సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో లడఖ్‌లో 20,000 కోట్ల రూపాయల విలువైన రహదారి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. రహదారుల ప్రాజెక్టులపై సమీక్షలో భాగంగా కీలక ప్రాజెక్టులన్నింటినీ వేగవంతం చేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారులకు సూచించారు. ప్రస్తుతం భారత్-చైనా ప్రతిష్టంభనకు కారణమైన దర్బక్-శ్యోక్-దౌలత్ బేగ్ ఓల్దీ రోడ్ నిర్మాణ పనులనూ వేగవంతం చేయాలని చెప్పారు. ఈ రోడ్డు నిర్మాణాన్ని రెండు నెలల కిందటే భారత్ చేపట్టిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రోడ్డు నిర్మాణ పనులతో పాటు వాస్తవాధీన రేఖతో అనుసంధానించేలా 30 వంతెనల నిర్మాణాన్నీ వేగవంతం చేయనున్నారు.
30 శాశ్వత వంతెనలు ఇప్పటికే నిర్మాణంలో ఉండగా 20,000 కోట్ల రూపాయల విలువైన రహదారి నిర్మాణ పనులను ముందుకు తీసుకువెళ్లాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. వీటిలో పలు హైవేలు, సొరంగ మార్గాలు వివిధ నిర్మాణ దశల్లో ఉండగా మరికొన్ని ప్రాజెక్టులకు ప్రణాళికలు చేపట్టాల్సి ఉందని చెప్పారు. చైనా సరిహద్దు వెంబడి ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో లేహ్, తోస్, కార్గిల్ ఎయిర్‌ఫీల్డ్‌ల్లో వైమానిక దళ కార్యకలాపాలూ ఊపందుకున్నాయి. ఫార‍్వర్డ్ స్ధావరాలకు దళాలను, సామాగ్రిని తరలించేందుకు మెరుగైన కనెక్టివిటీ అవసరమని అధికారులు చెబుతున్నారు. సరిహద్దు వెంబడి ప్రాంతాల్లో నివసించే సైనికులతో పాటు పౌరులకూ సౌకర్యంగా ఉండేలా రోడ్ కనెక్టివిటీని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చదవండి : రష్యాకు రాజ్‌నాథ్.. కీలక చర్చలు
Comments
Please login to add a commentAdd a comment