వాషింగ్టన్ : భారత్-చైనా సరిహద్దుల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఘాటుగా స్పందించింది. పొరుగు దేశాలతో చైనా వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టింది. ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ శాంతిని కోరుతుంటే డ్రాగన్ మాత్రం సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలుదువ్వడం సరైనది కాదని ఆక్షేపించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి డెన్మార్క్‌తో నిర్వహించిన ఓ వీడియో కాన్ఫరెన్స్ సదస్సులో అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్ పాంపియో కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో చైనా అవలంభిస్తున్న విధానం అంత సహేతుకమైనది కాదని విమర్శించారు. (చైనా వ్యతిరేక బాటలో మరో తరం)
తాజాగా భారత సైనికులపై ఆ దేశ ఆర్మీ పాల్పడిన కాఠిన్యాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రెండు అత్యధిక జనాభాగల దేశాల మధ్య ఘర్షణపూరితమైన వాతావరణం ఇరుపక్షాలకు నష్టం చేకూర్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా సరిహద్దు దేశాలతో డ్రాగన్ అవలంభిస్తున్న తీరును మైక్ పాంపియా తప్పుబట్టారు. హాంకాంగ్ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలపై చైనా గుత్తాధిపత్యం ఆ దేశ పౌరులకు పెను ప్రమాదమని హెచ్చరించారు. పక్క దేశ పౌరుల స్వేచ్ఛను హరించే హక్కు చైనాకు లేదని స్పష్టం చేశారు. అలాగే దక్షిణ చైనా సముద్రం, జపాన్, మలేషియా దేశాలతో చైనా వివాదాలను ఆయన తీవ్రంగా ఖండించారు. (చైనాకు వ్యతిరేకంగా ఒక్కటైన నెటిజన్లు!)
కాగా చైనా-అమెరికా మధ్య ఇప్పటికే వాణిజ్యం యుద్ధం తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను డ్రాగన్ కుట్రపూరితంగానే లీక్ చేసిందనే ఆరోపణలు ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాయి. ఇక ఈ ఏడాది చివరిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో తనను ఓడించేందుకు చైనా పరోక్షంగా కుట్రలు పన్నుతోందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. చైనా విషయంలో మైక్ పాంపియా మొదటి నుంచీ చురుకుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ దేశ కుట్రలు, కుతంత్రాలను ఎప్పటికప్పుడు ట్రంప్‌కు చేరవేస్తూ.. యూఎస్ విదేశాంగ విధానంలో కీలకంగా మారారు.
Comments
Please login to add a commentAdd a comment