
ఢిల్లీలో చైనా వ్యతిరేక నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు వ్యతిరేకంగా దేశంలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా దేశస్థులకు వసతి కల్పించబోమని తాజాగా ఢిల్లీ హోటల్ అండ్ రెస్టరెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ (డీహెచ్‌ఆర్‌ఓఏ) ప్రకటించింది. తమ హోటళ్లు, అతిథి గృహాల్లో చైనీయులకు చోటు కల్పించబోమని గురువారం స్పష్టం చేసింది. డీహెచ్‌ఆర్‌ఓఏలో సభ్యత్వం కలిగిన దాదాపు 3 వేల బడ్జెట్ హోటళ్లలో మొత్తం 75 వేల వరకు గదులు అందుబాటులో ఉన్నాయి. కాగా, చైనా వస్తువులు, సరుకులు విక్రయించబోమని భారత వర్తకుల సంఘం(సీఏఐటీ) ఇప్పటికే ప్రకటించింది. ఈనెల 15న సరిహద్దులో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవానులు అమరులు కావడంతో చైనా వ్యతిరేక నిరసనలు దేశవ్యాప్తంగా మిన్నంటుతున్నాయి.
చైనా ఉత్పత్తులు ఉపయోగించం
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ ప్రభావం అన్ని రంగాలతో పాటు హోటళ్ల వ్యాపారంపైనా పడింది. దేశ రాజధానిలో హోటళ్లు, అతిథి గృహాలు పూర్తిస్థాయిలో ఇంకా తెరుచుకోలేదు. చైనా పౌరులకు గదులు అద్దెకు ఇవ్వకూడదన్న తమ నిర్ణయాన్ని అన్ని హోటళ్లు పాటిస్తాయన్న విశ్వాసాన్ని డీహెచ్‌ఆర్‌ఓఏ ప్రధాన కార్యదర్శి మహేంద్ర గుప్తా వ్యక్తం చేశారు. ‘భారత్ పట్ల చైనా వ్యవహరించిన తీరు పట్ల ఢిల్లీ హోటల్ వ్యాపారవేత్తలలో చాలా కోపం ఉంది. దేశవ్యాప్తంగా చైనా వస్తువులను బహిష్కరించాలని సీఏఐటీ సాగిస్తున్న ప్రచారంలో ఢిల్లీ హోటళ్లు, గెస్ట్‌హౌస్‌ల యజమానులు భాగస్వాములు అయ్యారు. నగరంలోని బడ్జెట్ హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లలో చైనా జాతీయులకు వసతి ఇవ్వకూడదని మేము నిర్ణయించుకున్నామ’ని గుప్తా తెలిపారు. తమ హోటళ్లలో చైనా ఉత్పత్తులను ఉపయోగించకూడదని నిర్ణయించినట్టు వెల్లడించారు. (చైనా మైండ్ గేమ్‌కు ఇదే నిదర్శనం)
డీహెచ్‌ఆర్‌ఓఏ తీసుకున్న నిర్ణయాలను సీఏఐటీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ స్వాగతించారు. చైనా వస్తువులను బహిష్కరించాలన్న ప్రచారానికి వివిధ రంగాలకు చెందిన వారంతా మద్దతు పలుకుతున్నారని దీని ద్వారా స్పష్టమైందన్నారు. రవాణాదారులు, రైతులు, హాకర్లు, చిన్న తరహా పరిశ్రమలు, వినియోగదారులకు చెందిన జాతీయ సంఘాలను కూడా ఈ ప్రచారంలో భాగస్వాములను చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. (చైనా ఆక్రమణ: మౌనం వీడని నేపాల్!)
Comments
Please login to add a commentAdd a comment