45 ఏళ్ల తర్వాత మరణాలు.. చైనాపై జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు | Minister Jaishankar Key Comments Over India-China Ties | Sakshi
Sakshi News home page

45 ఏళ్ల తర్వాత మరణాలు.. చైనాపై జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు

Published Tue, Dec 3 2024 2:57 PM | Last Updated on Tue, Dec 3 2024 4:16 PM

Minister Jaishankar Key Comments Over India-China Ties

ఢిల్లీ: భారత్‌-చైనా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు విదేశాంగ మంత్రి జైశంకర్‌. గత కొద్ది నెలలుగా రెండు దేశాల మధ్య నిరంతర దౌత్య చర్చల ఫలితంగా సంబంధాలు మెరుగైనట్టు ఆయన తెలిపారు. భారత సరిహద్దుల విషయంలో కూడా కీలక పురోగతి నెలకొందని చెప్పుకొచ్చారు.

ఢిల్లీలో పార్లమెంట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సమావేశాల్లో భాగంగా విదేశాంగ మంత్రి జైశంకర్‌..‘భారత్‌-చైనా సంబంధాల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా జైశంకర్‌ పార్లమెంట్‌లో మాట్లాడుతూ..‘చైనా చర్యల కారణంగా 2020లో సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతకు భంగం వాటిల్లింది. అప్పటినుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, నిరంతర దౌత్య చర్చల ఫలితంగా ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఇటీవల కొంత మెరుగుదల కనిపించిందని తెలిపారు.

2020 ఏప్రిల్‌లో తూర్పు లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలలో రెండు దేశాల సైన్యం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గడిచిన 45 సంవత్సరాల కాలంలో  మొదటిసారిగా రెండు వైపులా మరణాలకు ఈ ఘర్షణ దారితీసింది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. సరిహద్దు సమస్యకు న్యాయమైన, సహేతుకమైన.. పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారానికి రావడానికి ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. ఇందుకు కోసం భారతదేశం కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఇటీవలి కాలంలో లడఖ్‌లోని భారత సరిహద్దుల నుంచి చైనా బలగాలు, భారత సైన్యం వెనక్కి వెళ్లినట్టు ఆయన తెలిపారు. 

గతంలో 38 వేల చదరపు కిలోమీటర్ల భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించింది. వాస్తవాధీన రేఖకు సంబంధించి కొన్ని ప్రాంతాలలో ఇరుదేశాలకు  ఏకాభిప్రాయం లేదు. పరస్పరం అంగీకరించిన యంత్రాంగం ద్వారా శాంతియుతంగా సరిహద్దు సెటిల్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నాం. ఇటీవల జరిగిన బ్రిక్స్‌ సమావేశాల్లో కూడా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పలు విషయాలపై చర్చించారు’ అని చెప్పుకొచ్చారు. 

లాజిస్టికల్ సవాళ్లు, కొవిడ్ పరిస్థితులు ఉన్నప్పటికీ.. మన బలగాలు వేగంగా, సమర్థవంతంగా స్పందించి చైనాను కట్టడి చేశాయి. ఇలా తమ సామర్థ్యాలతో ఓ వైపు దీటుగా ప్రతిస్పందిస్తూనే, ఉద్రిక్తతలు తగ్గించడం కోసం పొరుగు దేశంతో దౌత్యపరమైన చర్చలకు ప్రయత్నాలు చేశాం. సరిహద్దులో శాంతి, స్థిరత్వం లేకుండా ఇరు దేశాల సంబంధాలు సాధారణంగా ఉండలేవని మన ప్రభుత్వం స్పష్టంగా పేర్కొందన్నారు. వీటికి సంబంధించి భారత్‌కు స్పష్టమైన వైఖరి ఉందన్నారు. న్యాయమైన, సహేతుక, పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం కోసం చైనాతో చర్చలు జరిపేందుకు భారత్‌ కట్టుబడి ఉందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement