వైజాగ్ పోర్టుకు తొలిసారి భారీ బొగ్గు నౌక
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ పోర్టుకు సోమవారం ఇండోనేసియా నుంచి బొగ్గు కార్గోతో అతిపెద్ద నౌక వచ్చింది. ఔటర్ హార్బర్‌లో డ్రెడ్జింగ్ తర్వాత దేశంలోనే అత్యంత లోతైన పోర్టుల్లో ఒకటిగా నిలిచిన వైజాగ్‌పోర్టుకు ఇంత భారీ కార్గోతో వచ్చిన మొదటి నౌక ఇదే. 1.60 లక్షల టన్నుల సామర్థ్యం గల ఎంవీ ఎన్‌జీఎం సెయిలర్ నౌక పోర్టు లోపల వేదాంత గ్రూపునకు చెందిన వైజాగ్ జనరల్ కార్గో బెర్త్‌కు చేరుకోవడంతో వేదాంత గ్రూపు సీఈవో, పోర్టు డిప్యూటీ ఛైర్మన్‌లు లాంఛనంగా కార్గో హ్యాండ్లింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేదాంత గ్రూపు సీఈవో డీకే మన్నాల్ మాట్లాడుతూ విశాఖపట్నం పోర్టు అవుటర్ హార్బర్‌లో 18అడుగుల లోతు వరకు డ్రెడ్జింగ్‌చేసి లోతు పెంచడంతో ప్రపంచంలోని అతిపెద్ద కార్గో నౌకలు రావడానికి వీలుపడిందని, ఈ నౌక రావడంతో ఎన్‌టీపీసీకి ఒకేసారి భారీగా బొగ్గు దిగుమతివచ్చినట్లైందని వివరించారు.
దేశంలో సింగిల్‌డేలో 76వేల టన్నుల బొగ్గును దిగుమతిచేసుకునే సౌలభ్యం మాత్రమే ఉండేదని, ఇటీవల ఈరికార్డును 90వేల టన్నులతో ముంద్రా పోర్టు అధిగమించిందని చెప్పారు.ఇప్పుడు వీటన్నింటిని తలదన్నేలా వైజాగ్‌పోర్టు ఏకంగా 1.20లక్షల టన్నుల వరకు కార్గో హ్యాండ్లింగ్ చేసే సౌలభ్యం ఏర్పడిందని వివరించారు. పోర్టు డిప్యూటీ ఛైర్మన్ సత్యకుమార్ ప్రసంగిస్తూ డ్రెడ్జింగ్ తర్వాత భారీ నౌక రావడం పోర్టు చరిత్రలో మర్చిపోలేని రోజుగా అభివర్ణించారు. తమ పదేళ్లకల నెరవేరిందని సంతోషం వ్యక్తంచేశారు.అత్యంత లోతైన పోర్టుగా పేరున్న వీపీటీ త్వరలో ఇన్నర్‌హార్బర్‌లోనూ డ్రెడ్జింగ్ పూర్తిచేయబోతోందని ప్రకటించారు.