికి తాకిందని అంపైర్‌కు చెప్పే ప్రయత్నం చేశాడు.

ఇరగదీసిన బట్లర్‌
ఇంతలో అంపైర్‌తో పాటు గిల్‌ జోక్యం చేసుకుని ఇషాంత్‌ను పక్కకు తీసుకువెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. ఢిల్లీ విధించిన 204 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్‌ 19.2 ఓవర్లలో ఛేదించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ జోస్‌ బట్లర్‌ (54 బంతుల్లో 97 నాటౌట్‌), షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌ (34 బంతుల్లో 43), రాహుల్‌ తెవాటియా (3 బంతుల్లో 11 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌తో గుజరాత్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు.

చదవండి: IPL 2025: శుబ్‌మన్‌ గిల్‌కు భారీ షాక్‌!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement