
కొనుగోళ్లకు పురికొల్పే తాజా ట్రిగ్గర్‌లు ఏమీ లేనందున శుక్రవారం స్టాక్ మార్కెట్ అక్కడక్కడే ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటంతో స్టాక్ సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలో లాభ, నష్టాల మధ్య దోబూచులాడాయి. భారత్–చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నివారణకు ఐదు సూత్రాల ఒప్పందం కుదరడం ఒకింత సానుకూల ప్రభావం చూపించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు తగ్గి 73.53కు చేరింది. సెన్సెక్స్ 14 పాయింట్లు లాభపడి 38,855 పాయింట్ల వద్ద, నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 11,464 పాయింట్ల వద్ద ముగిశాయి. సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. ఈ వారంలో సెన్సెక్స్‌లో 497 పాయింట్లు, నిఫ్టీ 131 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.
ఆరు గంటలు పరిమిత శ్రేణిలోనే...
ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా మన మార్కెట్ లాభాల్లోనే మొదలైంది. ఆ తర్వాత వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. దాదాపు ఆరుగంటల పాటు సూచీలు చాలా పరిమిత శ్రేణిలో లాభ,నష్టాల మధ్య కదలాడాయి. చివరి అరగంటలోనే నిలకడగా పెరిగాయి. సెన్సెక్స్ ఒక దశలో 128 పాయింట్లు పతనం కాగా, మరో దశలో 139 పాయింట్లు పెరిగింది. మొత్తం మీద రోజంతా 267 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. టీసీఎస్, హిందుస్తాన్ యూనిలివర్, ఇన్ఫోసిస్ లాభాలను హెచ్‌డీఎఫ్‌సీ జోడీ, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్ హరించి వేశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి.
► ఎస్‌బీఐ 2.3% లాభంతో రూ.203 వద్ద ముగి సింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే.
► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో ఐటీ షేర్లు లాభపడ్డాయి.
► దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఎస్‌బిఐ కార్డ్స్, లారస్ ల్యాబ్స్, ఇమామి, జుబిలంట్ ఫుడ్‌వర్క్స్, విప్రోలు ఈ జాబితాలో ఉన్నాయి.
► దాదాపు 250కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. ఫ్యూచర్ రిటైల్, యస్‌బ్యాంక్, డిష్ టీవీ తదితర షేర్లు జాబితాలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment