
విదేశీ రేవులను తలదన్నేలా వైజాగ్ పోర్టు
సాక్షి, విశాఖపట్నం: దేశీయ పోర్టుల రంగంలో కోల్పోయిన నంబర్‌వన్ హోదాను తిరిగి చేజిక్కించుకునేందుకు వైజాగ్‌పోర్టు మళ్లీ సిద్ధమవుతోంది. విదేశీ ఓడరేవులను తలదన్నే సౌకర్యాలను సమకూర్చుకుంటోంది. అత్యంత కష్టమైన రూ.352 కోట్ల విలువైన డ్రెడ్జింగ్‌ను పూర్తిచేసుకుని వచ్చే నెల నుంచి ప్రపంచంలోని అతిపెద్ద కార్గో నౌకలకూ ఆతిథ్యం ఇవ్వబోతోంది.
సముద్రం మధ్యలో వేరే చిన్న నౌకలోకి కార్గోను మార్చుకునే కష్టం అక్కర్లేకుండా 2 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన షిప్పులు (పనామా వెస్సల్స్) నేరుగా పోర్టు లోపలకు వెళ్లేలా సామర్థ్యం పెంచుకుంది. తద్వారా ఏటా 6 మి.టన్నుల కార్గో పెంచుకోవడంతోపాటు, దిగుమతి దారులకు చవకైన సరకు రవాణా సౌలభ్యాన్ని అందుబాటులోకి తెస్తోంది.
నంబర్ వన్ సాధ్యమేనా?
23 బెర్త్‌లతో కార్యకలాపాలు సాగిస్తోన్న వైజాగ్‌పోర్టు 100 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సదుపాయాలను ఏర్పాటుచేసేందుకు ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. అయితే లక్ష్యానికి చేరువ కాలేకపోతోంది. ఈ క్రమంలో ఒకప్పటి నంబర్‌వన్ స్థానం నుంచి ఇప్పుడు మూడోస్థానానికి పడిపోయింది. మరోపక్క కొత్తగా వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ప్రైవేటు పోర్టులను సైతం తట్టుకోలేక ఏటేటా తనకు దక్కాల్సిన కార్గోను పక్కపోర్టులకు అప్పగించేస్తోంది.
దీంతో 2012-13లో ఏకంగా 8 మిలియన్ టన్నుల కార్గో కోల్పోయింది. 2013-2014లో 58మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ జరిగింది. వాస్తవానికి 2011-12లో విశాఖపట్నం పోర్టు 67.42 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేసింది. కాని 2012-13లో 59.13 మి.టన్నులకు పడిపోయింది. కేంద్రప్రభుత్వం విధించిన 70 మిలియన్ టన్నులు కార్గో లక్ష్యానికి దూరంగా చతికిలపడిపోయింది. అదేసమయంలో గుజరాత్‌లోని కాండ్లా రేవు 2012-13లో 93.62 మిలియన్ టన్నులు కార్గో హ్యాండ్లింగ్‌తో దేశంలోనే నంబర్‌వన్ పోర్టుగా నిలవగా, జవహర్‌లాల్ నెహ్రూ పోర్టు ట్రస్టు 64.50 మిలియన్ టన్నులతో రెండోస్థానంలో నిలిచింది.
ఈనేపథ్యంలో తిరిగి నంబర్‌వన్ దిశగా వెళ్లేందుకు పట్టుదలతో 2006 నాటి డ్రెడ్జింగ్ ప్రతిపాదనలకు దుమ్ముదులిపింది. అందులో భాగంగా గతేడాది అవుటర్ హార్బర్‌పై దృష్టిసారించింది. పోర్టు లోపలకు వచ్చే ఈ మార్గం లోతు తక్కువగా ఉండడంతో కేవలం 13 నుంచి 15 అడుగుల ఎత్తు కలిగిన నౌకలు మాత్రమే వస్తున్నాయి. అంతకుమించిన భారీ నౌకలను లోపలకు రావడం లేదు. దీనివలన తక్కువ పరిమాణం కలిగిన కార్గోను మాత్రమే పోర్టు హ్యాండ్లింగ్ చేయాల్సివస్తోంది. దీంతో రూ.120 కోట్లతో సముద్రం లోతును 20 అడుగులకు పెంపు పనులను ఇటీవలే పూర్తిచేసింది.
ఇన్నర్ హార్బర్‌లోనూ రూ.232 కోట్లతో చేపట్టిన డ్రెడ్జింగ్ పనులు మూడుసార్లు వాయిదాపడి చివరకు వచ్చే నెల్లో పూర్తికాబోతున్నాయి. ఇప్పుడు ఈ రెండు విభాగాల డ్రెడ్జింగ్ ద్వారా ప్రపంచంలోని అత్యంత భారీ నౌకలు ఇకపై పోర్టు లోపలకు యథేచ్ఛగా వచ్చే వీలు ఏర్పడబోతోంది. సెప్టెంబర్ నెలాఖరు నుంచి పోర్టులోకి ఇవి రావచ్చని అధికారులు వివరిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు మార్గాల్లో 1.50 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన నౌకలు వస్తుండడంతో వీటిని నడిసముద్రంలో నిలిపి అందులో లోడును వేరే నౌకల్లోకి ఎక్కించి లోపలకు తరలిస్తున్నారు. దీనివల్ల జాప్యం పెరిగిపోతోంది. కాని ఇప్పుడు రెండు లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన నౌకలు ఎన్నయినా నేరుగా లోపలికివచ్చేయొచ్చు.