న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌పై కాంగ్రెస్ పార్టీ మరోసారి తీవ్ర ఆరోపణలు గుప్పించింది. అదానీ సంస్థలకు చైనాతో లింకులున్నాయని ఆరోపించింది. దేశంలోని పోర్టుల నిర్వహణను ఇప్పటికీ ఆ ఒక్క గ్రూపే ఎందుకు నిర్వహిస్తోందంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీడియా కథనాన్ని ఉటంకిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. చైనా సంస్థలు, అనుబంధ సంస్థలకు దేశంలోని పోర్టులు, టెర్మినళ్ల నిర్వహణ బాధ్యత అప్పగించరాదనేది ప్రభుత్వం విధానంగా వస్తోంది.
అయితే, చైనాకు చెందిన చాంగ్‌చుంగ్–లింగ్‌తో సన్నిహిత సంబంధాలున్న అదానీ గ్రూప్‌కు పోర్టుల నిర్వహణను ఎందుకు అప్పగించారో తెలపాలని ప్రధాని మోదీని ప్రశ్నించారు. అదానీ కొడుకు వినోద్ సారథ్యంలోని పీఎంసీ ప్రాజెక్ట్స్, అదానీ గ్రూప్‌కు రూ.5,500 కోట్ల విద్యుత్ సామగ్రి కుంభకోణంతో సంబంధాలున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ ఆరోపిస్తున్న విషయం ఆయన గుర్తు చేశారు. చైనాకు సన్నిహిత దేశం ఉత్తరకొరియాకు దొంగచాటుగా పెట్రోలియం ఉత్పత్తులను విక్రయించే షాంఘైకు చెందిన కనీసం రెండు షిప్పింగ్ కంపెనీలు అదానీ గ్రూప్‌వేనని తెలిపారు.
చైనాతో సంబంధాలున్నట్లు రుజువులున్నా దేశంలోని పోర్టుల నిర్వహణ బాధ్యతల్లో అదానీ గ్రూప్‌ను ఇప్పటికీ ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రభుత్వాన్ని రమేశ్ నిలదీశారు. ఇవన్నీ దేశ భద్రతకు ప్రమాదకరం కావా అని ప్రశ్నించారు. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు జేపీసీ వేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment