వరల్డ్ రికార్డ్: పాక్ అంపైర్ అరుదైన ఘనత
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కు చెందిన అంపైర్ అలీమ్ దార్(48) ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దక్షిణాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య కెప్‌టౌన్‌లో జరుగుతున్న రెండో టెస్టుకు అంపైర్‌గా వ్యవహరించడం ద్వారా అత్యధిక మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసిన వ్యక్తిగా నిలిచారు. టెస్టులు, వన్డేలు, టీ20లు మొత్తం కలిసి 332 మ్యాచ్‌లకు అంపైర్ గా వ్యహరించిన పాక్ అంపైర్ అలీమ్ దార్ దక్షిణాఫ్రికా అంపైర్ రూడీ కొర్ట్‌జన్ పేరిట ఉన్న (331 మ్యాచ్‌లు) రికార్డును అదిగమించారు. ఇందులో 109 టెస్టులు, 182 వన్డేలు, 41 టీ20లు మ్యాచ్‌లు ఉన్నాయి. మరికొంత కాలం ఫీల్డ్‌లో ఉండే అవకాశం ఉన్నందున త్వరలోనే జమైకా దేశానికి చెందిన స్టీవ్ బక్నర్ (128) టెస్టుల అంపైరింగ్ రికార్డు ఈజీగా బ్రేక్ అవుతుంది.
అలీమ్ దార్ 2000 ఏడాది అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఓవరాల్‌గా ఆయన 405 మ్యాచ్‌లకు అంపైరింగ్ చేయగా, ఇందులో 332 మ్యాచ్‌ల్లో ఆన్ ఫీల్డ్ లో ఉండగా.. 73 మ్యాచ్‌లకు టీవీ అంపైర్‌గా పనిచేశారు. ఐసీసీ అంపైర్ల ప్యానల్ లో భాగస్వామి అయిన అలీమ్ దార్... 2009, 2010, 2011లలో వరుసగా మూడేళ్లు ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కైవసం చేసుకుని తన ప్రత్యేకత చాటుకున్నారు. 2011లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ మ్యాచ్‌లోనూ ఈ పాక్ అంపైర్ బాధ్యతలు నిర్వహించారు.