న్యూఢిల్లీ : గల్వాన్ లోయ వద్ద చైనా సైనికుల దాడి ఘటన తరువాత భారత్‌లో చైనా వస్తువుల బహిష్కరణ నినాదం ఊపందుకుంది. చైనా వస్తువులను ఇండియా బహిష్కరిస్తే ఆ దేశానికి ఆర్థికంగా నష్టం వస్తుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈనెల 16న జరిగిన చైనా-భారత్ సంఘటనలో 20 మంది భారత జవాన్లు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో చైనా తయారు చేసిన వస్తువులను, ఉత్పత్తులను బహిష్కరించాలని కేంద్ర పిలుపునివ్వడంతో అనేక రాష్ట్రాల్లో చైనా వస్తువులకు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగుతున్నాయి.
ఈ క్రమంలో చైనాపై భారత్ ప్రజల అభిప్రాయాలను అంచనా వేయడానికి న్యూస్ 18 నెట్‌వర్క్ డిజిటల్ తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో కలిసి ఆన్‌లైన్ పోల్‌ను నిర్వహించింది. ఇది శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నం(24 గంటలు) వరకు చేపట్టింది. తొమ్మిది ప్రశ్నలతో కూడిన ఈ సర్వేలో సుమారు 6,000 వేల మంది తమ స్పందనలను తెలియజేశారు. ఇందులో కనీసం 70 శాతం మంది భారతీయులు చైనా వస్తువులను బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తేలింది. వీరు చైనా వస్తువులకు బదులు ఎక్కువ మొత్తంలో చెల్లించి వేరే వస్తువులను కొనేందుకు సైతం ఆసక్తి చూపుతున్నారు. వీరిలో 91 శాతం మంది చైనా యాప్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించడం మానేస్తామని తెలిపినట్లు వెల్లడైంది. అంతేగాక ఇతరులను ఇందుకు ప్రోత్సాహిస్తామని తేలింది. 92 శాతం మంది చైనా ఉత్పత్తులపై తమకు నమ్మకం లేదని తెలిపారు.
కాగా వీరిలో ఎక్కువ మందికి చైనాపై వ్యతిరేక వాదన ఉంది. ఎక్కువగా 97 శాతం ప్రజలు చైనా ఉత్పత్తులను భారతీయ సెలబ్రిటీలు ఉపయోగించడం మానేయాలని సూచించారు. 92 శాతం మంది భారత్‌కు పాకిస్తాన్ కంటే చైనా భారత్‌కు పెద్ద ముప్పుగా తయారైందని భావిస్తున్నారు. అలాగే 52 శాతం మంది భారత్‌కు మిత్రదేహాలు లేవని దేశం తనను తాను రక్షించుకోవాల్సి ఉందని హితవు పలికారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (18.12 శాతం) కంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (19.32 శాతం) భారత్‌కు మంచి సన్నిహితుడిగా పేర్కొన్నారు.
చైనీయుల ఆహారం మరియు రెస్టారెంట్లను బహిష్కరించాలని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే ఇంతకుముందు పిలుపునిచ్చినప్పటికీ, చాలా మంది భారతీయులు దీని గురించి ఇంకా తెలియదన్నారు. 43 శాతం మంది తాము చైనీస్ ఆహారాన్ని తినబోమని, 31 శాతం మంది ఆ ఆహారంతో తమకు సంబంధం లేదని చెప్పారు. కాగా గత 15 రోజుల్లో చైనాపై మనోభావాలను అంచనా వేయడానికి న్యూస్ 18 నిర్వహించిన రెండవ పోల్ ఇది. మొదటి పోల్ ఫలితాలు జూన్ 5న వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment