వాషింగ్టన్: భారత్, చైనాల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం పేర్కొన్నారు. గల్వాన్ ఘటన నేపథ్యంలో.. రెండు దేశాల మధ్య నెలకొన్న తీవ్రస్థాయి ఉద్రిక్తతలను తగ్గించేందుకు సహాయపడే ఉద్దేశంతో తమ ప్రభుత్వం భారత్, చైనాలతో మాట్లాడుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘పరిస్థితి సీరియస్ గానే ఉంది. మేం భారత్‌తో, చైనాతో మాట్లాడుతున్నాం. వాళ్లు పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. వాళ్లు ముఖాముఖి తలపడ్డారు.
అక్కడేం జరిగిందో చూసాం. వివాద పరిష్కారంలో వారికి సాయం చేయాలని ప్రయత్నిస్తున్నాం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘చైనా సైన్యమైన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతలను పెంచుతోంది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో కూడా తనవి కాని ప్రాంతాలను తనవేనని ప్రకటిస్తూ ఉద్రిక్తతలను రాజేస్తోంది’ అని యూఎస్ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. చైనాలోని అధికార కమ్యూనిస్ట్ పార్టీని ధూర్త వ్యవస్థగా అభివర్ణించారు. ట్రంప్ ప్రభుత్వం గల్వాన్ ఘటనపై భారత్‌కు మద్దతిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment