Chinese Products Banned In India: Sakshi Guest Column On India Imposed Ban On Chinese Products - Sakshi
Sakshi News home page

వివాదాలున్నా... వ్యాపారం వ్యాపారమే!

Published Sat, Jan 1 2022 1:33 AM | Last Updated on Sat, Jan 1 2022 8:50 AM

Sakshi Guest Column On India Imposed Ban On Chinese Products

చైనా వస్తువులను బహిష్కరించాలని భారత్‌ పాలకులు, దేశంలోని ఓ వర్గం ఈ మధ్య తరచుగా పిలుపునివ్వడం కనిపిస్తున్నది. నిజంగా చైనా వస్తువులను సంపూర్ణంగా బహిష్కరించి భారత దేశం మనుగడ సాగించగలదా? స్వయంసమృద్ధి సాధించినప్పుడే ఇటువంటి పిలుపు ఇవ్వడంలో అర్థం ఉంటుంది. అయితే ప్రభుత్వం స్వయం సమృద్ధిని సాధించినట్లు నటిస్తూ ప్రజలను మభ్యపెడుతోంది. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) పొడవునా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నా... భారత్‌–చైనాల మధ్య వాణిజ్య పరిమాణం పెరగటం వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది. 2021 జనవరి–నవంబర్‌ మధ్య కాలంలో భారత్, చైనాల మధ్య మొత్తం రూ. 8.57 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య జరిగిన వ్యాపారంలో అత్యధిక మొత్తం ఇదే. 

వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్‌ – చైనా మధ్య వాణిజ్య పరిమాణం పెరుగుతోంది. ఇరు దేశాలూ  50,000 మందికి పైగా సైనికులను అక్కడ మోహరించి ఉంచాయి. ఇది 1962 యుద్ధ సమయంలో మోహరించిన సైనికుల సంఖ్య కంటే ఎక్కువ అనే సంగతి గమనార్హం. సరిహద్దు వివాదాన్ని పరిష్క రించడానికి ప్రయత్నించిన పన్నెండు కమాండర్‌ స్థాయి చర్చలు విఫలమయ్యాయి. ఇప్పుడు కూడా సాధారణ స్థితిని కొన సాగిం చడానికి రెండు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

ప్రస్తుత పరిస్థితి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రాము ఖ్యతకు సాక్ష్యంగా నిలిచింది. ఇవ్వాళ యుద్ధం కంటే వ్యాపారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే యుద్ధం ద్వారా పౌరుల అవసరాలను మనం తీర్చలేం. ఇతర దేశాలతో ఒక దేశం వ్యాపార సంబంధాలు సరిగా లేకపోతే అది చివరికి నాశనం అవుతుంది. మనం అన్ని విధాలుగా స్వావలంబన సాధించడానికి ప్రయత్నించాలి. అదే మనల్ని ఏ రకమైన యుద్ధం నుండైనా కాపాడగలుగుతుంది. మారిన పరిస్థితులను ఆశ్చర్యంతో చూడవలసిన పనిలేదు. భారతదేశం ఇప్పటికీ స్వయంసమృద్ధి సాధించలేదన్నది నిజం.

అనేక ఉత్పత్తుల సరఫరా కోసం చైనాపై ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో  చైనా ఉత్పత్తులను బహిష్కరించడం భావోద్వేగ చర్య అవుతుంది. వాస్తవా నికి, భారతీయ మార్కెట్‌ను చైనా ఉత్పత్తులు ఇప్పటికే ఆక్రమిం చేశాయి. కత్తెర్లు, రేజర్లు, పిల్లలకు బొమ్మలు, దీపావళిలో విక్రయించే ప్రమిదలు, భారతీయ దేవతా విగ్రహాలు, అలంకరణ సామగ్రి, మొబైల్స్, టీవీలు, ల్యాప్‌ టాప్‌లు,  పల్లెల కిరాణా దుకాణాల్లో విక్ర యించే చాలా వస్తువులు,  క్షురకులు క్షౌరం చేసేటప్పుడు వాడే షీట్లు.. ఇలా మనం ఉపయోగించే ఎన్నో ఉత్పత్తులు చైనాలోనే తయార వుతున్నాయి. ఇప్పుడు భారత మార్కెట్‌ చైనా వస్తువులతో నిండి ఉందన్నది నిజం. ఇటువంటి పరిస్థితిలో చైనా ఉత్పత్తులను బహిష్క రించాలని ఆలోచించడం కూడా పగటి కలలాంటిదే అని చెప్పక తప్పదు.

చైనా ప్రభుత్వం విడుదల చేసిన తాజా డేటా ప్రకారం...  2021లో భారతదేశం నుండి చైనా మునుపటి కంటే ఎక్కువ పరిమాణంలో వస్తువులను దిగుమతి చేసుకుంది. రాబోయే రోజుల్లో భారతదేశంతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి చైనా పాలకులు కూడా మరింతగా మొగ్గు చూపుతున్నారు. 2020లో చైనాతో భారతదేశం జరిపిన మొత్తం వాణిజ్యం విలువ 87.6 బిలి యన్‌ డాలర్లు. దీనిలో భారతదేశం చైనా నుండి సుమారు 50.28 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. దీనికి ముందు 2019లో భారతదేశం చైనా నుండి 20.17 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులనే దిగుమతి చేసుకుంది. ఈ దిగుమతుల్లో విద్యుత్‌ యంత్రాలు, యంత్రాల విడి భాగాలు వంటివి ఎక్కువగా ఉన్నాయి. వీటితోపాటు, భారతదేశం 8.39 బిలియన్‌ డాలర్ల విలువైన సేంద్రియ రసాయనాలు, 1.67 బిలియన్‌ డాలర్ల విలువైన ఎరువులు వంటివాటిని చైనా నుండి దిగుమతి చేసుకుంది.

2014–15 ఆర్థిక సంవత్సరం నుండి 2019–20 ఆర్థిక సంవత్సరం వరకు భారత్‌– చైనా మధ్య జరిగిన వాణిజ్య కార్య కలాపాల డేటాను పరిశీలిస్తే... భారతదేశం చైనాకు చాలా తక్కువ విలువ కలిగిన ముడి ఉత్పత్తులను ఎగుమతి చేసినట్లు కనిపిస్తుంది. అదే సమయంలో చైనా నుండి వస్తు తయారీ సంబంధిత ఉత్ప త్తులను దిగుమతి చేసుకుంది. ఈ కాలంలో చైనా ప్రధానంగా ఇనుప ఖనిజం, పెట్రోలియం ఆధారిత ఇంధనాలు, సేంద్రియ రసాయ నాలు, శుద్ధి చేసిన రాగి, పత్తి నూలు వంటి వాటిని భారతదేశం నుండి దిగుమతి చేసుకుంది. భారతదేశం చేపలు, సముద్ర ఆహారం, నల్ల మిరియాలు, వంట నూనెలు, కొవ్వు వంటి ఆహార ఉత్పత్తులను  చైనాకు ఎగుమతి చేస్తోంది. అలాగే భారతదేశం భవన నిర్మాణంలో ఉపయోగించే గ్రానైట్‌ బండలను, రాళ్లను; ముడి పత్తిని కూడా చైనాకు ఎగుమతి చేస్తోంది.

 గత కొన్ని సంవత్సరాలుగా చైనా నుండి భారతదేశం... ఆటోమేటిక్‌ డేటా ప్రాసెసింగ్‌ యంత్రాలు, టెలిఫోన్‌ పరికరాలు, వీడియో ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్లు, ట్రాన్సిస్టర్లు, సెమీకండక్టర్‌ పరికరాలు, యాంటీబయాటిక్స్, ఎరువులు, సౌండ్‌ రికార్డింగ్‌ పరిక రాలు, టీవీ కెమెరాలు, ఆటో భాగాలు, ఆటో ఉపకరణాలు వంటి వాటిని ప్రధానంగా దిగుమతి చేసుకుంది. ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ విషయంలో కూడా చైనా భారత మార్కెట్లో ఆధిపత్యం చెలాయి స్తోంది. ఒక దేశ ఎగుమతుల వల్ల వచ్చిన ఆదాయం దిగుమతులు చేసుకోవడానికి ఖర్చుచేసిన వ్యయం కంటే ఎక్కువ ఉంటే దానిని విదేశీ వాణిజ్య లాభం అంటారు. అయితే దిగుమతులపై ఖర్చు చేసిన మొత్తం ఎగుమతుల నుండి సంపాదించిన మొత్తం కంటే ఎక్కువగా ఉంటే విదేశీ వాణిజ్య లోటు అని అంటారు.

చైనాతో భారతదేశ వాణిజ్య లోటు నిరంతరం పెరుగుతోంది. ఎందుకంటే భారతదేశం చైనా నుండి ఎక్కువ ఉత్పత్తులను దిగుమతి చేసుకొని, తక్కువ ఎగుమతి చేస్తున్నది. 2014 నుంచి 2021 వరకు చైనాతో జరిగిన వాణిజ్యాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. 2014లో చైనాతో భారత్‌ వాణిజ్య లోటు రూ.3.36 లక్షల కోట్లు ఉండగా 2015కి రూ.3.91 లక్షల కోట్లకు చేరింది. అది 2016లో రూ.3.87 లక్షల కోట్లు ఉంటే... 2017లో రూ.4.45 లక్షల కోట్లు ఉంది. అయితే 2018లో ఈ వాణిజ్య లోటు పెరుగుదల కొద్దిగా తగ్గి రూ.4.30 లక్షల కోట్లుగా నమోదైంది. ఆ తర్వాత 2019లో రూ.3.83 లక్షల కోట్లు, 2020లో రూ.3.30 లక్షల కోట్లుగా నమోదైనా... తిరిగి 2021లో రూ.4.61 లక్షల కోట్లకు వాణిజ్య లోటు పెరిగింది. చైనా ఉత్పత్తులను బహిష్కరిస్తామని లక్షల సార్లు ప్రకటించినా... వాస్తవానికి అలా చేయడం భారత్‌కు సాధ్యం కాదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మన దేశీయ అవసరాలను తీర్చడానికి మనం చైనా ఉత్పత్తులపై ఆధారపడుతూనే ఉంటాం. ఇది మాత్రమే కాదు, ఇప్పటికీ వివిధ ఉత్పత్తుల తయారీ కోసం చైనా నుండి ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం.

కంప్యూటర్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమల రంగంలో చైనా స్వయంసమృద్ధి సాధించింది. చైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు వివిధ ఉత్పత్తులను ఎగుమతి చేçస్తోంది. ఎలక్ట్రానిక్స్‌ 20.6 శాతం, యంత్రాలు 13.4 శాతం, సేంద్రియ రసాయనాలు 8.6 శాతం, ప్లాస్టిక్‌ ఉత్పత్తులు 2.7 శాతంౖ చెనా నుంచి దిగుమతి అవుతున్న ఉత్పత్తుల్లో ఉన్నాయి. ఇండియా నుంచి చైనాకు ఎగుమతి అవుతున్న ఉత్పత్తుల్లో సేంద్రియ రసాయనాలు, పత్తి కలిసి 3.2 శాతం వాటాను, అలాగే దుస్తులు 1.8 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

విద్యుత్‌ యంత్రాలు, యంత్ర పరికరాలు, సేంద్రీయ రసా యనాలు, ప్లాస్టిక్‌లు, ఆప్టికల్‌ సర్జికల్‌ పరికరాలను భారతదేశం దిగుమతి చేసుకునేవాటిలో అధికంగా ఉన్నాయి. ఇవి భారతదేశం మొత్తం దిగుమతుల్లో 28 శాతంగా ఉన్నాయి. భారతదేశం చైనా నుంచి 40 శాతం సేంద్రియ రసాయనాలను దిగుమతి చేసుçకుం టున్నది. అలాగే ఆ రసాయనాలను ఉపయోగించి తయారు చేసిన ఉత్ప త్తులను చైనాకు ఎగుమతి చేస్తున్నది.

చైనాలో తయారైన వస్తువులను బహిష్కరించాలనే మాట భారత్‌లో వినిపిస్తున్నప్పటికీ, ఇక్కడి అనేక పరిశ్రమలు... ముడి పదార్థాలు, యంత్ర విడి భాగాల కోసం చైనాపై ఆధారపడి ఉన్నా యనే సంగతి మరువరాదు. అదే సమయంలో భారత ప్రజలు అనేక చైనా వస్తువుల వినియోగానికి అలవాటై ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో, చైనా ఉత్పత్తులను బహిష్కరిస్తున్నట్లు నటించడానికి బదులుగా ‘మేడ్‌ ఇన్‌ ఇండియా‘ వస్తువుల పరిమాణాన్ని పెంచడంపై మనం దృష్టి పెట్టాలి. 
 – సతీష్‌ సింగ్, సీనియర్‌ జర్నలిస్ట్‌
 (మిలీనియం పోస్ట్‌ సౌజన్యంతో) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement