China ship
-
Houthi Rebels: చైనా ఆయిల్ నౌకపై ‘హౌతీ’ల దాడి
వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో వాణిజ్యనౌకలపై హౌతీలు దాడులు పెంచారు. తాజాగా శనివారం(మార్చ్ 23) యెమెన్ తీరానికి సమీపంలో చైనాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ నౌక ఎంవీ హంగ్ పూ పై హౌతీలు బాలిస్టిక్ మిసైళ్లతో దాడి చేశారు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ ముఖ్య కార్యాలయం సెంట్రల్ కమాండ్(సెంట్ కామ్) ఆదివారం(మార్చ్ 24) ఎక్స్(ట్విటర్)లో ధృవీకరించింది. పనామా ఫ్లాగ్‌తో నడుస్తున్న ఈ నౌకను చైనా యాజమాన్యం నిర్వహిస్తోంది. MARCH 23 RED SEA UPDATE From 2:50 to 4:30 a.m. (Sanaa time) March 23, the Iranian-backed Houthis launched four anti-ship ballistic missiles (ASBM) into the Red Sea in the vicinity of M/V Huang Pu, a Panamanian-flagged, Chinese-owned, Chinese-operated oil tanker. At 4:25 p.m.… pic.twitter.com/n1RwYdW87E — U.S. Central Command (@CENTCOM) March 24, 2024 ఆయిల్ ట్యాంకర్ నౌక భారత్‌లోని మంగళూరు పోర్టుకు రావాల్సి ఉంది. ఈ దాడిలో నౌకలోని సిబ్బంది ఎవరూ గాయపడలేదు. నౌకలో మంటలు చెలరేగినప్పటికీ 30 నిమిషాల్లో వాటిని ఆర్పివేశారు. అనంతరం నౌక మళ్లీ ప్రయాణం ప్రారంభించింది. చైనా, భారత్ నౌకలపై ఎలాంటి దాడులు చేయబోమని చెప్పిన హౌతీలు తాజా దాడితో మాట తప్పారు. కాగా ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా హౌతీ మిలిటెంట్లు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై గత కొంతకాలంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడుల కారణంగా ఆసియా నుంచి అమెరికా, యూరప్ వెళ్లే నౌకలకు దూరం పెరిగి ఖర్చు మోపెడవుతోంది. యెమెన్‌లోని హౌతీల స్థావరాలపై అమెరికా, బ్రిటన్లు ఎప్పటికప్పుడు దాడులు చేస్తన్నాయి. ఇదీ చదవండి.. ఉక్రెయిన్‌పై రష్యా మిసైళ్ల వర్షం.. అందుకు ప్రతీకారమే ! -
హిందూ సాగరంలోకి చైనా నిఘా నౌక.. భారత క్షిపణి పరీక్ష వాయిదా!
న్యూఢిల్లీ: చైనాకు చెంది నిఘా నౌక యువాన్ వాంగ్-5 ఈ ఏడాది ఆగస్టులో శ్రీలంకలోని హంబన్‌టోట పోర్టుకు చేరుకున్న క్రమంలో భారత్-చైనాల మధ్య దౌత్యపరమైన సమస్య తలెత్తింది. ఇప్పుడు మళ్లీ చైనాకు చెందన మరో నిఘా నౌక వల్ల భారత్ చేపట్టబోయే క్షిపణి పరీక్షపై ప్రభావం పడుతోంది. డ్రాగన్‌కు చెందన నిఘా నౌక హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించిందని, దాని కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత నౌకాదళం తెలిపింది. నవంబరు 10-11 తేదీల్లో దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టనున్నట్లు ఇటీవలే నోటమ్ (నోటీస్ టు ఎయిర్‌మెన్) జారీ చేసింది భారత్. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ ప్రయోగం నిర్వహించనున్నారు. 2,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ క్షిపణి.. శ్రీలంక, ఇండోనేషియా మధ్య ఉన్న ప్రాంతంలో సాగనుంది. అయితే నోటమ్ జారీ చేసిన తర్వాత చైనాకు చెందిన యువాన్ వాంగ్-6 అనే నిఘా, పరిశోధక నౌక.. హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించటం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత క్షిపణులు, ఉపగ్రహాల కదలికలను పరిశీలించే సామర్థ్యం ఆ నిఘా నౌకకు ఉండటమే అందుకు కారణం. ఈ నౌక ఇండోనేషియాలోని బాలీ తీరం నుంచి శుక్రవారం ఉదయమే బయల్దేరింది. భారత క్షిపణి ప్రయోగానికి కొద్ది రోజుల ముందే ఈ నౌకను హిందూ మహా సముద్రంలోకి పంపించడం.. మన ఆయుధ పాటవంపై కన్నేసి ఉంచడానికే డ్రాగన్ చేసిన కుట్రగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్షిపణి పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేయాలని స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: లక్ష ఉద్యోగాలు.. ఓపీఎస్ పునరుద్ధరణ.. మహిళలకు రూ.1,500: కాంగ్రెస్ హామీల వర్షం -
‘చేతనైతే శ్రీలంకకు సాయం చేయండి.. కానీ’.. చైనాకు భారత్ చురకలు!
కొలంబో: శ్రీలంకలోని హంబన్‌టోటా నౌకాశ్రయానికి ఇటీవలే హైటెక్ నిఘా నౌకను తీసుకొచ్చింది చైనా. ఈ నౌకను హంబన్‌టోటాలో కొన్ని రోజులు నిలిపి ఉంచటంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే.. భారత్ ఆందోళనలను తోసిపుచ్చుతూ చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో చైనాకు చురకలు అంటించింది న్యూఢిల్లీ. కొలంబోకు ప్రస్తుతం మద్దతు కావాలని, అనవసరమైన ఒత్తిడి, అనవసర వివాదాలతో ఇతర దేశాల ఎజెండాను రుద్దటం కాదని స్పష్టం చేసింది. ‘చైనా రాయబారి చేసిన వ్యాఖ్యలను పరిశీలించాం. ఆయన ప్రాథమిక దౌత్య మర్యాదలను ఉల్లంఘించడం వ్యక్తిగత లక్షణం కావచ్చు లేదా ఆ దేశ వైఖరిని సూచించొచ్చు. చైనా రాయబారి క్వి జెన్‌హాంగ్ భారతదేశం పట్ల చూపుతున్న దృక్పథం అతని స్వంత దేశం ఎలా ప్రవర్తిస్తుందనే దానిని సూచిస్తోంది. భారత్ అందుకు చాలా భిన్నమని ఆయనకు తెలుపుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీలంకకు మద్దతు అవసరం. కానీ అనవసరమైన ఒత్తిడి, ఇతర దేశాల ఎజెండాను రుద్దేందుకు అవసరం లేని వివాదాలు కాదు.’ అని ట్వీట్ చేసింది శ్రీలంకలోని భారత హైకమిషన్. భారత్ అభ్యంతరాలపై చైనా రాయబారి గత శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా భద్రతా పరమైన ఆందోళనలను లేవనెత్తటం బయటినుంచి అవరోధం కలిగించటమేనన్నారు. అలాగే.. అది శ్రీలంక సార్వభౌమత్వం, స్వంతంత్రతలో కలుగజేసుకోవటమేనని భారత్‌పై ఆరోపణలు చేశారు. అయితే, నౌకపై శ్రీలంక, చైనాలు ఉమ్మడిగా చర్చించి ఇరు దేశాల ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమత్వం, స్వతంత్రతను కాపాడుకునేందుకు నిర్ణయించటం సంతోషంగా ఉందన్నారు. ఇదీ చదవండి: శ్రీలంకను వీడిన చైనా నిఘా నౌక -
‘లంక రేవు’ను పర్యవేక్షిస్తున్నాం: జైశంకర్
బ్యాంకాక్: శ్రీలంక పోర్టు హంబన్‌టొటలో చైనా నిఘా నౌక యువాన్ వాంగ్ 5 రావడంతో భారత్ భద్రతకు భంగం వాటిల్లే పరిణామమేదైనా జరుగుతుందేమోనని పర్యవేక్షిస్తున్నామని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ చెప్పారు. భారత్ థాయ్‌లాండ్ జాయింట్ కమిషన్ భేటీ సందర్భంగా జైశంకర్ మాట్లాడారు. మా పొరుగు దేశంలో జరిగే ఎలాంటి పరిణామాలైననా గమనిస్తూ ఉంటామని చెప్పారు. చైనాకు చెందిన హైటెక్ నౌక యువాన్ వాంగ్ 5 శాంతి, స్నేహ సంబంధాల మిషన్ అని ఆ నౌక కెప్టెన్ జాంగ్ హాంగ్వాంగ్ పేర్కొన్నారు. భారత్ అభ్యంతరాలు, ఆందోళనలు బేఖాతర్ చేస్తూ చైనా హైటెక్ నిఘా నౌక యువాన్ వాంగ్ 5 శ్రీలంకలోని హంబన్‌టొట రేవు పట్టణంలోకి మంగళవారం ఉదయం ప్రవేశించింది. ఈ విషయాన్ని పోర్టు అధికారులు వెల్లడించారు. ఇంధనం నింపుకోవడానికే ఈ రేపులో ఆగినట్టుగా చైనా బయటకి చెబుతున్నప్పటికీ మన దేశ రక్షణ కార్యకలాపాలపై నిఘా వేయడం కోసమే డ్రాగన్ ఈ నౌకను పంపినట్టుగా అనుమానాలు వెలువడుతున్నాయి. ఇదీ చదవండి: భారత్, శ్రీలంక.. ఒక చైనా నౌక -
సాక్షి కార్టూన్ 18-08-2022
సాక్షి కార్టూన్ 18-08-2022 -
భారత్, శ్రీలంక.. ఒక చైనా నౌక
భారత్ అభ్యంతరాలు, ఆందోళనలు బేఖాతర్ చేస్తూ చైనా హైటెక్ నిఘా నౌక యువాన్ వాంగ్ 5 శ్రీలంకలోని హంబన్‌టొట రేవు పట్టణంలోకి మంగళవారం ఉదయం ప్రవేశించింది. ఈ విషయాన్ని పోర్టు అధికారులు వెల్లడించారు. ఇంధనం నింపుకోవడానికే ఈ రేపులో ఆగినట్టుగా చైనా బయటకి చెబుతున్నప్పటికీ మన దేశ రక్షణ కార్యకలాపాలపై నిఘా వేయడం కోసమే డ్రాగన్ ఈ నౌకను పంపినట్టుగా అనుమానాలు వెలువడుతున్నాయి. ఆగస్టు 11వ తేదీనే ఈ నౌక శ్రీలంకకు రావాల్సి ఉంది. అయితే ఈ నౌక రాకను అడ్డుకోవాల్సిందిగా శ్రీలంకలోని రణిల్ సింఘె ప్రభుత్వానికి భారత్ విజ్ఞప్తి చేసింది. భారత్ అభ్యంతరాలను చైనా దృష్టికి తీసుకువెళుతూ చైనా ఆ నౌక రావడానికి తొలుత అనుమతి నిరాకరించింది. కానీ చైనా నుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి ఆఖరి నిమిషంలో అనుమతినిచ్చింది. 2020లో లద్ధాఖ్లోని గల్వాన్ లోయలో ఘర్షణలతో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు రాజుకుంటూనే ఉన్నాయి. ఈ నిఘా నౌకతో అవి మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు భారత్ ఆందోళనల్ని చైనా కొట్టి పారేస్తోంది. తమ నౌక కార్యకలాపాలు ఏ దేశ భద్రతకు ముప్పు కావని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ అన్నారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడే సర్వసాధారణంగా జరిగే పరిశోధనలనే యువాన్ వాంగ్ 5 చేస్తుందని అంటున్నారు. భారత రక్షణ ప్రమాదంలో పడుతుందా ? యువాన్ వాంగ్ 5 ఒక పరిశోధన నౌక అని చైనా చెప్పుకుంటోంది. కానీ ఇది పరిశోధనలు, సర్వేలతో పాటు నిఘా కూడా పెట్టగలదు. భారత్ మిలటరీ ప్రాంతాలన్నింటిపైనే నిఘా ఉంచే సామర్థ్యం ఈ నౌకకి ఉంది. యువాన్ వాంగ్ సిరీస్‌లో మూడో జనరేషన్‌కు చెందిన ట్రాకింగ్ నౌక ఇది. ఖండాంతర క్షిపణులు, ఉపగ్రహాలు, రాకెట్లను ట్రాక్ చేసే ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఈ నౌకలో ఉంది. 750 కి.మీ. దూరంలో ఉన్నవన్నీ ఈ నౌక రాడార్ పరిధిలోకి వస్తాయి. శ్రీలంకలోని హంబన్‌టొట రేవులోకి ఈ నౌక ప్రవేశించడం వల్ల భారత్‌లోని తూర్పు కోస్తా రేవు పట్టణాల్లో జరిగే వ్యూహాత్మక కార్యకలాపాలన్నీ ఈ నౌక రాడార్ పరిధిలోకి వస్తాయి. శ్రీలంక తీరంలో ఆ నౌక ఉన్న సమయంలో భారత్ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తే వాటి గురించి మొత్తం ఆ నౌక ద్వారా తెలుసుకోవచ్చు. శ్రీలంక రేవులో యువాన్ వాంగ్5 ఉన్నంతవరకు తమిళనాడులో ఉన్న 1,076 కి.మీ. తీర ప్రాంతంపై నిఘా పెట్టొచ్చు. కల్పకం, కూడంకుళం వంటి అణు విద్యుత్ కేంద్రాలు ఈ నౌక రాడార్లోకి రావడం వల్ల భారత్‌లో ఆందోళన పెరుగుతోంది. ఇంధనం నింపుకోవడానికే హంబన్‌టొటలో ఆగుతున్నామని చైనా చెబుతోంది. అయితే జూలై 14న చైనా నుంచి బయల్దేరిన ఈ నౌక ఇప్పటివరకు ఏ రేవు పట్టణంలోనూ ఆగకపోవడంతో మన దేశ మిలటరీ కార్యకలాపాలను పసిగట్టడం కోసమే వచ్చిందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి సముద్ర గర్భంలో సర్వేలు నిర్వహించే సత్తా కూడా ఈ నౌకకి ఉంది. దీనివల్ల జలాంతర్గాముల గుట్టు మట్లు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. చైనా కంపెనీ అధీనంలో హంబన్‌టొట పోర్టు శ్రీలంక రేవు పట్టణంలో చైనా నౌక ఉన్నంతవరకు ఎలాంటి శాస్త్రీయమైన పరిశోధనలు జరపడానికి తాము అనుమతించబోమని శ్రీలంక పోర్ట్ అథారిటీ చెబుతోంది. నౌకకు సంబంధించిన ఆటోమేటిక్ ఐడెంటిఫికేసన్ సిస్టమ్‌ని ఆఫ్‌లో ఉంచాలన్న నిబంధన పైనే నౌక రావడానికి అనుమతిచ్చామని అంటోంది. అయితే హంబన్‌టొట పోర్టు చైనా కంపెనీ చేతిలో లీజులో ఉంది. ఈ ఓడరేవు నిర్మాణానికి చైనాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ 120 కోట్ల డాలర్లు రుణంగా ఇచ్చింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక ఆ రుణాలు తీర్చలేకపోవడంతో చైనా మర్చంట్ పోర్టు సంస్థ 2017లో 99 ఏళ్ల పాటు ఈ పోర్టుని లీజుకి తీసుకుంది. ఈ కంపెనీయే రేవు పట్టణంలో రోజు వారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఇది భారత్‌కు మరింత ఆందోళన పెంచుతోంది.. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కనుసన్నల్లోనే ఈ నౌక నడుస్తుందని అమెరికా రక్షణ శాఖ కూడా ధ్రువీకరించింది. వ్యూహాత్మక ప్రాంతంలో పోర్టు అంతర్జాతీయ నౌకలు ప్రయాణించే మార్గంలో తూర్పు, పశ్చిమ సముద్ర ప్రాంతాలు కలిసే చోటుకి 10 నాటికల్ మైళ్ల దూరంలో హంబన్‌టొట ఉంది. ఆసియా, యూరప్ మధ్య నిత్యం 36 వేల రవాణా నౌకలు తిరుగుతూ ఉంటాయి. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చే చమురులో 50% ఈ మార్గం ద్వారానే సరఫరా అవుతుంది.ఈ రేవు ద్వారా వెళ్లడం ద్వారా ఆసియా, యూరప్ మధ్య మూడు రోజుల ప్రయాణం కలిసొస్తుంది. ఆ మేరకు చమురు ఆదా అవుతుంది. డ్రాగన్ కొత్త ఎత్తులు ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న దేశాల అవసరాలను తీరుస్తామన్న చెప్పుకొని డ్రాగన్ దేశం తమ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకుంటోంది. శ్రీలంక ఆర్థికంగా కుంగిపోయి అధ్యక్షుడు మహీందా రాజపక్స దేశం విడిచిపోయిన పారిపోయిన పరిస్థితుల్లో భారత్ ఆ దేశాన్ని ఎన్నో విధాలుగా ఆదుకుంది. 350 కోట్ల డాలర్లను అప్పుగా ఇవ్వడంతో పాటు ఆహారం, మందులు, చమురు పంపించింది. అటు చైనా నుంచి కూడా శ్రీలంక చాలా అప్పులు చేసింది. 2005–2017 మధ్యలో 1500 కోట్ల డాలర్లను అప్పుగా ఇచ్చింది. ఇప్పుడు భారత్ కూడా సాయం చేస్తూ ఉండడంతో లంకపై భారత్ పట్టు పెరిగిపోతుందన్న భయం చైనాకు పట్టుకుంది. అందుకే శ్రీలంకలో భారత్ ప్రాభవాన్ని తగ్గించడం కోసం వ్యూహాలు పన్నుతోంది. ఆ దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు, రోడ్డు, రైలు, విమానాశ్రయాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. శ్రీలంక కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి అప్పు తేవడానికి కావల్సిన మాట సాయాన్ని చైనా నుంచి ఆశిస్తోంది. దీనిపై ఇరు దేశాల మధ్య చర్చలు సాగుతున్నాయి. ఎవరినీ నొప్పించకూడదన్న లక్ష్యంతో శ్రీలంక ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్నా చైనా నుంచి వస్తున్న ఒత్తిళ్లే ఆ దేశంపై అధికంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. యువాన్ వాంగ్ 5 ► చైనాలోని జియాంగ్నన్ షిప్‌యార్డ్‌లో నిర్మాణం ► 2007 నుంచి విధుల్లోకి ► పొడవు 222 మీటర్లు – ► వెడల్పు 25.2 మీటర్లు ► నౌకలో అత్యంత ఆధునిక సాంకేతిక నిఘా వ్యవస్థ ► నింగి నేల నీరు అన్నింటిపై నిఘా పెట్టే సామర్థ్యం ► గత నెలలో చైనా లాంగ్ మార్చ్ ► 5బీ రాకెట్ ప్రయోగంపై నిఘా – నేషనల్ డెస్క్, సాక్షి -
చైనా ‘స్పై షిప్’తో భారత్ ఆందోళనకు గల కారణాలేంటి?
న్యూఢిల్లీ: భారత్ భద్రతా పరమైన ఆందోళనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ చైనాకు చెందిన నిఘా నౌకా శ్రీలంకలోని హంబన్‌తోటా పోర్టుకు మంగళవారం చేరింది. తొలుత నౌక ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని చైనాకు సూచించిన శ్రీలంక.. భారత్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అనుమతులు ఇచ్చింది. అసలు.. ఇంతకి చైనా స్పై షిప్‌తో భారత్ ఆందోళన చెందేందుకు గల 5 ప్రధాన కారణాలు తెలుసుకుందాం. ► చైనా యాంగ్ వాంగ్ 5 నిఘా నౌక సెన్సార్లు కలిగి ఉంది. భారత్ బాలిస్టిక్ మిసైల్స్‌ను ప్రయోగిస్తే వాటిని ట్రాక్ చేయగలదు. ఈ మిసైల్స్‌ను భారత్ ఒడిశాలోని అబ్దుల్ కలామ్ ఐలాండ్ నుంచి ప్రయోగిస్తుంటుంది. ► యాంగ్ వాంగ్ 5లోని అత్యాధునిక సాంకేతిక సామర్థ్యాలను ఉపయోగించికొని.. భారత క్షిపణుల పరిధి, ఖచ్చితత్వాన్ని అంచనా వేయగలగుతుంది చైనా. దీంతో మన క్షిపణుల వివరాలు డ్రాగన్ చేతికి చిక్కినట్లవుతుంది. ఆ నౌక ఆగస్టు 22 వరకు శ్రీలంకలోనే ఉండనుంది. ► యాంగ్ వాంగ్ 5 సముద్రంలో సర్వేలు నిర్వహించగలదు. దాంతో హిందూ మహా సముద్రంలో సబ్‌మెరైన్ కార్యకలాపాలు సాగించేందుకు వీలు కలగనుంది. 2021లో చైనాకు చెందిన సర్వే నౌక షియాంగ్ యాంగ్ హంగ్ 03 ఇలాంటి సర్వేలే నిర్వహించింది. ► 2014లో చైనాకు చెందిన అణ్వాయుధ సామర్థ్యం కలిగిన నౌకను ఓ పోర్టులోకి శ్రీలంక అనుమతించింది. దాంతో భారత్-శ్రీలంక మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, ఈసారి చైనా నౌక ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఆన్ చేసి ఉంటుందని, శాస్త్రపరమైన పరిశోధనలు చేసేందుకు అనుమతించటం లేదని శ్రీలంక పేర్కొంది. హంబన్‌తోటా నౌకాశ్రయం కార్యకలాపాలను చైనా సంస్థ నిర్వహిస్తున్నప్పటికీ ఆపరేషనల్ సమస్యలను తామే చూసుకుంటున్నట్లు శ్రీలంక పోర్ట్స్ అథారిటీ తెలిపింది. ► చైనాకు రుణాలు చెల్లించలేక హంబన్‌తోటా నౌకాశ్రయాన్ని 99 ఏళ్ల లీజుకు ఇచ్చిన క్రమంలో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ పోర్టును మిలిటరీ అవసరాల కోసం ఉపయోగించే ప్రమాదం ఉందని ముందు నుంచే హెచ్చరిస్తోంది భారత్. ఇదీ చదవండి: భారత్ హెచ్చరికలు బేఖాతరు.. శ్రీలంక చేరిన చైనా ‘స్పై షిప్’ -
భారత్ హెచ్చరికలు బేఖాతరు.. శ్రీలంక చేరిన చైనా ‘స్పై షిప్’
కొలంబో: చైనాకు చెందిన ఉన్నతస్థాయి పరిశోధక నౌక శ్రీలంకలోని హంబన్‌తోటా నౌకాశ్రయానికి మంగళవారం చేరుకుంది. స్పై షిప్ రాకపై భారత్ భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తం చేసిన కొద్ది రోజుల్లోనే పోర్టుకు చేరుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వాంగ్ యాంగ్ 5 నౌక శ్రీలంక పోర్టుకు చేరుకున్నట్లు హర్బర్ మాస్టర్ కెప్టెన్ నిర్మల్ డీ సిల్వా తెలిపారు. పొరుగు దేశంలో చైనా నౌక ఉండటంపై భారత్ ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌కు చెందిన వ్యవస్థలపై నిఘావేసే ప్రమాదం ఉందని పేర్కొంది. దీంతో షిప్ రాకను వాయిదా వేసుకోవాలని చైనాకు సూచించింది శ్రీలంక. అయితే, చైనా ఒత్తిడికి తలొగ్గి గత శనివారం అనుమతులు జారీ చేసింది. ఆగస్టు 16 నుంచి 22 మధ్య నౌక తమ పోర్టులో ఉండేందుకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ‘చైనాకు చెందిన వాంగ్ యాంగ్ 5 నౌక నిర్వహణలో పొరుగు దేశం భద్రతకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. అందరి ఆందోళనలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.’ అని శ్రీలంక విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది. అంతకు ముందు భారత్, అమెరికాల ఆందోళనలను తప్పుపట్టింది చైనా. శ్రీలంకపై ఒత్తిడి పెంచేందుకు భద్రతాపరమైన అంశాలను లేవనెత్తటం పూర్తిగా అసంబద్ధమని పేర్కొంది. చైనా సముద్ర శాస్త్ర పరిశోధన కార్యకలాపాలను హేతుబద్ధమైన కోణంలో చూడాలని, చైనా, శ్రీలంక మధ్య సహకారానికి అంతరాయం కలిగించకుండా ఆపాలని సంబంధిత పక్షాలను కోరుతున్నామని చెలిపారు డ్రాగన్ విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్. ఇదీ చదవండి: భారత ఆందోళనను లెక్కచేయని శ్రీలంక.. చైనా నిఘా నౌకకు అనుమతి -
సింహళ తీరంలో నిఘానేత్రం
వ్యూహాత్మకంగా కీలకమైన హంబన్‌తోట అంతర్జాతీయ నౌకాశ్రయంలో చైనా సైనిక గూఢచర్య నౌక ‘యువాన్ వాంగ్5’ లంగరేయడానికి శ్రీలంక ఇచ్చిన అనుమతి చర్చోపచర్చలకు దారితీస్తోంది. సదరు పోర్ట్‌పై పట్టు బిగించిన చైనా, వ్యతిరేకిస్తున్న భారత్‌ల మధ్య సర్దుబాటు చేసుకోలేక సిలోన్ సతమతమవుతోంది. ఉపగ్రహ, రాకెట్, ఖండాంతర గతిశీల క్షిపణుల ప్రయోగాల ఆచూకీ తెలుసు కొనేందుకు వాడే ఈ ‘యువాన్ వాంగ్’ శ్రేణి పరిశోధక, సర్వే నౌక మన దేశానికి అతి సమీపంలో వారం పాటు తిష్ఠ వేయడం ఆందోళనకరమే. గగనతలాన 750 కిలోమీటర్ల పైగా కన్నేయగల ఈ షిప్పుతో కేరళ, తమిళనాడు, ఏపీల్లోని అనేక పోర్ట్‌లు చైనా రాడార్లోకి వచ్చేస్తాయి. కల్పాక్కం, కూడంకుళం లాంటి అణుపరిశోధక కేంద్రాలు సహా దక్షిణాదిలోని కీలక ప్రాంతాలూ డ్రాగన్ గూఢ చర్యం బారిన పడే ప్రమాదం ఉంది. ఈ వార్తలే ఇప్పుడు మన దేశాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. ఆగస్టు 11 నుంచి 17 దాకా సింహళ తీరంలో ఉండే సదరు నిఘానౌక రాక పట్ల శ్రీలంక దేశాధ్యక్షుడితోనే భారత్ తన అభ్యంతరం తెలిపింది. ఆ నౌక తమ దగ్గరకు వస్తున్నది ఇంధనం, అవసరమైన సరుకులు నింపుకోవడానికే అని సిలోన్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న లంకేయులకు భారత్ అందిస్తూ వస్తున్న సాయంపై పార్లమెంట్ సాక్షిగా ప్రశంసాగీతం అందుకొని, అధ్యక్షుడు నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఆర్థికకష్టాల్లోనే∙కాదు... అంతకు ముందూ ‘సువసరియా’ అంబులెన్స్ సర్వీసుకు భారత్ సాయమే వేలాది ప్రాణాలు కాపాడిందని గుర్తుచేసుకున్నారు. కానీ మాటల్లోని మెచ్చుకోలుకు భిన్నమైన శ్రీలంక చేతలే సమస్య. ఆసియా, ఐరోపాలను కలిపే సూయజ్ కాలువకూ, మలక్కా జలసంధికీ మధ్య అతి ముఖ్యమైన నౌకాయాన మార్గంలో సింహళం ఉంది. 4500 చమురు ట్యాంకర్లతో సహా దాదాపు 36 వేల నౌకలు ఆ మార్గంలో ఏటా పయనిస్తాయని లెక్క. కొలంబో నౌకాశ్రయం తర్వాత శ్రీలంకలో రెండో అతి పెద్దదైన హంబన్‌తోట ఆ కీలకమార్గంలోదే! ఆ పోర్ట్ నిర్మాణం ఆలోచన మూడు దశాబ్దాల పైగా ఉన్నా, అనేక తర్జనభర్జనలు, నివేదికల బుట్టదాఖలు తర్వాత 2005లో హంబన్‌తోట వాసి మహిందా రాజపక్స అధ్యక్షుడయ్యాక మళ్ళీ ఊపిరి పోసుకుంది. చైనా ఆర్థిక సాయంతో పన్నెండేళ్ళ క్రితం 2010లో ఈ అంతర్జాతీయ పోర్ట్ తొలిదశ పూర్తయింది. ఆర్థికంగా ఆట్టే గిట్టుబాటు కాని ఆ నౌకాశ్రయ నిర్మాణం కోసం 15 ఏళ్ళ కాలానికి చైనా ఇచ్చిన అప్పు వడ్డీలపై వడ్డీలతో ఇప్పుడు శ్రీలంక తలపై భారమై కూర్చుంది. చైనా, శ్రీలంక నౌకాసంస్థల సంయుక్త భాగస్వామ్యంలో నడుస్తున్న ఈ పోర్ట్‌ను స్వల్పకాలిక ప్రయోజనాల నిమిత్తం 99 ఏళ్ళ లీజుకిచ్చి, ద్వీపదేశం తిప్పుకోలేని తప్పు చేసింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్నా సరే శ్రీలంక క్రమం తప్పకుండా ఆ అప్పుల వాయిదాలు తీర్చాల్సిందేనని చైనా కొండెక్కి కూర్చుంది. డ్రాగన్ విసిరిన ఈ ఋణదౌత్యం వలలో చిక్కుకొని, బయటపడలేక సింహళం సతమతమవుతోంది. హంబన్‌తోట పోర్ట్‌పై చైనా నియంత్రణతో హిందూ మహాసముద్ర జలాల్లో తమ ప్రయోజనాలకు భంగమని భారత్, అమెరికాలు మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజా చైనా నిఘానౌక వ్యవహారం ఆ అనుమానాలకూ, ఆందోళనకూ తగ్గట్టే ఉంది. శ్రీలంక ఇటు భారత్, అటు చైనాతో దోస్తీ చేస్తూ, ఇరువైపుల నుంచి లబ్ధి పొందాలని చూస్తోంది. భౌగోళికంగా తనకున్న సానుకూలతను ద్వీపదేశం వాడుకోవాలని అనుకోవడం అర్థం చేసుకోదగినదే. కానీ, ఏకకాలంలో ఇరుపక్షాలకూ కన్నుగీటడమే సమస్య. సింహళం మాత్రం వర్తమాన ఆర్థిక సంక్షోభంలో భారత, చైనాలు రెండూ అండగా నిలిచాయనీ, ఇరుదేశాలూ తమకు కీలక మిత్రులనీ తన వైఖరిని సమర్థించుకుంటోంది. దాని పరిస్థితి ఇప్పుడు కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపంగా తయారైంది. ఏకకాలంలో ఇద్దరికి కన్నుగీటడం సులభమూ కాదు. సమస్యా రహితమూ కాబోదని ద్వీపదేశానికి మరోసారి తెలిసొస్తోంది. చైనానేమో చట్టబద్ధమైన తన సముద్రజల శాస్త్రీయ పరిశోధన కార్యకలాపాల్లో ‘సంబంధిత పార్టీలు’ చొరబడడం మానుకోవాలని శ్రీరంగనీతులు చెబుతోంది. నిజానికి, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల్లో చర్యలు చేపట్టేలా చైనా వద్ద ఏకంగా ఇలాంటి ఏడు నౌకలున్నాయి. ఇప్పటికే భూతలంపై బీజింగ్‌కు ఉన్న ట్రాకింగ్ కేంద్రాలకు ఈ నౌకలు అదనం. అందులోనూ అత్యాధునిక ట్రాకింగ్ సాంకేతికత శ్రీలంకలో లంగరేస్తున్న తాజా నౌక సొంతం. ఈ రెండు నెలలూ హిందూ మహాసముద్ర వాయవ్య ప్రాంతంలో చైనా ఉపగ్రహాల నియంత్రణ, రిసెర్చ్ ట్రాకింగ్‌ను తమ నౌక చేస్తుందని చైనా అధికారిక ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ శ్రీలంక’ (బ్రిస్ల్) మాట. కానీ, డ్రాగన్ నక్కజిత్తులు తెలిసినవారెవరైనా ఆ మాటల్ని యథాతథంగా విశ్వసించడం కష్టమే. పైగా, 2014లో కొలంబో పోర్ట్‌లో లంగరేసిన చైనా జలాంతర్గాములతో పోలిస్తే తాజా నిఘానౌక శక్తిసామర్థ్యాలు మరింత ప్రమాదకరం. మీదకొస్తున్న ఈ ముప్పు రీత్యా మనం కట్టుదిట్టమైన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టక తప్పదు. దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు అది అత్యవసరం. హంబన్‌తోట నౌకాశ్రయం గనక రేపు చైనా ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’ (పీఎల్ఏ) నౌకాదళానికి కేంద్రంగా మారితే, భారత్‌కు ఉత్తరాన, దక్షిణాన డ్రాగన్ ఆధిపత్యంతో మన పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క అవుతుంది. తస్మాత్ జాగ్రత్త! -
శ్రీలంక పోర్టుకు చైనా షిప్.. స్పందించిన భారత్!
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతోంది శ్రీలంక. కొలంబో సంక్షోభానికి చైనా కుట్రపూరిత రుణాలేనని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవలే.. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో మళ్లీ తన లీలలు మొదలు పెట్టింది చైనా. తన అధీనంలో ఉన్న శ్రీలంక దక్షిణ ప్రాంతంలోని హమ్‌బన్‌తోటా పోర్టుకు పరిశోధన, సర్వే నౌకను పంపిస్తోంది. అది ఆగస్టు 11న శ్రీలంక నౌకాశ్రయానికి చేరుకోనుంది. ఈ నేపథ్యంలో స్పందించింది భారత్. పరిస్థితులను ఎప్పటికప్పుడు సునిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించింది. చైనా నౌక సోమవారం పోర్టుకు వచ్చే అంశంపై కేబినెట్ చర్చించినట్లు శ్రీలంక ప్రభుత్వ ప్రతినిధి బందులా గుణవర్ధెన పేర్కొన్నారు. ‘తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న తరుణంలో భారత్, చైనాలు మాకు సాయం అందించాయి.’ అని పేర్కొన్నారు. అయితే.. చైనా వల్లే దేశంలో పరిస్థితులు దిగజారాయనే వాదనలు వినిపిస్తున్న తరుణంలో ప్రభుత్వ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నిరసన క్యాంపులను ఖాళీ చేసేందుకు ససేమిరా.. శ్రీలంకలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అధ్యక్ష భవనం సమీపంలోని గాలే ఫేస్ నిరసన క్యాంప్‌ను శుక్రవారం సాయంత్రానికి ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు. అయితే.. వాటిని తిరస్కరించారు నిరసనకారులు. నిరసనలు కొనసాగుతాయని, క్యాంపులను ఖాళీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఖాళీ చేయించేందుకు పోలీసుల వద్ద కోర్టు ఆదేశాలు లేవని పేర్కొన్నారు. గతంలో మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఈ ప్రాంతాన్ని నిరసనలు చేసుకునేందుకు అనుమతించారని గుర్తు చేశారు. ఇదీ చదవండి: Raghuram Rajan: అందుకే భారత్‌కు శ్రీలంక పరిస్థితి రాలేదు -
అమ్మో.. చైనా నౌక!
ఇదిగో జ్వరం అంటే.. అదిగో కరోనా అన్నట్లున్నాయి ప్రస్తుత పరిస్థితులు. చిన్నపాటి జలుబు చేసినా.. జ్వరం వచ్చినా కరోనా ఎఫెక్టేమోనన్న భయాందోళనలు మొదలయ్యాయి. అలాంటిది.. ఏ దేశంలో కరోనా వైరస్ పుట్టి.. ప్రపంచమంతా విజృంభిస్తోందో.. అదే దేశానికి చెందిన ఒక కార్గో షిప్.. అదీ ఏకంగా 17 మంది ఆ దేశస్తులతోనే వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉంటుంది?.. అదే కారణం.. కరోనా పరిస్థితులు లేకపోయినా విశాఖ నగర ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. చైనా నుంచి వచ్చిన ఫార్చూన్ హీరో అనే నౌకను కరోనా విలన్‌గానే అనుమానించి.. అందులో వచ్చిన సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి 7 గంటలకు ఫార్చూన్ హీరో కార్గో షిప్ విశాఖ సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. ముందుజాగ్రత్త చర్యగా దాన్ని పోర్టులోకి దూరంగా నిలిపేశారు. ఈ సమాచారం శుక్రవారం నగరంలో కలవరం రేపింది. వచ్చింది నౌక కాదు.. కరోనాయే అన్నట్లుగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారని.. నౌకను దూరంగా నిలిపివేసి.. సిబ్బందికి అందులోనే పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: హిందాల్కో సంస్థ కోసం పెట్‌కోక్ లోడ్‌తో 14 రోజుల క్రితం చైనాలోని జాన్‌జియాంగ్ పోర్టు నుంచి ఫార్చూన్ హీరో నౌక బయలుదేరింది. ఆ నౌకలో మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 17 మంది చైనా దేశీయులే కాగా.. మిగిలిన ఐదుగురు మయన్మార్‌కు చెందినవారు. వీరందరి హెల్త్ రిపోర్టును అక్కడి పోర్టు అధికారులు విశాఖ పోర్టుకు మెయిల్ ద్వారా పంపారు. ఆ రిపోర్టు ప్రకారం అందరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. కరోనా లక్షణాలు 15 రోజుల్లోపు బయటపడే అవకాశం ఉన్న నేపథ్యంలో గురువారం రాత్రి 7 గంటలకు విశాఖ జలాల్లోకి ప్రవేశించింది. అప్పటికి 15 రోజులు పూర్తి కాకపోవడంతో పోర్టులోకి అనుమతించకుండా సుదూరంగా నిలిపివేశారు. పోర్టు వైద్య బృందాలు శుక్రవారం ఉదయం నుంచి నౌకలో ఉన్న ప్రతి సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎవ్వరికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యాధికారులు ధ్రువీకరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సిబ్బంది వెసల్ అరెస్ట్ సాధారణంగా కార్గో నౌకల్లో వచ్చే వివిధ దేశాల సిబ్బంది విశాఖ నగరంలో పర్యటిస్తుంటారు. షాపింగ్ చేయడం, సినిమాలకు, సందర్శనీయ ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే కరోనా వైరస్ విజృంభించినప్పటి నుంచి విశాఖ పోర్టుకు వస్తున్న విదేశీ నౌకల సిబ్బందిని పోర్టు నుంచి బయటికి పంపించడం లేదు. అదేవిధంగా.. చైనా నుంచి వచ్చిన ఫార్చూన్ హీరో షిప్ సిబ్బందిని క్రూలోనే ఉండాలనే నిబంధన విధించారు. నౌక నుంచి బయటకు వెళ్లకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. అదేవిధంగా వారు ఎవరితోనూ నేరుగా మాట్లాడకుండా.. ఫోన్లు, వాకీటాకీల ద్వారానే సమాచార మార్పిడి జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. పూర్తి సన్నద్ధతతో ఎదుర్కొంటున్నాం... పోర్టులో కరోనా వైరస్‌కు సంబంధించి పూర్తిస్థాయి ఆరోగ్య భద్రతా చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ సూచించిన అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం. మాస్క్‌లు, శానిటైజర్లు, గ్లౌజ్‌లు, థర్మో ఫ్లాష్ హ్యాండ్ గన్స్‌తో పాటు పూర్తి రక్షణ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా షిప్ వచ్చిన వెంటనే పోర్టు ఆరోగ్యాధికారి షిప్‌లోకి వెళ్లి సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ పోర్టుకు వివిధ దేశాల నుంచి 30 నౌకల్లో వచ్చిన 760 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాకే అనుమతిచ్చాం. పోర్టులో మొత్తం 4 వైద్యబృందాలు ఏర్పాటు చేశాం. ఇప్పటికే నలుగురు వైద్యులను కేంద్రం సూచనల మేరకు శిక్షణకు పంపించాం. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. – పీఎల్ హరనాథ్, విశాఖ పోర్టు ట్రస్టు డిప్యూటీ ఛైర్మన్ -
విశాఖ పోర్టుకి చైనా షిప్: సిబ్బందికి వైద్య పరీక్షలు
సాక్షి, విశాఖపట్నం: ‘ఫార్చ్యూన్ హీరో’ అనే చైనా ఫిష్ షిప్ నిన్న(శుక్రవారం) విశాఖ పోర్టుకు చేరుకుంది. మొత్తం 22 మంది షిప్ సిబ్బందిలో 17 మంది చైనా, 5 మంది మయ్యున్మార్కు చెందిన వారు ఉన్నారు. కాగా రోనా వైరస్(కోవిడ్-19) కారణంగా అధికారులు షిప్‌ను పోర్టుకు దూరంగా నిలిపివేశారు. ప్రస్తుతం వైద్యులు షిప్ సిబ్బందికి వైద్య పరిక్షలు నిర్వహిస్తున్నట్లుగా అధికారుల వెల్లడించారు. -
331కి పెరిగిన మృతుల సంఖ్య
బీజింగ్: పెనుతుఫాన్ తాకిడికి చైనాలోని యాంగ్జీ నదిలో పర్యాటక నౌక మునిగిపోయిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 331కు పెరిగింది. జూన్ 1న సంభవించిన ఈ ప్రమాదంలో ఈస్టర్న్ స్టార్ అనే పర్యాటక నౌకలో ప్రయాణిస్తోన్న 450 మంది గల్లంతైన సంగతి తెలిసిందే. గల్లంతైన వారిలో కేవలం 14 మందిని మాత్రమే సహాయ బృందాలు కాపాడగలిగినట్లు, శనివారం నాటికి 331 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు చెప్పారు. 149 మర బోట్లు, 59 భారీ యంత్రాలు, ఒక హెలికాప్టర్ల సహాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని, ఇందులో 3,500 మంది సైనికులు, 1700 మంది పారామిలటరీ పాలుపంచుకుంటున్నట్లు పేర్కొన్నారు. -
ఆయుధాలతో పట్టుబడిన చైనా నౌక: దర్యాప్తు ముమ్మరం
-
ఆయుధాలతో పట్టుబడిన చైనా నౌక: దర్యాప్తు ముమ్మరం
చెన్నై: అక్రమంగా భారీ ఆయుధాలతో తరలి వస్తున్న చైనా నౌకను తమిళనాడు మెరైన్ పోలీసులు పట్టుకున్నారు. తుత్తుకుడి పోర్టుకు 3 కిలో మీటర్ల దూరంలో అధికారులు దీనిని నిలిపివేసి తనిఖీ చేశారు. ఈ నౌకలో పది మంది సిబ్బందితోపాటు 25 మంది సాయుధులు ఉన్నారు. ఈ నౌకలో భారీగా ఆయుధాలు, బాంబులు కూడా ఉన్నాయి. ఈ నౌకను సోమాలియా బంధిపోట్లు ఉపయోగించినట్లుగా అనుమానిస్తున్నారు. గతంలొ ముంబయిలో దాడులకు పాల్పడేందుకు కసబ్ తదితర ఉగ్రవాదులు సీమెన్‌గార్డు అనే చైనా నౌక ద్వారా నగరంలోకి ప్రవేశించినట్లు అప్పట్లో విచారణలో తేలింది. దీంతో చైనా నౌకల పట్ల అప్రమత్తంగా ఉండాలని భారత్‌లోని హార్బర్లకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. సీమెన్‌గార్డు చైనా నౌక మూడు నెలల క్రితం భారత్ చేరుకుంది. దీనిని దేశ సరిహద్దుల్లోనే అధికారులు తనిఖీ చేయగా అప్పట్లో అనుమానాస్పద వస్తువులు ఏమీ లభించలేదు. అయినా చైనా నౌకలను హార్బర్ అధికారులు అనుమానిస్తూనే ఉన్నారు. మూడు నెలల క్రితం మన అధికారులు తనిఖీ చేసిన ఇదే చైనా నౌక శుక్రవారం అర్ధరాత్రి సమయంలో తూత్తుకూడి హార్బర్‌ను సమీపించినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో నౌకను తూత్తుకూడి అధికారులు సముద్రంలోనే నిలిపివేశారు. అప్రమత్తమైన అధికారులు ‘నాయకిదేవీ’ అనే యుద్ధనౌకలో వేగంగా ఎదురెళ్లి సీమెన్‌గార్డు నౌకలో తనిఖీలు చేశారు. నౌకలో అనేక ఆయుధాలు దాచి ఉంచడాన్ని అధికారులు గుర్తించారు. కేంద్రం ఆదేశాల మేరకు తూత్తుకూడి హార్బర్‌కు 10 మైళ్ల దూరంలో నౌకను నిలిపేశారు. నౌక చుట్టూ గస్తీ నౌకలు, మరబోట్లు ఉంచారు. అమెరికా నుంచి రాక! చైనాలో రిజిస్టరైన ఈ నౌక ప్రస్తుతం అమెరికా నుంచి తూత్తుకూడి చేరుకున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. సముద్రపు దొంగల బారి నుంచి కాపాడుకునేందుకే ఆయుధాలు సమకూర్చుకున్నట్లు చైనా నౌకలోని సిబ్బంది సమర్థించుకున్నారు. ప్రపంచంలోని అన్ని హార్బర్లకూ తిరిగే విధంగా అనుమతి పొందామని వివరించారు. అయితే చైనా నౌక వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపింది. చెన్నై తదితర జిల్లాలలో విధ్వంసాలకు పాల్పడేందుకు చైనా నుంచి ఉగ్రవాదులు మరోసారి ప్రవేశించే ప్రయత్నం చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముంబయి దాడుల నేపథ్యంలో ఏ అంశాన్నీ సులభంగా తీసుకోరాదని భావి స్తున్నారు. క్షుణ్ణంగా విచారణ జరిపి ఒక నిర్ధారణకు రానిదే సీమెన్‌గార్డు నౌకను విడిచిపెట్టరాదని కేంద్రహోంశాఖ వర్గాలు భావిస్తున్నాయి. కేం ద్రం ఆదేశించే వరకు సీమెన్‌గార్డు చుట్టూ బందోబస్తు కొనసాగిస్తామని తూత్తుకూడి హార్బర్ అధికారులు స్పష్టం చేశారు. దర్యాప్తును ముమ్మరం చేశారు.