న్యూఢిల్లీ: తూర్పు లడాఖ్ గాల్వన్ లోయలో భారత్-చైనా దళాల మధ్య జరిగిన ఘటనలో కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాహుల్ గాంధీ.. ‘చైనా పథకం ప్రకారమే దాడి చేసింది. ఇది తెలిసి కేంద్రం నిద్రపోతుంటే.. మన అమర జవాన్లు అందుకు మూల్యం చెల్లించారు’ అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గాల్వన్ లోయలో భారత్-చైనా మధ్య తలెత్తిన ఘర్షణలో 20 మంది ఇండియన్ సైనికులు అసువులు బాసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో ‘ఇది ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. గాల్వన్ వ్యాలీలో చైనా దాడి ముందస్తు ప్రణాళికతో జరిగింది. ఇది తెలిసి కేంద్ర ప్రభుత్వం నిద్ర పోయింది. ఈ హెచ్చరికలను ఖండించింది. ఫలితంగా మన అమర జవాన్లు మూల్యం చెల్లించారు’ అని ట్వీట్ చేశారు. అంతేకాక కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ వెల్లడించిన నివేదికను ట్వీట్‌తో పాటు షేర్ చేశారు. జూన్ 15న గాల్వన్ లోయలో జరిగిన దాడి గురించి శ్రీపాద నాయక్ ముందస్తు ప్రణాళిక ప్రకారమే చైనా దాడి చేసిందని వెల్లడించిన సంగతి తెలిసిందే. (మన సైనికుల్ని చంపడానికి వారికెంత ధైర్యం..?)
గాల్వన్ లోయలో భారత్, చైనా దళాల మధ్య జరిగిన హింసాత్మక ఘటనపై కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటంతో రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. మన సైనికులను చంపడానికి వారికెంత ధైర్యం..? వారు మన భూమిని ఆక్రమించకునే దుస్సాహసానికి ఒడిగడతారా..? ఇప్పటి వరకు జరిగింది చాలు.. అక్కడ ప్రస్తుతం ఏమి జరుగుతోందో తెలియాలంటూ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అంతేకాక ఎలాంటి ఆయుధాలు లేకుండా భారత సైనికులను సరిహద్దుకు ఎందుకు పంపారని రాహుల్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment