న్యూఢిల్లీ : భారత్‌కు చెడు చేయాలని చూసేవారికి దీటైన సమాధానం చెబుతామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణ త్యాగం చేశారని.. కానీ చైనా వైపు ఆ సంఖ్య రెండింతలుగా ఉంటుందని చెప్పారు. గురువారం పశ్చిమ బెంగాల్‌లోని వర్చువల్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. సరిహద్దుల్లో గత కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న పరిస్థితులపై స్పందించారు. ప్రస్తుతం మనం రెండు ‘సీ’ ల గురించి వింటున్నామని.. అందులో ఒకటి కరోనా వైరస్ అని, మరోకటి చైనా అని అన్నారు. భారత ప్రభుత్వం శాంతిపై నమ్మకంతో.. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాలని చూస్తుందని వెల్లడించారు. (చదవండి : ఆ అక్కాచెల్లెళ్లు.. నిత్యానంద ‘కైలాస’లో)
గల్వాన్ ఘర్షణ తర్వాత వారివైపు జరిగిన ప్రాణ నష్టంపై చైనా ఎలాంటి స్పష్టత ఇవ్వని విషయాన్ని గుర్తించాలన్నారు. గతంలో పాక్ భూభాగంలోకి వెళ్లి చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. అలాగే గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగం వృథా కానివ్వమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్న మాటలను గుర్తుచేశారు. మరోవైపు 59 చైనీస్ యాప్‌ల నిషేధంపై స్పందిస్తూ.. భారతీయులు డేటా రక్షించేందుకు డిజిటిల్ స్ట్రైక్ ప్రారంభించామని చెప్పారు. కాగా, గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో భారత్ తమవైపు 20 మంది జవాన్లు మృతిచెందినట్టుగా ప్రకటించగా.. చైనా మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయని సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment