న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో జూన్ 15న భారత సైనికులు చూపిన తెగువకు చైనా సైన్యం వణికిపోయిం దని సమాచారం. చైనా సైన్యం చేతుల్లో బందీలుగా ఉండి.. సైనికాధికారుల చర్చల అనంతరం విడుదలైన భారతీయ సైనికుల ద్వారా ఈ విషయం స్పష్టమైనట్లు తెలుస్తోంది. సుమారు 60 గంటలపాటు చైనా సైనికుల అదీనంలో ఉన్న కారణంగా భారతీయ సైనికాధికారులు, జవాన్లకు వివిధ పరీక్షలు నర్విహించారు. ఈ క్రమంలో చైనా సైన్యం మానసిక స్థితిపై ఉన్నతాధికారులు ఒక అంచనాకు రాగలిగారు. బందీలుగా ఉండి విడుదలైన ఇద్దరు మేజర్లు, ఇద్దరు కెప్టెన్లు చాలా ఉత్సాహపూరితంగా కనిపించారని, శత్రుదేశపు బందీలుగా ఉన్నా ఇలా ఉండటం ఆశ్చర్యకరమని నిపుణులు చెబుతున్నారు.
జూన్ 15న తమ కంటే ఎక్కువ సంఖ్యలో చైనీయులు విరుచుకుపడుతున్నా భారత సైన్యం వెనక్కు తగ్గకపోగా చైనీయుల చేతుల్లోని ఇనుప రాడ్లు, మేకులతో కూడిన గదల్లాంటి ఆయుధాలను లాక్కుని ప్రతిదాడికి దిగారని, ఈ క్రమంలో పెట్రోల్ పాయింట్ 14 వద్ద కనీసం 40 మంది చైనీయులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ఈ సాహసం కారణంగానే భారతీయ సైనికులు ఉత్సాహంగా కనిపించారని, చైనీయులను తరుముకుంటూ వారి ఆధిపత్యంలోని ప్రాంతాల్లోకి చొచ్చుకుపోవడం వల్లనే భారతీయులు బందీలుగా చిక్కారని ఓ అధికారి తెలిపారు. కల్నల్ సంతోష్‌బాబు మరణించిన సమాచారం తెలుసుకున్న చైనీయులు వెనుతిరిగి పారిపోయారని... వారిని వెంటాడుతూ భారతీయ సైనికులు వెళ్లారని చెప్పారు.
షాక్‌లో చైనా సైనికులు
జూన్ 15 నాటి ఘటనతో చైనా సైనికులు ఒక రకమైన షాక్‌కు గురైనట్లు చైనా నిర్బంధం నుంచి విడుదలైన సైనికుల ద్వారా తెలిసింది. భారతీయ సైనికులు తెగబడి పోరాడటమే కాకుండా ప్రతీకార దాడులకు పాల్పడతారని చైనీయులు భయపడ్డారని కొన్ని గంటల వ్యవధిలో మరింత మంది భారతీయ సైనికులు తమ మాదిరిగానే దాడి చేస్తారని వారు అంచనా వేశారని అధికార వర్గాల ద్వారా తెలిసింది. మొత్తమ్మీద చైనా దశాబ్దాలపాటు అసలైన యుద్ధంలో పాల్గొనక పోవడం కేవలం సన్నాహక విన్యాసాల్లో పాల్గొనటం సైనికులపై ప్రభావం చూపుతున్నట్లు భారతీయ అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ 15 నాటి ఘటనతో చైనీయులు భారతీయ సైన్యం అసలు రూపాన్ని చూశారని సంఖ్యాబలంలో తక్కువైనా ప్రత్యర్థులను చంపగలగడం వారిని భీతవహులను చేసిందని అధికారి ఒకరు తెలిపారు. కాగా, గల్వాన్ ఘటనపై చైనా సోషల్‌మీడియాలో అసంతృప్తి వ్యక్తమైంది. వాట్సప్ తరహా సామాజిక మాధ్యమం వీబోలో పీఎల్‌ఏ సైనికులు ఎంత మంది మరణించారన్న విషయంపై ఆసక్తికరమైన చర్చలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment