
ప్రధాని మోదీపై కాంగ్రెస్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ విమర్శల దాడిని పెంచింది. పారిశ్రామికవేత్త అదానీతోపాటు చైనాకు సైతం నరేందర్– సరెండర్ అంటూ వ్యాఖ్యానించింది. షోలే సినిమాలో జై–వీరూల జోడీని అదానీ, మోదీల ధ్వయం మించిపోయిందని కాంగ్రెస్ నేత అజొయ్ కుమార్ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నో సంవత్సరాల ప్రాక్టీస్ తర్వాత ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు లొంగిపోవడమనే ప్రక్రియ పూర్తయింది.
నరేంద్ర మోదీ ఎక్కడికెళ్లిన, అదానీ కోరిన విధంగా ఒక కాంట్రాక్ట్ మాత్రం గ్యారెంటీ. భారత ప్రధాని దౌత్య సంబంధాలు అంతర్జాతీయంగా పోర్టులు, ఎయిర్‌పోర్టులు, విద్యుత్, బొగ్గు గనులు, ఆయుధాలు వంటి రంగాల్లో పారిశ్రామిక వేత్త అదానీకి అనుకూలంగా ఉంటాయి’అని పేర్కొంటూ ఆయన కొన్ని ఉదాహరణలను ప్రస్తావించారు. మోదీ చైనాకు సైతం మోకరిల్లారన్న అజొయ్ కుమార్.. 2020లో భారత భూభాగాన్ని ఆక్రమించినా కూడా ఆ దేశానికి క్లీన్‌చిట్ ఇచ్చిన ‘నరేందర్– సరెండర్’దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.