vizag port
-
అధికారం కోసం చంద్రబాబు గడ్డి కరుస్తారు
-
అమ్మో.. చైనా నౌక!
ఇదిగో జ్వరం అంటే.. అదిగో కరోనా అన్నట్లున్నాయి ప్రస్తుత పరిస్థితులు. చిన్నపాటి జలుబు చేసినా.. జ్వరం వచ్చినా కరోనా ఎఫెక్టేమోనన్న భయాందోళనలు మొదలయ్యాయి. అలాంటిది.. ఏ దేశంలో కరోనా వైరస్ పుట్టి.. ప్రపంచమంతా విజృంభిస్తోందో.. అదే దేశానికి చెందిన ఒక కార్గో షిప్.. అదీ ఏకంగా 17 మంది ఆ దేశస్తులతోనే వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉంటుంది?.. అదే కారణం.. కరోనా పరిస్థితులు లేకపోయినా విశాఖ నగర ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. చైనా నుంచి వచ్చిన ఫార్చూన్ హీరో అనే నౌకను కరోనా విలన్‌గానే అనుమానించి.. అందులో వచ్చిన సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి 7 గంటలకు ఫార్చూన్ హీరో కార్గో షిప్ విశాఖ సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. ముందుజాగ్రత్త చర్యగా దాన్ని పోర్టులోకి దూరంగా నిలిపేశారు. ఈ సమాచారం శుక్రవారం నగరంలో కలవరం రేపింది. వచ్చింది నౌక కాదు.. కరోనాయే అన్నట్లుగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారని.. నౌకను దూరంగా నిలిపివేసి.. సిబ్బందికి అందులోనే పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: హిందాల్కో సంస్థ కోసం పెట్‌కోక్ లోడ్‌తో 14 రోజుల క్రితం చైనాలోని జాన్‌జియాంగ్ పోర్టు నుంచి ఫార్చూన్ హీరో నౌక బయలుదేరింది. ఆ నౌకలో మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 17 మంది చైనా దేశీయులే కాగా.. మిగిలిన ఐదుగురు మయన్మార్‌కు చెందినవారు. వీరందరి హెల్త్ రిపోర్టును అక్కడి పోర్టు అధికారులు విశాఖ పోర్టుకు మెయిల్ ద్వారా పంపారు. ఆ రిపోర్టు ప్రకారం అందరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. కరోనా లక్షణాలు 15 రోజుల్లోపు బయటపడే అవకాశం ఉన్న నేపథ్యంలో గురువారం రాత్రి 7 గంటలకు విశాఖ జలాల్లోకి ప్రవేశించింది. అప్పటికి 15 రోజులు పూర్తి కాకపోవడంతో పోర్టులోకి అనుమతించకుండా సుదూరంగా నిలిపివేశారు. పోర్టు వైద్య బృందాలు శుక్రవారం ఉదయం నుంచి నౌకలో ఉన్న ప్రతి సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎవ్వరికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యాధికారులు ధ్రువీకరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సిబ్బంది వెసల్ అరెస్ట్ సాధారణంగా కార్గో నౌకల్లో వచ్చే వివిధ దేశాల సిబ్బంది విశాఖ నగరంలో పర్యటిస్తుంటారు. షాపింగ్ చేయడం, సినిమాలకు, సందర్శనీయ ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే కరోనా వైరస్ విజృంభించినప్పటి నుంచి విశాఖ పోర్టుకు వస్తున్న విదేశీ నౌకల సిబ్బందిని పోర్టు నుంచి బయటికి పంపించడం లేదు. అదేవిధంగా.. చైనా నుంచి వచ్చిన ఫార్చూన్ హీరో షిప్ సిబ్బందిని క్రూలోనే ఉండాలనే నిబంధన విధించారు. నౌక నుంచి బయటకు వెళ్లకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. అదేవిధంగా వారు ఎవరితోనూ నేరుగా మాట్లాడకుండా.. ఫోన్లు, వాకీటాకీల ద్వారానే సమాచార మార్పిడి జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. పూర్తి సన్నద్ధతతో ఎదుర్కొంటున్నాం... పోర్టులో కరోనా వైరస్‌కు సంబంధించి పూర్తిస్థాయి ఆరోగ్య భద్రతా చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ సూచించిన అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం. మాస్క్‌లు, శానిటైజర్లు, గ్లౌజ్‌లు, థర్మో ఫ్లాష్ హ్యాండ్ గన్స్‌తో పాటు పూర్తి రక్షణ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా షిప్ వచ్చిన వెంటనే పోర్టు ఆరోగ్యాధికారి షిప్‌లోకి వెళ్లి సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ పోర్టుకు వివిధ దేశాల నుంచి 30 నౌకల్లో వచ్చిన 760 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాకే అనుమతిచ్చాం. పోర్టులో మొత్తం 4 వైద్యబృందాలు ఏర్పాటు చేశాం. ఇప్పటికే నలుగురు వైద్యులను కేంద్రం సూచనల మేరకు శిక్షణకు పంపించాం. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. – పీఎల్ హరనాథ్, విశాఖ పోర్టు ట్రస్టు డిప్యూటీ ఛైర్మన్ -
విశాఖ పోర్టు లాభం రూ. 200 కోట్లు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు గడిచిన ఐదేళ్లలో ఆర్థిక, నైపుణ్యత, మౌలిక సదుపాయాలు తదితర అన్ని రంగాల్లోనూ గణనీయమైన అభివృద్ధిని సాధించిందని పోర్టు ట్రస్ట్ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. ప్రతి ఏటా ఐదు శాతం వృద్ధి రేటు సాధించడమే కాకుండా దేశంలోనే శుభ్రమైన పోర్టుగా వరుసగా మూడేళ్లు జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. గ్రీన్ ఇండస్ట్రీ, గ్రీన్ పోర్టు అవార్డులను కూడా సొంతం చేసుకుందని చెప్పారు. పోర్టు అభివృద్ధి కోసం తన హయాంలో చేపట్టిన కార్యక్రమాలను కృష్ణబాబు శుక్రవారం విశాఖలో మీడియాకు వివరించారు. 2017–18లో 63.54 మిలియన్ టన్నుల మేర ఎగుమతులు, దిగుమతులు జరిగితే 2018–19లో 65.3 మిలియన్ టన్నులకు పెరిగాయని, తద్వారా రూ. 200 కోట్ల లాభాలను ఆర్జించి పోర్టు రికార్డు నెలకొల్పిందని తెలిపారు. రూ. 300 కోట్ల ఖర్చుతో పోర్టు ఛానల్ లోతును 11 మీటర్ల నుంచి 14.5 మీటర్లకు పెంచామని, దీనివల్ల లక్ష టన్నులకు మించిన నౌకలు కూడా ఇన్నర్ హార్బర్లలోకి వచ్చే వెసులుబాటు కలిగిందని చెప్పారు. 85 ఏళ్ల కిందట ఏర్పడిన పోర్టును ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా ఆధునికీకరిస్తున్నామని, ఇందుకోసం విశాఖ పోర్టు ట్రస్ట్ రూ. 1,200 కోట్లు ఖర్చు చేస్తే, ప్రైవేటు సెక్టార్ నుంచి రూ. 2,500 కోట్లు పెట్టుబడులు పెట్టారన్నారు. విలాసవంతమైన భారీ క్రూయిజ్‌ల నిర్మాణం కోసం రూ. 77 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. పోర్టు కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు కాన్వెంట్ కూడలి నుంచి సీ హార్స్ జంక్షన్ వరకు 7.5 మీటర్ల ఎత్తులో రక్షణ గోడ నిర్మించామని వివరించారు. కాలుష్య నియంత్రణ కోసం గడిచిన 8 ఏళ్లలో రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. సాగరమాల ప్రాజెక్టు కింద పోర్టు రోడ్డును నాలుగు వరుసలకు విస్తరించడంతో పాటు షీలానగర్ నుంచి సబ్బవరం వరకు కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారికి అనుసంధానమయ్యేలా పనులు జరుగుతున్నాయన్నారు. -
వైజాగ్ పోర్ట్‌లో ఎస్సార్ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ పోర్టులో ఎస్సార్ పోర్ట్స్ తన నిర్వహణలోని ఐరన్ ఓర్ సామర్థ్యాలను రెట్టింపు చేయనుంది. ఇందుకోసం రూ.830 కోట్లను పెట్టుబడిగా పెడుతోంది. చివరి దశలో ఉన్న ఈ విస్తరణ ప్రాజెక్టు పూర్తయితే ప్రస్తుతం రోజుకు 70,000 టన్నులుగా ఉన్న సామర్థ్యం 1,20,000 టన్నులకు పెరుగుతుందని ఎస్సార్ పోర్ట్స్ తెలిపింది. అలాగే, వార్షిక సామర్థ్యం 12.5 మిలియన్ టన్నుల నుంచి 23 మిలియన్ టన్నులకు పెరుగుతుందని వెల్లడించింది. గంటకు 8,000 టన్నులను లోడింగ్ చేసే సామర్థ్యం సమకూరుతుందని, దేశీయ పోర్టుల్లో ఇదే గరిష్టమని వివరించింది. అలాగే హార్బర్లో 2,00,000 డీడబ్ల్యూటీ సామర్థ్యంగల నౌకలను కూడా నిలపడం సాధ్యపడుతుందని పేర్కొంది. వైజాగ్ పోర్ట్‌లో ఐరన్‌ఓర్ నిర్వహణ ప్రాజెక్టును 2015 మే నెలలో ఎస్సార్ పోర్ట్స్ 30 ఏళ్ల కాలానికిగాను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి సామర్థ్యాలను రోజుకు 25,000 టన్నుల నుంచి 70,000కు విస్తరించింది. వైజాగ్ పోర్ట్‌లోని ఎస్సార్‌కు చెందిన ఈవీటీఎల్ ఐరన్ ఓర్ హ్యాండ్లింగ్ టెర్మినల్ అన్ని రకాల వాతావరణాల్లోనూ పనిచేసే సామర్థ్యంతో చైనా, జపాన్, కొరియా సహా ఆగ్నేయాసియా దేశాలకు సేవలు అందించగలదని ఎస్సార్ పోర్ట్స్ తెలిపింది. రెండు ఎల్ఎన్జీ పోర్టుల నిర్మాణం ఎస్సార్ పోర్ట్స్ పశ్చిమ తీరంలో ఒకటి, తూర్పు తీరంలో మరొక ఎల్ఎన్జీ టెర్మినల్‌ను వచ్చే 18 నెలల్లో నిర్మించాలనుకుంటోంది. మొదటి దశలో రూ.2,500 కోట్లను వ్యయం చేయనున్నట్టు ఎస్సార్ పోర్ట్స్ ఎండీ రాజీవ్ అగర్వాల్ తెలిపారు. ఇందుకోసం సొంత నిధులతోపాటు బ్యాంకుల నుంచి రుణాలను తీసుకునే ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. ఇప్పటికే పోర్టులను నిర్వహిస్తున్న హజీరా, సలాయాను ఇందుకు కంపెనీ ఎంచుకుంది. ఈ ప్రణాళికపై దృష్టి సారించామని, రానున్న ఏడాది, ఏడాదిన్నరలో దీన్ని మొదలు పెట్టనున్నట్టు రాజీవ్ తెలిపారు. -
శాశ్వత నిద్రలోకి ‘కళ్లు’
-
శాశ్వత నిద్రలోకి ‘కళ్లు’
విశాఖ-కల్చరల్: ఉత్తరాంధ్ర మాండలికంలో ‘‘ఓలమ్మోలమ్మో నేనేటి సేసేది’’ లాంటి డైలాగులతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన కళ్లు చిదంబరం (70) ఇకలేరు. కొద్దికాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన.. విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విజయనగరంలో 1945 అక్టోబర్ 10న జన్మించిన కొల్లూరు చిదంబరం విశాఖ పోర్టులో అసిస్టెంట్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేశారు. 36వ ఏట ఒక కన్ను మెల్లకన్నుగా మారడంతో ఉద్యోగానికి స్వస్తి చెప్పి పూర్తికాలం నాటక, సినిమా రంగాలకు అంకితమయ్యారు. 1989లో ఎం.వి.రఘు దర్శకత్వంలో వచ్చిన కళ్లు సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. అందులో అంధుని పాత్రలో మెప్పించారు. దీంతో ఆ సినిమా పేరే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. చిదంబరం 300 చిత్రాల్లో నటించారు. అందులో ఎక్కువ హాస్యపాత్రలే. కళ్లు, అమ్మోరు చిత్రాలు ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. జంబలకిడిపంబ, ఆ ఒక్కటీ అడక్కు, ఏప్రిల్ ఒకటి విడుదల, మనీ, గోవింద గోవింద, పెళ్లిచేసుకుందాం, ఒట్టేసి చెబుతున్నా, సీతయ్య, మృగరాజు, శ్వేతనాగు, కొండవీటి దొంగ తదితర చిత్రాల్లో ఆయన నటించారు. చిదంబరం మృతితో తెలుగు చిత్రసీమ మరో మంచి హాస్యనటుడిని కోల్పోయిందని సహనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరో తరగతి నుంచే.. విజయనగరం మున్సిపల్ హైస్కూల్లో 6వ తరగతి చదువుతుండగానే ‘కోయదొర’ అనే విచిత్ర వేషధారణ వేశారు. ఆ తర్వాత 1962 సంవత్సరం ‘బ్రహ్మచారులు’ నాటిక ద్వారా రంగస్థల ప్రవేశం చేసి 36 నాటికలు, నాటకాల్లో నటించారు.నాటకరంగంపై మక్కువతో దాదాపు 14 ఏళ్లపాటు సాంస్కృతిక కార్యకలాపాల్లో అవిశ్రాంతంగా పాల్గొన్నారు. దీనివల్ల ఒక కంటి నరం దెబ్బతినడంతో 36 ఏళ్ల వరకూ సవ్యంగానే ఉన్న ఆ కన్ను పూర్తి మెల్లకన్నుగా మారిపోయింది. అలా అయినా బాధపడకుండా యథాతథంగా నాటకాలు వేశారు. వాణి ఆర్ట్స్ అసోసియేషన్ పేరుతో నాటికలు, నాటకాల పోటీల్లో పాల్గొన్నారు. వెండితెరపై మెరిసిన ఆ ‘కళ్లు’ ఎటువైపు చూస్తున్నాడో తెలియని తన మెల్లకన్నుతోనే వెండితెరపై చిదంబరం హాస్యగుళికలు చల్లారు. గొల్లపూడి మారుతీరావు రచించిన ‘కళ్లు’ నాటకాన్ని తెరకెక్కించడానికి దర్శకుడు రఘు ప్రయత్నిస్తున్న సందర్భంలో.. ఆ సినిమాలో నటించాలని చిదంబరాన్ని ప్రముఖ దర్శకుడు ఎల్.సత్యానంద్ కోరారు. దీనికి చిదంబరం అంగీకారం తెలిపారు. కళ్లు సినిమా స్పెషల్ జ్యూరీ నంది అవార్డు అందుకోవడంతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకుంది. చిదంబరానికి నంది పురస్కారం, కళాసాగర (మద్రాస్) పురస్కారం లభించాయి. అప్పటి నుంచి చిదంబరం జీవితం మలుపు తిరిగింది. ఏప్రిల్ ఒకటి విడుదల సినిమాలో పాత టీవీలు అమ్మేవాడి పాత్ర, ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో అమాయకంగా మేకను కొనేవాడి పాత్ర ఆయన హాస్యగుళికల్లో మచ్చుకు కొన్ని. ఇక నాటకరంగంలో భజంత్రీలుతో తన ప్రస్థానం మొదలు పెట్టారు. తోలుబొమ్మలాట, ట్రీట్మెంట్, పండగొచ్చింది, చల్‌చల్ గుర్రం, రైలుబండి, సిప్పొచ్చింది, గప్చిప్, ఎవ్వనిచే జనించు, వశీకరణం వంటి నాటికల్లో నటించారు. ప్రొఫైల్ అసలు పేరు: కొల్లూరు చిదంబరం జననం: అక్టోబర్ 10 1945 సొంతవూరు: విజయనగరం తండ్రి: కొల్లూరు వెంకట సుబ్బారావు,టీచర్ తల్లి: నాగభాయమ్మ, గృహిణి విద్యార్హత: ఎస్ఎస్ఎల్సీ, (విజయనగరం మున్సిపల్ హైస్కూల్) పాలిటెక్నికల్ సివిల్ విశాఖపట్నం వృత్తి: విశాఖ పోర్టులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కుటుంబం: భార్య, నలుగురు పిల్లలు (ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు) రంగస్థల ప్రవేశం: 1958 సంవత్సరంలో 6వ తరగతిలో ‘కోయదొర’ విచిత్ర వేషధారణ. తొలిచిత్రం: గొల్లపూడి మారుతీరావు రచించిన ‘కళ్లు’ నటించిన చిత్రాలు: 300 చిత్రాలు కళాకారులకు సేవ.. నాటకరంగ కళాకారుల కోసం 2009లో విశాఖలో 1,180 మంది కళాకారులతో ‘సకల కళాకారుల సమాఖ్య’ అనే సంస్థను స్థాపించి చిదంబరం పలు సేవలందించారు. కళలు వేరైనా కళాకారులంతా ఒకటే అని భావించి సాహిత్యం, సంగీతం, వాయిద్యం, నాట్యం, మ్యూజిక్, మిమిక్రీ, హరికథ, బుర్రకథ, చిత్రలేఖనం కళాకారులను సభ్యులుగా చేర్చుకుని వారిలో ఐకమత్యం తీసుకురాగలిగారు. పేద కళాకారులకు పింఛను, వారి పిల్లలకు ఉచితంగా స్టేషనరీ, పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి రూ. 10,000 చొప్పున ప్రోత్సాహకం, కళాకారుడెవరైనా చనిపోతే.. గంటలోనే తక్షణ ఆర్థిక సాయం కింద రూ. 2,000 వారి కుటుంబానికి అందజేయడం. గుర్తింపు కార్డు చూపించిన కళాకారులకు మెడికల్ షాపుల్లో 15 శాతం డిస్కౌంట్, ల్యాబొరేటరీలో 20 శాతం డిస్కౌంట్, పబ్లిక్ స్కూళ్లలో 20 శాతం డిస్కౌంట్లు కల్పించి పేద కళాకారుల హృదయాల్లో చిరస్మరణీయంగా చిదంబరం నిలిచిపోయారు. విశాఖలో ఎక్కువకాలం నివసించిన ఆయన.. అక్కడే తుదిశ్వాస విడిచారు. ఆ ప్రాంతంపై ఎనలేని మక్కువ చూపారు. -
కాలుష్యకోరల్లో నలిగి పొతున్న విశాఖ
-
విశాఖ పోర్టులో మత్స్యకారుల ఆందోళన
విశాఖ: జిల్లాలో ఫిషింగ్ హర్బర్‌లో బుధవారం మత్స్యకారులు ఆందోళనకు దిగారు. విశాఖ పోర్టులో చిరు దుకాణాలను తొలగించేందుకు అక్కడి యాజమాన్యం ప్రయత్నించడంతో వారు ఆందోళనకు దిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు పెద్దఎత్తునా ఆందోళన చేపట్టారు. చిరు దుకాణాలను అడ్డుకునేందుకు యత్నించిన యజమాన్యాన్ని అడ్డుకున్నారు. పోర్టు ఛైర్మన్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు నినాదాలు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వారిని శాంతపరచి అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. -
విదేశీ రేవులను తలదన్నేలా వైజాగ్ పోర్టు
సాక్షి, విశాఖపట్నం: దేశీయ పోర్టుల రంగంలో కోల్పోయిన నంబర్‌వన్ హోదాను తిరిగి చేజిక్కించుకునేందుకు వైజాగ్‌పోర్టు మళ్లీ సిద్ధమవుతోంది. విదేశీ ఓడరేవులను తలదన్నే సౌకర్యాలను సమకూర్చుకుంటోంది. అత్యంత కష్టమైన రూ.352 కోట్ల విలువైన డ్రెడ్జింగ్‌ను పూర్తిచేసుకుని వచ్చే నెల నుంచి ప్రపంచంలోని అతిపెద్ద కార్గో నౌకలకూ ఆతిథ్యం ఇవ్వబోతోంది. సముద్రం మధ్యలో వేరే చిన్న నౌకలోకి కార్గోను మార్చుకునే కష్టం అక్కర్లేకుండా 2 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన షిప్పులు (పనామా వెస్సల్స్) నేరుగా పోర్టు లోపలకు వెళ్లేలా సామర్థ్యం పెంచుకుంది. తద్వారా ఏటా 6 మి.టన్నుల కార్గో పెంచుకోవడంతోపాటు, దిగుమతి దారులకు చవకైన సరకు రవాణా సౌలభ్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. నంబర్ వన్ సాధ్యమేనా? 23 బెర్త్‌లతో కార్యకలాపాలు సాగిస్తోన్న వైజాగ్‌పోర్టు 100 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సదుపాయాలను ఏర్పాటుచేసేందుకు ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. అయితే లక్ష్యానికి చేరువ కాలేకపోతోంది. ఈ క్రమంలో ఒకప్పటి నంబర్‌వన్ స్థానం నుంచి ఇప్పుడు మూడోస్థానానికి పడిపోయింది. మరోపక్క కొత్తగా వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ప్రైవేటు పోర్టులను సైతం తట్టుకోలేక ఏటేటా తనకు దక్కాల్సిన కార్గోను పక్కపోర్టులకు అప్పగించేస్తోంది. దీంతో 2012-13లో ఏకంగా 8 మిలియన్ టన్నుల కార్గో కోల్పోయింది. 2013-2014లో 58మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ జరిగింది. వాస్తవానికి 2011-12లో విశాఖపట్నం పోర్టు 67.42 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేసింది. కాని 2012-13లో 59.13 మి.టన్నులకు పడిపోయింది. కేంద్రప్రభుత్వం విధించిన 70 మిలియన్ టన్నులు కార్గో లక్ష్యానికి దూరంగా చతికిలపడిపోయింది. అదేసమయంలో గుజరాత్‌లోని కాండ్లా రేవు 2012-13లో 93.62 మిలియన్ టన్నులు కార్గో హ్యాండ్లింగ్‌తో దేశంలోనే నంబర్‌వన్ పోర్టుగా నిలవగా, జవహర్లాల్ నెహ్రూ పోర్టు ట్రస్టు 64.50 మిలియన్ టన్నులతో రెండోస్థానంలో నిలిచింది. ఈనేపథ్యంలో తిరిగి నంబర్‌వన్ దిశగా వెళ్లేందుకు పట్టుదలతో 2006 నాటి డ్రెడ్జింగ్ ప్రతిపాదనలకు దుమ్ముదులిపింది. అందులో భాగంగా గతేడాది అవుటర్ హార్బర్‌పై దృష్టిసారించింది. పోర్టు లోపలకు వచ్చే ఈ మార్గం లోతు తక్కువగా ఉండడంతో కేవలం 13 నుంచి 15 అడుగుల ఎత్తు కలిగిన నౌకలు మాత్రమే వస్తున్నాయి. అంతకుమించిన భారీ నౌకలను లోపలకు రావడం లేదు. దీనివలన తక్కువ పరిమాణం కలిగిన కార్గోను మాత్రమే పోర్టు హ్యాండ్లింగ్ చేయాల్సివస్తోంది. దీంతో రూ.120 కోట్లతో సముద్రం లోతును 20 అడుగులకు పెంపు పనులను ఇటీవలే పూర్తిచేసింది. ఇన్నర్ హార్బర్‌లోనూ రూ.232 కోట్లతో చేపట్టిన డ్రెడ్జింగ్ పనులు మూడుసార్లు వాయిదాపడి చివరకు వచ్చే నెల్లో పూర్తికాబోతున్నాయి. ఇప్పుడు ఈ రెండు విభాగాల డ్రెడ్జింగ్ ద్వారా ప్రపంచంలోని అత్యంత భారీ నౌకలు ఇకపై పోర్టు లోపలకు యథేచ్ఛగా వచ్చే వీలు ఏర్పడబోతోంది. సెప్టెంబర్ నెలాఖరు నుంచి పోర్టులోకి ఇవి రావచ్చని అధికారులు వివరిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు మార్గాల్లో 1.50 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన నౌకలు వస్తుండడంతో వీటిని నడిసముద్రంలో నిలిపి అందులో లోడును వేరే నౌకల్లోకి ఎక్కించి లోపలకు తరలిస్తున్నారు. దీనివల్ల జాప్యం పెరిగిపోతోంది. కాని ఇప్పుడు రెండు లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన నౌకలు ఎన్నయినా నేరుగా లోపలికివచ్చేయొచ్చు. -
వైజాగ్ పోర్టుకు తొలిసారి భారీ బొగ్గు నౌక
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ పోర్టుకు సోమవారం ఇండోనేసియా నుంచి బొగ్గు కార్గోతో అతిపెద్ద నౌక వచ్చింది. ఔటర్ హార్బర్లో డ్రెడ్జింగ్ తర్వాత దేశంలోనే అత్యంత లోతైన పోర్టుల్లో ఒకటిగా నిలిచిన వైజాగ్పోర్టుకు ఇంత భారీ కార్గోతో వచ్చిన మొదటి నౌక ఇదే. 1.60 లక్షల టన్నుల సామర్థ్యం గల ఎంవీ ఎన్జీఎం సెయిలర్ నౌక పోర్టు లోపల వేదాంత గ్రూపునకు చెందిన వైజాగ్ జనరల్ కార్గో బెర్త్‌కు చేరుకోవడంతో వేదాంత గ్రూపు సీఈవో, పోర్టు డిప్యూటీ ఛైర్మన్లు లాంఛనంగా కార్గో హ్యాండ్లింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేదాంత గ్రూపు సీఈవో డీకే మన్నాల్ మాట్లాడుతూ విశాఖపట్నం పోర్టు అవుటర్ హార్బర్లో 18అడుగుల లోతు వరకు డ్రెడ్జింగ్చేసి లోతు పెంచడంతో ప్రపంచంలోని అతిపెద్ద కార్గో నౌకలు రావడానికి వీలుపడిందని, ఈ నౌక రావడంతో ఎన్టీపీసీకి ఒకేసారి భారీగా బొగ్గు దిగుమతివచ్చినట్లైందని వివరించారు. దేశంలో సింగిల్‌డేలో 76వేల టన్నుల బొగ్గును దిగుమతిచేసుకునే సౌలభ్యం మాత్రమే ఉండేదని, ఇటీవల ఈరికార్డును 90వేల టన్నులతో ముంద్రా పోర్టు అధిగమించిందని చెప్పారు.ఇప్పుడు వీటన్నింటిని తలదన్నేలా వైజాగ్‌పోర్టు ఏకంగా 1.20లక్షల టన్నుల వరకు కార్గో హ్యాండ్లింగ్ చేసే సౌలభ్యం ఏర్పడిందని వివరించారు. పోర్టు డిప్యూటీ ఛైర్మన్ సత్యకుమార్ ప్రసంగిస్తూ డ్రెడ్జింగ్ తర్వాత భారీ నౌక రావడం పోర్టు చరిత్రలో మర్చిపోలేని రోజుగా అభివర్ణించారు. తమ పదేళ్లకల నెరవేరిందని సంతోషం వ్యక్తంచేశారు.అత్యంత లోతైన పోర్టుగా పేరున్న వీపీటీ త్వరలో ఇన్నర్హార్బర్లోనూ డ్రెడ్జింగ్ పూర్తిచేయబోతోందని ప్రకటించారు.