
న్యూఢిల్లీ: తూర్పులద్దాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంట చైనా సైనిక సంపత్తిని తరలించడంతో భారత్ దీటుగా చర్యలు తీసుకుంటోంది. అమెరికా, రష్యా తయారీ యుద్ధ, రవాణా విమానాలను ఈ ప్రాంతంలో వాడుతోంది. కీలకప్రాంతాల్లో నిఘా విధులతోపాటు ఫార్వర్డ్ పోస్టులకు జవాన్లను, ఇతర ముఖ్యమైన పరికరాలు, సామగ్రిని ఇవి తరలిస్తున్నాయి. రష్యా తయారీ అత్యాధునిక సుఖోయ్–30 ఎంకేఐలు, ఎంఐజీ–29 యుద్ధ విమానాలు ఇప్పటికే గగనతలంలో పహారాకాస్తున్నాయి.
సరిహద్దులకు సమీపంలోని ఈ వైమానిక కేంద్రంలో అమెరికా తయారీ రవాణా వాహనాలు సీ–17, సీ–130జేతోపాటు రష్యా తయారీ ఇల్యుషిన్–76, ఆంటొనొవ్–32లు కూడా ఇక్కడ మోహరించారు. తూర్పు లద్దాఖ్ సెక్టార్‌లో యుద్ధ విధుల కోసమే ప్రత్యేకించిన అపాచీ యుద్ధ విమానాలను వినియోగించుకుంటున్నారు. ఆర్మీ, ఐటీబీపీ బలగాలను సరిహద్దుల సమీపంలోకి తరలించేందుకు చినూక్, ఎంఐ–17వీఐ హెలికాప్టర్లను రంగంలోకి దించారు. మొత్తమ్మీద ఈ ఎయిర్ బేస్ విమానాల రాకపోకలతో సందడిగా మారింది. ‘ఈ ప్రాంతంలో ఈ ఎయిర్ బేస్ చాలా కీలకమైంది. యుద్ధ విధులతోపాటు, ఇతర అవసరాలకు కూడా ఇక్కడి నుంచే సరఫరాలు అందుతుంటాయి. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది’ ఓ అధికారి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment