
న్యూఢిల్లీ: భారత భూభాగాన్ని చైనాకు అప్పగించారు(సరెండర్ చేశారు) అంటూ ప్రధాని మోదీపై శనివారం నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం మరో అడుగు ముందుకేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసలు పేరు సరెండర్ మోదీ అని ఎద్దేవా చేశారు. అయితే, ఇంగ్లిష్ పదం సరెండర్ స్పెల్లింగ్‌ను surrenderకు బదులు surender అని ఆయన పేర్కొనడం గమనార్హం. ఈ మేరకు ఆయన ‘చైనాతో భారత్ బుజ్జగింపు విధానం బట్టబయలు’అనే శీర్షికతో ఉన్న విదేశీ పత్రికలోని కథనాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. భారత భూభాగాన్ని ఎవరూ ఆక్రమించుకోలేదని ప్రధాని చెబుతున్నప్పటికీ పాంగాంగ్ త్సో సమీపంలోని భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడవుతోందని చెప్పారు. ఇందుకు సంబంధించిన టీవీ వార్తా కథనం క్లిప్పింగ్‌ను కూడా జత చేశారు.