ఫ్రాన్స్‌లోని మెరిగ్నాక్ ఎయిర్ బేస్ నుంచి భారత్‌కు బయలుదేరిన రఫేల్ ఎయిర్‌క్రాఫ్ట్
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్సు నుంచి బయలుదేరాయి. చైనాతో సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఇవి చేరుకోవడంతో ఐఏఎఫ్ పోరాట సామర్థ్యం ఇనుమడిస్తుందని భావిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం భారత ప్రభుత్వం 36 అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్సుతో రూ.59 వేల కోట్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
మొదటి బ్యాచ్‌లో భాగంగా సోమవారం ఫ్రాన్సులోని మెరిగ్నాక్ వైమానిక కేంద్రం నుంచి 5 రఫేల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఇవి ఈనెల 29వ తేదీన పంజాబ్‌లోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకోనున్నాయి. మార్గమధ్యంలో యూఏఈలోని అల్‌ధఫ్రా ఎయిర్‌బేస్‌లో సోమవారం సాయంత్రం దిగాయి. ఫ్రాన్సుకు చెందిన డసో ఏవియేషన్ సంస్థ ఈ విమానాలను తయారు చేస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో మొదటి రఫేల్ జెట్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఫ్రాన్సు పర్యటన సందర్భంగా డసో అందజేసింది.
ఈ విమానం ప్రత్యేకతలు..
శక్తివంతమైన ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం రఫేల్ జెట్లకు ఉంది. గాలిలో నుంచి గాలిలోకి ప్రయోగించగలిగే మెటియోర్, స్కాల్ప్ క్షిపణులను ఇది తీసుకెళ్లగలదు. క్షిపణి వ్యవస్థలతోపాటు ఈ జెట్లలో భారత్ కోరిన విధంగా..ఇజ్రాయెలీ హెల్మెట్ మౌంటెడ్ డిస్‌ప్లే, రాడార్ వార్నింగ్ రిసీవర్లు, లో–బ్యాండ్ జామర్లు, 10 గంటల ఫ్లైట్ డేటా రికార్డింగ్, ఇన్‌ఫ్రా రెడ్ సెర్చ్, ట్రాకింగ్ సిస్టమ్స్ వంటి అదనపు ఏర్పాట్లున్నాయి. మొత్తం భారత్‌కు వచ్చే 36 రఫేల్ విమానాల్లో 30 యుద్ధ విమానాలు(ఒకటే సీటుండేది) కాగా, 6 శిక్షణ విమానాలు రెండు సీట్లుండేవి. ఈ తేడా తప్పితే రెండింటి సామర్థ్యం ఒక్కటే.
ఒక స్క్వాడ్రన్ రఫేల్ జెట్లను అంబాలా ఎయిర్ బేస్‌లో. మరో స్క్వాడ్రన్‌ను బెంగాల్‌లోని హసిమారా బేస్‌లోనూ ఉంచనున్నారు. వీటి పరిరక్షణ, నిర్వహణ ఏర్పాట్లకు ఐఏఎఫ్ రూ.400 కోట్లు వెచ్చించింది. చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా తూర్పు లద్దాఖ్ సెక్టార్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి భారత్ సన్నద్ధత సామర్థ్యాన్ని పెంచేందుకు రఫేల్‌లను మోహరించనున్నట్లు అధికారులు తెలిపారు.
కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో భారత్‌కు సంఘీభావ సూచకంగా వైద్య పరికరాలు, నిపుణులతో కూడిన విమానాన్ని కూడా ఫ్రాన్సు పంపిస్తోందని ఫ్రాన్సులోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment