అమ్ములపొదిలోకి కొత్త అస్త్రాలు | 5 Rafale fighter jets formally join Indian Air Force | Sakshi
Sakshi News home page

అమ్ములపొదిలోకి కొత్త అస్త్రాలు

Published Fri, Sep 11 2020 4:13 AM | Last Updated on Fri, Sep 11 2020 5:12 AM

5 Rafale fighter jets formally join Indian Air Force - Sakshi

అంబాలా ఎయిర్‌బేస్‌లో రఫేల్‌ ఫైటర్‌ జెట్‌

అంబాలా: భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ మన దేశ వాయుసేన మరింత బలోపేతమైంది. భారత్‌ అమ్ములపొదిలోకి అయిదు రఫేల్‌ యుద్ధ విమానాలు వచ్చి చేరాయి. హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో అధికారికంగా వాయుసేనలోకి ఐదు అధునాతన రఫేల్‌ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లీ, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా తదితరుల సమక్షంలో ఈ యుద్ధ విమానాలను వాయుసేనలోని 17 స్క్వాడ్రన్‌ ఆఫ్‌ ది గోల్డెన్‌ ఏరోస్‌కి అప్పగించారు.

దీనికి సంబంధించిన ఒక పత్రాన్ని గ్రూప్‌ కెప్టెన్‌ హర్కీరత్‌ సింగ్‌కు రాజ్‌నాథ్‌ అందించారు. రఫేల్‌ అప్పగింత సమయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించడంతో పాటు విమానాలకు వాటర్‌ కెనాన్‌లతో సెల్యూట్‌ చేశారు. ఆ తర్వాత జరిగిన వైమానిక విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కొత్త పక్షులకు స్వాగతం అని భారత వైమానిక దళం ట్వీట్‌ చేసింది. రూ.59 వేల కోట్లతో 36 రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో నాలుగేళ్ల క్రితమే భారత్‌ ఒప్పందం చేసుకుంది. గత జూలై 29న మొదటి విడతగా 5విమానాలు హరియాణాలో అంబాలా వైమానికి స్థావరానికి వచ్చాయి.

సార్వభౌమాధికారంపై కన్నేస్తే ఊరుకోం: రాజ్‌నాథ్‌
రఫేల్‌ యుద్ధ విమానాలను వాయుసేనలో ప్రవేశపెట్టాక రాజ్‌నాథ్‌ మాట్లాడారు. లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని నేరుగానే ప్రస్తావించారు. మన దేశ సార్వభౌమాధికారంపై కన్ను వేసే వారందరికీ ఈ యుద్ధ విమానాల ద్వారా అతి పెద్ద , గట్టి సందేశాన్ని ఇస్తున్నామన్నారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, భౌగోళిక సమగ్రతను కాపాడుకోవడానికి ఎంతవరకైనా వెళతామని ఇదివరకే స్పష్టం చేశానని చెప్పారు. ‘సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో యుద్ధ విమానాలు మన అమ్ములపొదిలోకి చేరడం అత్యంత కీలకంగా మారింది. మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా మనమూ సన్నద్ధం కావాల్సి ఉంది. ప్రధాని మోదీ దేశ భద్రతకే పెద్ద పీట వేస్తారని చెప్పడానికి గర్విస్తున్నాను’అని రాజ్‌నాథ్‌ అన్నారు. ప్రపంచంలో రఫేల్‌ యుద్ధ విమానాలే అత్యుత్తమమైనవని, వాటిని కొనుగోలు చేయడం గేమ్‌ ఛేంజర్‌ అని అభివర్ణించారు. దేశ రక్షణ వ్యవస్థని బలోపేతం చేస్తున్నప్పటికీ తాము శాంతిని కాంక్షిస్తామని స్పష్టం చేశారు.

భారత్, ఫ్రాన్స్‌ బంధాల్లో కొత్త అధ్యాయం
రఫేల్‌ యుద్ధ విమానాలు వైమానిక దళంలోకి చేరికతో భారత్, ఫ్రాన్స్‌ మధ్య స్నేహ సంబంధాలు మరింత పటిష్టమయ్యాయని ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లీ అన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పారు. భారత రక్షణ వ్యవస్థ బలోపేతం కావడానికి తాము పూర్తిగా సహకరిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

గోల్డెన్‌ ఏరోస్‌కే ఎందుకు ?
మొదటి బ్యాచ్‌లో వచ్చిన 5 రఫేల్‌ యుద్ధ విమానాలు 17 స్క్వాడ్రన్‌ గోల్డెన్‌ ఏరోస్‌ ద్వారా సేవలు అందిస్తాయి. వాయుసేనలో గోల్డెన్‌ ఏరోస్‌కి ప్రత్యేక స్థానముంది. అంబాలాలో 1951 అక్టోబర్‌ 1న లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ డీఎల్‌ స్ప్రింగెట్‌ నేతృత్వంలో ఈ ప్రత్యేక దళం ఏర్పడింది. ఎలాంటి సంక్లిష్టమైన ఆపరేషన్లయినా ఈ దళమే చేపడుతుంది. పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాల నుంచి గత ఏడాది బాలాకోట్‌ దాడుల వరకు ఎన్నో ఆపరేషన్లలో 17 స్క్వాడ్రన్‌ గోల్డెన్‌ ఏరోస్‌ అద్భుతమైన ప్రతిభని చూపించింది. హార్వార్డ్‌ 2బీ, హాకర్‌ హంటర్, మిగ్‌ 21 వంటి యుద్ధ విమానాలన్నింటినీ తొలుత గోల్డెన్‌ ఏరోస్‌ దళం నడిపింది. గత ఏడాది సెప్టెంబర్‌ 10న రఫేల్‌ యుద్ధ విమానాల కోసం ఈ దళాన్ని మళ్లీ పునరుద్ధరించారు. ఈ యుద్ధ విమానం నడపడంలో ఇప్పటికే కొందరు పైలట్లు, టెక్నీషియన్లు, ఇంజనీర్లు ఫ్రాన్స్‌లో శిక్షణ తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement