ఫార్చూన్ హీరో షిప్
ఇదిగో జ్వరం అంటే.. అదిగో కరోనా అన్నట్లున్నాయి ప్రస్తుత పరిస్థితులు. చిన్నపాటి జలుబు చేసినా.. జ్వరం వచ్చినా కరోనా ఎఫెక్టేమోనన్న భయాందోళనలు మొదలయ్యాయి. అలాంటిది.. ఏ దేశంలో కరోనా వైరస్ పుట్టి.. ప్రపంచమంతా విజృంభిస్తోందో.. అదే దేశానికి చెందిన ఒక కార్గో షిప్.. అదీ ఏకంగా 17 మంది ఆ దేశస్తులతోనే వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉంటుంది?.. అదే కారణం.. కరోనా పరిస్థితులు లేకపోయినా విశాఖ నగర ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
చైనా నుంచి వచ్చిన ఫార్చూన్ హీరో అనే నౌకను కరోనా విలన్‌గానే అనుమానించి.. అందులో వచ్చిన సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి 7 గంటలకు ఫార్చూన్ హీరో కార్గో షిప్ విశాఖ సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. ముందుజాగ్రత్త చర్యగా దాన్ని పోర్టులోకి దూరంగా నిలిపేశారు. ఈ సమాచారం శుక్రవారం నగరంలో కలవరం రేపింది. వచ్చింది నౌక కాదు.. కరోనాయే అన్నట్లుగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారని.. నౌకను దూరంగా నిలిపివేసి.. సిబ్బందికి అందులోనే పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: హిందాల్‌కో సంస్థ కోసం పెట్‌కోక్ లోడ్‌తో 14 రోజుల క్రితం చైనాలోని జాన్‌జియాంగ్ పోర్టు నుంచి ఫార్చూన్ హీరో నౌక బయలుదేరింది. ఆ నౌకలో మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 17 మంది చైనా దేశీయులే కాగా.. మిగిలిన ఐదుగురు మయన్మార్‌కు చెందినవారు. వీరందరి హెల్త్ రిపోర్టును అక్కడి పోర్టు అధికారులు విశాఖ పోర్టుకు మెయిల్ ద్వారా పంపారు. ఆ రిపోర్టు ప్రకారం అందరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. కరోనా లక్షణాలు 15 రోజుల్లోపు బయటపడే అవకాశం ఉన్న నేపథ్యంలో గురువారం రాత్రి 7 గంటలకు విశాఖ జలాల్లోకి ప్రవేశించింది. అప్పటికి 15 రోజులు పూర్తి కాకపోవడంతో పోర్టులోకి అనుమతించకుండా సుదూరంగా నిలిపివేశారు. పోర్టు వైద్య బృందాలు శుక్రవారం ఉదయం నుంచి నౌకలో ఉన్న ప్రతి సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎవ్వరికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యాధికారులు ధ్రువీకరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
సిబ్బంది వెసల్ అరెస్ట్
సాధారణంగా కార్గో నౌకల్లో వచ్చే వివిధ దేశాల సిబ్బంది విశాఖ నగరంలో పర్యటిస్తుంటారు. షాపింగ్ చేయడం, సినిమాలకు, సందర్శనీయ ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే కరోనా వైరస్ విజృంభించినప్పటి నుంచి విశాఖ పోర్టుకు వస్తున్న విదేశీ నౌకల సిబ్బందిని పోర్టు నుంచి బయటికి పంపించడం లేదు. అదేవిధంగా.. చైనా నుంచి వచ్చిన ఫార్చూన్ హీరో షిప్ సిబ్బందిని క్రూలోనే ఉండాలనే నిబంధన విధించారు. నౌక నుంచి బయటకు వెళ్లకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. అదేవిధంగా వారు ఎవరితోనూ నేరుగా మాట్లాడకుండా.. ఫోన్లు, వాకీటాకీల ద్వారానే సమాచార మార్పిడి జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
పూర్తి సన్నద్ధతతో ఎదుర్కొంటున్నాం...
పోర్టులో కరోనా వైరస్‌కు సంబంధించి పూర్తిస్థాయి ఆరోగ్య భద్రతా చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ సూచించిన అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం. మాస్క్‌లు, శానిటైజర్లు, గ్లౌజ్‌లు, థర్మో ఫ్లాష్ హ్యాండ్ గన్స్‌తో పాటు పూర్తి రక్షణ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా షిప్ వచ్చిన వెంటనే పోర్టు ఆరోగ్యాధికారి షిప్‌లోకి వెళ్లి సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ పోర్టుకు వివిధ దేశాల నుంచి 30 నౌకల్లో వచ్చిన 760 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాకే అనుమతిచ్చాం. పోర్టులో మొత్తం 4 వైద్యబృందాలు ఏర్పాటు చేశాం. ఇప్పటికే నలుగురు వైద్యులను కేంద్రం సూచనల మేరకు శిక్షణకు పంపించాం. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు.
– పీఎల్ హరనాథ్, విశాఖ పోర్టు ట్రస్టు డిప్యూటీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment