సముద్రపు వంతెన ‘అటల్‌ సేతు’.. ప్రత్యేకతలివే! | Indias Longest Sea Bridge Ready Atal Setu | Sakshi
Sakshi News home page

Atal Setu: సముద్రపు వంతెన ‘అటల్‌ సేతు’.. ప్రత్యేకతలివే!

Published Wed, Jan 10 2024 8:28 AM | Last Updated on Wed, Jan 10 2024 8:28 AM

Indias Longest Sea Bridge Ready Atal Setu - Sakshi

దేశంలోనే అత్యంత పొడవైన, ఆధునిక సముద్రపు వంతెన నిర్మాణం పూర్తయింది. దీనిని జనవరి 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ముంబయి- నవీ ముంబయిలను కలిపే ఈ అతిపెద్ద సముద్రపు వంతెన పొడవు 22 కిలోమీటర్లు. దీనికి ‘అటల్‌ సేతు’ అనే పేరు పెట్టారు. దీని విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

అటల్ సేతు వంతెన నిర్మాణంలో పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వంతెనపై 400 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ఇవి భద్రత పరంగా ఎంతో ఉపయోగపడతాయి. దీనిపై ఏదైనా వాహనం ఆగిపోయినా, పాడయిపోయినా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా ఇక్కడి కెమెరాలు ఆ సమాచారాన్ని వెంటనే కంట్రోల్ రూమ్‌కి అందిస్తాయి.

రూ. 20 వేల కోట్లతో నిర్మించిన ఈ వంతెనలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ వంతెన కారణంగా ముంబై నుండి నవీ ముంబైకి ప్రయాణం చాలా సులభతరం అవుతుంది. ఈ వంతెన ఏర్పాటుతో దక్షిణ ముంబై నుండి నవీ ముంబైకి చేరుకోవడానికి కేవలం 20 నుండి 25 నిమిషాలు పడుతుంది. ఇంతవరకూ ఈ దూరం ప్రయాణించడానికి రెండు గంటల సమయం పట్టేది. 

ఈ వంతెన ప్రారంభంతో  ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ సముద్రపు వంతెన ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై-గోవా హైవేలను కలుపుతుంది. ఈ వంతెన మహారాష్ట్రలోని రెండు పెద్ద నగరాలను కలుపుతుంది. ఇది ఆరు లేన్ల వంతెన. ఈ వంతెనలోని 16.5 కిలోమీటర్ల రహదారి సముద్రం మీద నిర్మితమయ్యింది. దాదాపు 5.5 కిలోమీటర్ల రహదారి భూభాగంపై ఉంది. దేశంలోనే అత్యంత పొడవైన అటల్ బ్రిడ్జిపై ఒకవైపు రూ.250 టోల్ వసూలు చేయనున్నారు.

శీతాకాలంలో ఇక్కడి సముద్రానికి వచ్చే ఫ్లెమింగో పక్షులను దృష్టిలో ఉంచుకుని వంతెనకు ఒకవైపు సౌండ్ బారియర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే సముద్ర జీవులకు హాని కలగని లైట్లను ఏర్పాటు చేశారు. ఈ వంతెన దక్షిణ ముంబైలోని శివడి నుండి ప్రారంభమై, ఎలిఫెంటా ద్వీపానికి ఉత్తరాన ఉన్న థానే క్రీక్‌ను దాటుతుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement