![China Says Border Issue With India Is Bilateral Over Mike Pompeo Visit - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/29/mike%20pompeo.jpg.webp?itok=G4TsLJ52)
అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో(ఫైల్ ఫొటో)
బీజింగ్: భారత్‌తో సరిహద్దు సమస్య ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశమని, ఇందులో అమెరికా జోక్యం అనవసరమని చైనా పేర్కొంది. ఇండో పసిఫిక్ పేరిట అమెరికా ఈ ప్రాంతంపై పట్టుకోసం అవలంబిస్తున్న వ్యూహాలను మానుకోవాలని హెచ్చరించింది. భారత్‌లో అమెరికా విదేశాంగ మంత్రి పర్యటన సందర్భంగా చైనా విదేశాంగ శాఖ ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం భారత్, చైనా మధ్య సరిహద్దుల్లో పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని, ఇరు పక్షాలు చర్చల ద్వారా సమస్యలు చక్కబెట్టుకునేందుకు యత్నిస్తున్నాయని చైనా ప్రతినిధి వాంగ్ వెంబిన్ చెప్పారు. ఇక ఇండో పసిఫిక్ వ్యూహాల పేరిట అమెరికా చేస్తున్న యత్నాలు ప్రచ్ఛన్న యుద్ధ(కోల్డ్ వార్) మనస్థత్వాన్ని చూపుతున్నాయని, తన ఆధిపత్యం చూపేందుకు యూఎస్ యత్నిస్తోందని, ఇవన్నీ మానుకోవాలని హెచ్చరించారు.
కాగా 2+2 చర్చల్లో భాగంగా భారత్‌కు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చైనాను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశం కారణంగా భారత సార్వభౌమత్వానికి ఎటువంటి భంగం కలగకుండా తాము తోడుగా ఉంటామని పేర్కొన్నారు. అదే విధంగా.. వుహాన్ నుంచి కరోనా మహమ్మారి ప్రపంచమంతా వ్యాపించిందని డ్రాగన్ దేశంపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను వ్యతిరేకించే పార్టీగా చైనీస్ కమ్యూనిస్టు పార్టీని అభివర్ణించారు.(చదవండి: చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా 2+2 చర్చలు )
Comments
Please login to add a commentAdd a comment