
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ పోర్టులో ఎస్సార్ పోర్ట్స్ తన నిర్వహణలోని ఐరన్ ఓర్ సామర్థ్యాలను రెట్టింపు చేయనుంది. ఇందుకోసం రూ.830 కోట్లను పెట్టుబడిగా పెడుతోంది. చివరి దశలో ఉన్న ఈ విస్తరణ ప్రాజెక్టు పూర్తయితే ప్రస్తుతం రోజుకు 70,000 టన్నులుగా ఉన్న సామర్థ్యం 1,20,000 టన్నులకు పెరుగుతుందని ఎస్సార్ పోర్ట్స్ తెలిపింది. అలాగే, వార్షిక సామర్థ్యం 12.5 మిలియన్ టన్నుల నుంచి 23 మిలియన్ టన్నులకు పెరుగుతుందని వెల్లడించింది.
గంటకు 8,000 టన్నులను లోడింగ్ చేసే సామర్థ్యం సమకూరుతుందని, దేశీయ పోర్టుల్లో ఇదే గరిష్టమని వివరించింది. అలాగే హార్బర్‌లో 2,00,000 డీడబ్ల్యూటీ సామర్థ్యంగల నౌకలను కూడా నిలపడం సాధ్యపడుతుందని పేర్కొంది. వైజాగ్ పోర్ట్‌లో ఐరన్‌ఓర్ నిర్వహణ ప్రాజెక్టును 2015 మే నెలలో ఎస్సార్ పోర్ట్స్ 30 ఏళ్ల కాలానికిగాను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి సామర్థ్యాలను రోజుకు 25,000 టన్నుల నుంచి 70,000కు విస్తరించింది. వైజాగ్ పోర్ట్‌లోని ఎస్సార్‌కు చెందిన ఈవీటీఎల్ ఐరన్ ఓర్ హ్యాండ్లింగ్ టెర్మినల్ అన్ని రకాల వాతావరణాల్లోనూ పనిచేసే సామర్థ్యంతో చైనా, జపాన్, కొరియా సహా ఆగ్నేయాసియా దేశాలకు సేవలు అందించగలదని ఎస్సార్ పోర్ట్స్ తెలిపింది.
రెండు ఎల్‌ఎన్‌జీ పోర్టుల నిర్మాణం
ఎస్సార్ పోర్ట్స్ పశ్చిమ తీరంలో ఒకటి, తూర్పు తీరంలో మరొక ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ను వచ్చే 18 నెలల్లో నిర్మించాలనుకుంటోంది. మొదటి దశలో రూ.2,500 కోట్లను వ్యయం చేయనున్నట్టు ఎస్సార్ పోర్ట్స్ ఎండీ రాజీవ్ అగర్వాల్ తెలిపారు. ఇందుకోసం సొంత నిధులతోపాటు బ్యాంకుల నుంచి రుణాలను తీసుకునే ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. ఇప్పటికే పోర్టులను నిర్వహిస్తున్న హజీరా, సలాయాను ఇందుకు కంపెనీ ఎంచుకుంది. ఈ ప్రణాళికపై దృష్టి సారించామని, రానున్న ఏడాది, ఏడాదిన్నరలో దీన్ని మొదలు పెట్టనున్నట్టు రాజీవ్ తెలిపారు.