భారత–చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తత మరోమారు పార్లమెంట్ సహా దేశమంతటినీ కుదిపి వేస్తోంది. డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ వద్ద యాంగ్సే ప్రాంతంలో చొచ్చుకొని రావడానికి చైనా సైన్యం చేసిన ప్రయత్నాన్ని భారత సైనికులు గట్టిగా తిప్పికొట్టిన తీరుపై వైనవైనాలుగా కథనాలు వస్తున్నాయి. అక్కడ నిజంగా జరిగిందేమిటో తెలుసుకొని, పరిస్థితిని సమీక్షించి, లోటుపాట్లను సరిదిద్దుకొని, రక్షణ దళాలను బలోపేతం చేసే పనిలో భారత ప్రభుత్వం ఇప్పటికే ఉంది. అయితే, సరిహద్దు వెంట శాంతి నెలకొనాలనీ, అనేక ఇతర అంశాల్లో సహకారం వెల్లివిరియాలనీ – ఇరుదేశాల మధ్య ఉన్న ఒప్పందాన్ని దశాబ్ద కాలంగా పొరుగుదేశం పదే పదే ఉల్లంఘించడం కీలకాంశం. పొరుగునే పొంచివున్న పాము పట్ల అప్రమత్తత అనివార్యం.
రెండేళ్ళ క్రితం 2020 జూన్ 15 నాటి గల్వాన్ ఘర్షణల్లోనూ, తాజా తవాంగ్ ఘటనలోనూ చైనా తన తప్పేమీ లేదనే భావన కలిగించడానికి శతవిధాల ప్రయత్నించింది. వాస్తవాలు వెలికి రావడంతో డ్రాగన్ పాచిక పారలేదు. భారత – చైనాల మధ్య సైనిక ఘర్షణ 1962 నుంచి 60 ఏళ్ళుగా సాగుతోంది. లద్దాఖ్ పరిసర పశ్చిమ ప్రాంతం – టిబెట్‌తో మన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్‌ల సరిహద్దుతో కూడిన మధ్యప్రాంతం – అరుణాచల్ ప్రదేశ్ వద్ద సరిహద్దుతో కూడిన తూర్పు ప్రాంతం... ఈ మూడూ భారత–చైనా సరిహద్దులో ప్రధాన ప్రాంతాలు. అరుణాచల్‌తో ఉన్న 1126 కి.మీల తూర్పు సరిహద్దుపై చైనా ఎప్పుడూ పేచీ పెడుతూనే ఉంది. అరుణాచల్ తనదేనంటోంది. అధిక భాగాన్ని ‘దక్షిణ టిబెట్’ అని ప్రస్తావిస్తూ, అక్కడి ప్రదేశాలకు తన పేర్లు పెట్టి పిలుస్తోంది.
అరుణాచల్‌పై రచ్చ రేపి, చివరకు పశ్చిమాన భారత్ అధీనంలో ఉన్న కీలక అక్సాయ్‌చిన్‌ని తమకు వదిలేస్తే, అరుణాచల్‌పై పట్టు వీడతామని బేరం పెట్టడం డ్రాగన్ వ్యూహమని ఓ విశ్లేషణ. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) తూర్పు ప్రాంతంలో వ్యూహాత్మక తవాంగ్ వద్ద చైనాకు ఎప్పుడూ పట్టు లేదు. 17వేల అడుగుల ఎత్తైన పర్వతప్రాంతాన్ని వశం చేసుకుంటే, ఎల్‌ఏసీకి ఇరువైపులా స్పష్టంగా చూడవచ్చు. ఆ గుట్టపై ఆధిక్యం సంపాదించి, భారత్‌కు చోటు లేకుండా చేయాలన్నది చైనా పన్నాగం. అలాగే అరుణాచల్‌లో వివాదాస్పద సరిహద్దు వెంట భారత దళాల బలమెంతో అంచనా వేయడానికీ తాజా చర్యకు దిగింది. అది ఫలించకపోవడంతో తవాంగ్‌లో ప్రస్తుతానికి భారత్‌దే పైచేయి. కానీ, మరోపక్క సిక్కిమ్ సరిహద్దులో 2017లో ఘర్షణ సాగిన కీలక డోక్లామ్ ప్రాంతంలో కొన్నేళ్ళుగా చైనా ఊళ్ళకు ఊళ్ళు కడుతోంది. వంతెనలు నిర్మిస్తోంది. ఇది ఆందోళనకరం.
తవాంగ్‌లో 13 వేల అడుగుల ఎత్తైన చోట, మైనస్ 15 డిగ్రీల్లోనూ భారత్ నిర్మిస్తున్న సేలా సొరంగ మార్గం పూర్తి కావచ్చింది. ఇటు ప్రజలకూ, అటు ఆర్మీకీ పనికొచ్చే ఇలాంటివి చైనాను చీకాకుపరుస్తున్నాయి. ఆసియాపై ఆధిక్యం చూపాలంటే, హిమాలయ ప్రాంతంపై పట్టు బిగించడం చైనాకు కీలకం. పైగా, భవిష్యత్ దలైలామా తవాంగ్ ప్రాంతంలో జన్మిస్తారని ఓ నమ్మకం. అలా ధార్మికంగానూ ఆ ప్రాంతం తమకు కీలకమనీ, అదీ తమ దేశంలో భాగమైపోవాలనీ చైనా తాప త్రయం. మరోపక్క బ్రహ్మపుత్రా నదిపై ప్రాజెక్ట్‌లు కడుతూ, ఆ జలాలపై ఆధారపడ్డ ఇతర పొరుగు దేశాలను అడకత్తెరలో బిగిస్తోంది. ఇక, తవాంగ్ ఘటనలో భారత్‌ను అమెరికా సమర్థించడంతో పుండు మీద కారం రాసినట్టయింది. భారత, అమెరికాల బంధం బలోపేతమైతే తన ప్రాంతీయ ఆధిపత్యానికి గండి పడుతుందని చైనా భావన. అందుకే, ఢిల్లీ, వాషింగ్టన్‌లు దగ్గరవుతున్న కొద్దీ కవ్వింపు పెంచుతోంది. ప్రపంచవేదికలు శాంతివచనాలు పలుకుతున్నా, వాటి ప్రభావం శూన్యం.
జాతీయ భద్రత, ప్రాదేశిక సమగ్రతపై మన దేశమంతా ఏకతాటిపై ఉందని చాటాల్సిన సమ యమిది. కానీ తవాంగ్ ఘటన సైతం రాజకీయమవుతోంది. తమనూ విశ్వాసంలోకి తీసుకొని, సరిహద్దు రక్షణపై పార్లమెంట్‌లో చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతుంటే, కారణాలేమైనా అధి కార బీజేపీ అంగీకరించట్లేదు. 1962 చైనా యుద్ధవేళ నెహ్రూ విధానాన్ని కాషాయధ్వజులు తప్పు పడున్నారు. అప్పట్లో నెహ్రూ సభలో చర్చించి, ఏకంగా 165 మంది ఎంపీలకు మాట్లాడే అవకాశ మిచ్చి, ఆపైనే నిర్ణయం తీసుకున్నారని విస్మరిస్తే ఎలా అని కాంగీయులు ప్రతిదాడి చేస్తున్నారు. వెరసి, అప్పట్లో గల్వాన్ ఘటనలోనూ, ఇప్పుడీ తవాంగ్‌పైనా ఈ రాజకీయ వాగ్వాదపర్వం కీలకమైన దేశభద్రతలో లోటుపాట్లపై లోతైన చర్చకు దారి తీయకపోవడమే విచారకరం.
సరిహద్దు వెంట చైనా లాగానే, టిబెట్, దక్షిణ మంగోలియా, హాంకాంగ్, తవాంగ్ లాంటి చోట్ల చైనాపై మనమూ దూకుడు చూపాలనేది కొందరి వాదన. అయితే, మన పాలకులు ‘ఆత్మనిర్భరత’ అంటూ రొమ్ము విరుచుకుంటున్నా, ఇవాళ్టికీ బొమ్మలు (86 శాతం), ఎలక్ట్రానిక్ విడిభాగాలు (37 శాతం), ఆటో విడిభాగాలు (30 శాతం) సహా అనేక అంశాల్లో మనం చైనా దిగుమతులపైనే ఆధార పడ్డాం. వస్తూత్పత్తిలో స్వీయపురోగతికి దీర్ఘకాలం పడుతుంది. అలా చూస్తే పొరుగున ఉన్న చైనాతో బద్ధశత్రుత్వంతో రోజులు గడవవు. దౌత్యపరమైన ఒత్తిడి పెడుతూనే, నేటికీ స్పష్టంగా అంగీకారం లేని సరిహద్దు రేఖపై చర్చించి, శాశ్వత పరిష్కారానికి ప్రయత్నించాలి. సరిహద్దుల్లో జరగనున్న భారత వైమానికదళ విన్యాసాలతో తోక తొక్కిన తాచులా చైనా బుసలుకొట్టవచ్చు. రానున్న రోజుల్లో ఉద్రిక్తతలూ పెరగవచ్చు. ఇటీవల ఢిల్లీ ఎయిమ్స్‌లో సర్వర్లను స్తంభింపజేసిన సైబర్ దాడీ చైనా పనేనట. ఈ పరిస్థితుల్లో సైన్యం, భారత గూఢచారి దళాల అప్రమత్తతే మనకు రక్షాకవచం.
Comments
Please login to add a commentAdd a comment