న్యూఢిల్లీ: చైనాకు చెంది నిఘా నౌక యువాన్ వాంగ్-5 ఈ ఏడాది ఆగస్టులో శ్రీలంకలోని హంబన్‌టోట పోర్టుకు చేరుకున్న క్రమంలో భారత్-చైనాల మధ్య దౌత్యపరమైన సమస్య తలెత్తింది. ఇప్పుడు మళ్లీ చైనాకు చెందన మరో నిఘా నౌక వల్ల భారత్ చేపట్టబోయే క్షిపణి పరీక్షపై ప్రభావం పడుతోంది. డ్రాగన్‌కు చెందన నిఘా నౌక హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించిందని, దాని కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత నౌకాదళం తెలిపింది.
నవంబరు 10-11 తేదీల్లో దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టనున్నట్లు ఇటీవలే నోటమ్ (నోటీస్ టు ఎయిర్‌మెన్) జారీ చేసింది భారత్. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ ప్రయోగం నిర్వహించనున్నారు. 2,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ క్షిపణి.. శ్రీలంక, ఇండోనేషియా మధ్య ఉన్న ప్రాంతంలో సాగనుంది. అయితే నోటమ్ జారీ చేసిన తర్వాత చైనాకు చెందిన యువాన్ వాంగ్-6 అనే నిఘా, పరిశోధక నౌక.. హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించటం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత క్షిపణులు, ఉపగ్రహాల కదలికలను పరిశీలించే సామర్థ్యం ఆ నిఘా నౌకకు ఉండటమే అందుకు కారణం. ఈ నౌక ఇండోనేషియాలోని బాలీ తీరం నుంచి శుక్రవారం ఉదయమే బయల్దేరింది.
భారత క్షిపణి ప్రయోగానికి కొద్ది రోజుల ముందే ఈ నౌకను హిందూ మహా సముద్రంలోకి పంపించడం.. మన ఆయుధ పాటవంపై కన్నేసి ఉంచడానికే డ్రాగన్ చేసిన కుట్రగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్షిపణి పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేయాలని స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలు పేర్కొన్నాయి.
ఇదీ చదవండి: లక్ష ఉద్యోగాలు.. ఓపీఎస్ పునరుద్ధరణ.. మహిళలకు రూ.1,500: కాంగ్రెస్ హామీల వర్షం
Comments
Please login to add a commentAdd a comment