సాక్షి, న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదం ద్వైపాక్షిక చర్చలతోనే పరిష్కారం అవుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సత్తా మిలటరీకి ఉందని ఆయన అన్నారు. బుధవారం ఢిల్లీలో మురళీధర్ రావు ’సాక్షి’ తో మాట్లాడుతూ ‘ కాంగ్రెస్ హయాంలో చైనా బలగాలు దేశంలో భూభాగాన్ని ఆక్రమించిన విషయం అందరికీ తెలుసు. గతానికి భిన్నంగా మన మిలటరీ చైనా సైన్యాన్ని గట్టిగా ఎదిరిస్తుంది. దాని కారణంగా చైనాతో పదేపదే ఘర్షణలు జరుగుతున్నాయి. భారీ ఎత్తున చైనా సరిహద్దులో మౌలిక సదుపాయాలు ఏర్పాటు అవుతున్నాయి. (జనరల్ ఆదేశాలతో చైనా దుస్సాహసం)
దేశరక్షణ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకతాటిపై నిలబడాలి. వైఎస్సార్ కాంగ్రెస్ సహా అనేక రాజకీయ పార్టీలు చైనా విషయంలో కేంద్రానికి మద్దతు ఇవ్వడం ప్రపంచ దేశాలకు ఒక గట్టి సంకేతాన్ని పంపింది. వాస్తవాధీన రేఖ సరిహద్దు ( (ఎల్ఏసీ) అంశం నిర్థారణ అసాధ్యమైన పనేమీ కాదు. చైనా వస్తువులను బహిష్కరించడం ప్రజల అభిమతం. దేశ స్వావలంబనకు ఇది శుభ పరిణామం. చైనా వస్తువుల బహిష్కరణ అసాధ్యమేమీ కాదు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థకు నష్టమేమీ జరగదు’ అని స్పష్టం చేశారు. కాగా గల్వాన్ లోయలో ఈనెల 15న హింసాత్మక ఘటన చెలరేగిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. లద్దాఖ్ రీజియన్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ఇరు దేశాలు సైనికులను తరలించడంతో సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. (ఆ వార్త అవాస్తవం: చైనా)
Comments
Please login to add a commentAdd a comment