మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌కు భారీ షాక్‌.. పాక్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండ‌ర్‌!? | PCB To Sack Mohammad Rizwan As T20I Captain, Shadab Khan To Lead Pakistan, Says Reports | Sakshi
Sakshi News home page

మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌కు భారీ షాక్‌.. పాక్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండ‌ర్‌!?

Published Sun, Mar 2 2025 12:39 PM | Last Updated on Sun, Mar 2 2025 1:23 PM

PCB To Sack Mohammad Rizwan As T20I Captain, Shadab Khan To Lead Pakistan: Reports

ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్తాన్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన సంగ‌తి తెలిసిందే. చెత్త ఆట‌తీరుతో టోర్నీ లీగ్ స్టేజిలోనే పాక్ ఇంటిముఖం ప‌ట్టింది. 29 ఏళ్ల త‌మ సొంత‌గ‌డ్డ‌పై జ‌రుగుతున్న ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్ క‌నీస పోటీ ఇవ్వ‌లేక‌పోవ‌డాన్ని ఆ దేశ మాజీలు, అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. పాక్ జ‌ట్టుపై ఇంటా బ‌య‌ట విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తునే ఉంది.

న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌లో 60 ప‌రుగుల తేడాతో ఓట‌మి చ‌విచూసిన పాకిస్తాన్‌.. భార‌త్‌పై 6 వికెట్ల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. బంగ్లాదేశ్‌తో జ‌ర‌గాల్సిన మూడో మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయింది. దీంతో క‌నీసం ఒక్క విజ‌యం కూడా లేకుండా పాకిస్తాన్ త‌మ ఛాంపియ‌న్స్ ట్రోఫీ ప్ర‌యాణాన్ని ముగించింది. ఈ క్ర‌మంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

రిజ్వాన్‌పై వేటు..!
పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు వైట్‌బాల్ కెప్టెన్‌గా ఉన్న మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌పై వేటు ప‌డ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వ‌న్డేల్లో కాకుండా పాక్ టీ20 కెప్టెన్‌గా రిజ్వాన్ త‌ప్పించాల‌ని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ యోచిస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. రిజ్వాన్ స్ధానంలో స్టార్ ఆల్‌రౌండ‌ర్ షాదాబ్ ఖాన్‌ను నియ‌మించాల‌ని మొహ్సిన్ నఖ్వీ ఫిక్స్ అయిన‌ట్లు స‌మాచారం.

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న బోర్డు మీటింగ్‌లో ఈ విష‌యంపై నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు పీసీబీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. పాకిస్తాన్ జ‌ట్టు ఈ నెల‌లో వైట్ బాల్ సిరీస్‌లు ఆడేందుకు న్యూజిలాండ్‌కు వెళ్ల‌నుంది. ఈ టూర్‌లో భాగంగా పాక్ జ‌ట్టు ఆతిథ్య కివీస్‌తో ఐదు టీ20లు, మూడు వ‌న్డేల సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నుంది. మార్చి 16న‌ క్రైస్ట్‌చర్చ్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి టీ20తో పాక్ ప‌ర్య‌ట‌న ప్రారంభం కానుంది. 

ఈ సిరీస్‌తోనే పాక్ టీ20 కెప్టెన్‌గా షాదాబ్ త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభించే అవ‌కాశ‌ముంది. షాదాబ్‌ ఖాన్‌ గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అతడు చివరగా పాక్‌ తరపున గతేడాది జూన్‌లో ఐర్లాండ్‌పై ఆడాడు. కానీ దేశవాళీ క్రికెట్‌తో పాటు ఫ్రాంచైజీ క్రికెట్‌ లీగ్స్‌లో షాదాబ్‌ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి జట్టు పగ్గాలను అప్పగించాలని పీసీబీ భావిస్తోంది. మరోవైపు తాత్కాలిక హెడ్‌ కోచ్‌ అకిబ్‌ జావిద్‌పై కూడా వేటు వేసేందుకు పీసీబీ సిద్దమైంది.
చదవండి: కివీస్‌తో మ్యాచ్‌.. స్టార్‌ ప్లేయర్లకు రెస్ట్‌! విధ్వంసకర వీరుడి ఎం‍ట్రీ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement