హాంగ్‌కాంగ్ సూపర్ సిక్సస్ విజేతగా శ్రీలంక అవతరించింది. ఇవాళ (నవంబర్ 3) జరిగిన ఫైనల్లో శ్రీలంక పాకిస్తాన్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 5.2 ఓవర్లలో 72 పరుగులకు ఆలౌటైంది (6 వికెట్లు). పాక్ ఇన్నింగ్స్‌లో ముహమ్మద్ అఖ్‌లక్ (20 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ ఫహీమ్ అష్రాఫ్ 13, ఆసిఫ్ అలీ 0, హుసేన్ తలాత్ 1, ఆమెర్ యామిన్ 6, షహాబ్ ఖాన్ 1 పరుగు చేశారు. లంక బౌలర్లలో ధనంజయ లక్షన్, థరిందు రత్నాయకే తలో రెండు వికెట్లు.. నిమేశ్ విముక్తి, లిహీరు మధుషంక చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం 73 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. సందున్ వీరక్కొడి 13 బంతుల్లో బౌండరీ, నాలుగు సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేయగా.. లిహీరు మధుషంక 5 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 19 పరుగులు చేశాడు. ఆఖర్లో థరిందు రత్నాయకే 4 బంతుల్లో బౌండరీ, 2 సిక్సర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. లంక ఇన్నింగ్స్‌లో ధనంజయ లక్షన్ 2, లహీరు సమరకూన్ ఒక్క పరుగు చేశారు. పాక్ బౌలర్లలో ఫహీమ్ అష్రాఫ్, హుసేన్ తలత్ తలో వికెట్ పడగొట్టారు. శ్రీలంకకు ఇది రెండో హాంగ్‌కాంగ్ సూపర్ సిక్సస్ టైటిల్.
Comments
Please login to add a commentAdd a comment