సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత్ శాంతికాముక దేశం. అనవసరంగా ఎవరైనా కయ్యానికి కాలు దువ్వితే తగిన రీతిలో గుణపాఠం చెబుతాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. సైనిక సంపత్తితోపాటు ఆర్థికంగా భారత్‌కన్నా ఎన్నో రెట్లు బలమైన చైనా దేశానికి గుణపాఠం చెప్పడం ఎలా ? భారత్ భూభాగంలోకి కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న చైనా ఉత్పత్తులను బహిష్కరించడమే సరైన గుణ పాఠమని బీజేపీకి మిత్రులైన సంఘ్ వర్గాలతోపాటు పలు రంగాలకు చెందిన నిపుణులు కూడా సూచిస్తున్నారు. దాని వల్ల ఆశించిన ప్రయోజనం లభించక పోయినా దాన్ని ఓ ఆయుధంగా ఉపయోగించాల్సిందేనని ఆర్థిక నిపుణులు చెబున్నారు. భారత్‌లోని అనేక కంపెనీల్లో కూడా చైనా పెట్టుబడులు ఉన్నాయి. ముందుగా వాటి జోలికి పోకుండా చైనా నుంచి నేరుగా వచ్చి పడుతున్న ఉత్పత్తులను బహిష్కరించాలని వారు సూచిస్తున్నారు. ఆత్మాభిమానం నిలుపుకోవడానికి ఆ మాత్రం చర్య అవసరమని వారంటున్నారు. ఆత్మాభిమానం కన్నా పారదర్శకమైన దౌత్యపరమైన చర్యలు మరీ ముఖ్యం. (చైనా కాఠిన్యం: భారత జవాన్లపై కర్కశం)
‘వాస్తవాధీన రేఖ వద్ద సైనిక కదలికలను తగ్గించాలని జూన్ 6వ తేదీన చైనా, భారత్‌కు చెందిన ఉన్నత స్థాయి సైనిక అధికారుల మధ్య జరిగిన చర్చల్లో అవగాహన కుదిరింది. ఆ అవగాహనకు విరుద్ధుంగా చైనా అధికారులు వాస్తవాధీన రేఖను అతిక్రమించి ముందుకు చొచ్చుకు వచ్చారు. అక్కడ సైనిక గుడారం లాంటి నిర్మాణాన్ని నిర్మించబోగా భారత సైనికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన సైనికులు మరణించారు’ అంటూ భారత విదేశాంగ శాఖ బుధవారం స్పష్టం చేసింది. లద్ధాఖ్‌లోని గాల్వలోయలో అసలు ఏం జరిగిందీ, ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసిన పరిస్థితులేమిటీ ? అన్న అంశాలపై భారత్ కాస్త ఆలస్యంగా స్పందించినప్పటికీ స్పష్టమైన వివరణ ఇచ్చింది. మిత్ర దేశాలకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అంతటితో ఆగిపోకుండా ఇదే పారదర్శకమైన విధానంతో అంతర్జాతీయ సమాజం ముందుకు వెళ్లి చైనా నిజ నైజాన్ని చూపించాలి. కరోనా వైరస్ కూడా చైనా ల్యాబ్ సృష్టించేదంటూ ఆ దేశంపై మండిపడుతున్న అమెరికా కూటమి దేశాలతో కలిసి చైనాతో భారత్ దౌత్య యుద్ధం చేయాలని పలువురు వార్ వెటరన్స్ సూచిస్తున్నారు. (భారత సైన్యంపై చైనా నిందలు)
Comments
Please login to add a commentAdd a comment