న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి మే నెల తొలి వారం నుంచే చైనా పెద్ద ఎత్తున బలగాలను, ఆయుధాలను, వాహనాలను మోహరిస్తోందని భారత్ ఆరోపించింది. సరిహద్దుల వద్ద చైనా తీరు గతంలో ఏకాభిప్రాయంతో కుదిరిన ఒప్పందాలను ఉల్లంఘిస్తూ బలగాల మోహరింపు సాగిందంది. తూర్పు లద్దాఖ్‌లో ఇరుదేశాల జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఇటీవలి ఘర్షణలకు కారణం చైనా వ్యవహరించిన తీరేనని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం ఆన్‌లైన్ ప్రెస్‌మీట్‌లో తేల్చిచెప్పారు.
‘మే నెల మొదట్లోనే గల్వాన్ లోయలో భారత్ సాధారణంగా నిర్వహించే పెట్రోలింగ్ విధులను అడ్డుకునేందుకు చైనా ప్రయత్నించింది. వెస్ట్రన్ సెక్టార్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ య«థాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించింది’ అని శ్రీవాస్తవ వివరించారు. ఆ క్రమంలోనే జూన్ 6న ఇరుదేశాల సీనియర్ కమాండర్లు సమావేశమై, బలగాల ఉపసంహరణపై ఒక అంగీకారానికి వచ్చారన్నారు. ‘అయితే, దీన్ని ఉల్లంఘించిన చైనా, గల్వాన్ లోయలో ఎల్‌ఏసీ పక్కనే నిర్మాణాలు చేపట్టింది. వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో చైనా జవాన్లు హింసకు దిగారు.
ఆ క్రమంలో చోటుచేసుకున్న ఘర్షణల్లో ప్రాణనష్టం చోటు చేసుకుంది. ఆ తరువాత చర్చలు కొనసాగుతుండగానే.. రెండు దేశాలు ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించాయి’ అని వివరించారు. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేందుకు కుదిరిన కీలక 1993 ఒప్పందం సహా పలు ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తూ మే తొలి వారం నుంచే చైనా ఎల్‌ఏసీ వెంట భారీగా బలగాలు, సైనిక సామగ్రిని తరలిస్తోందన్నారు. దాంతో, భారత్ కూడా బలగాల మోహరింపు చేపట్టిందని, ఆ క్రమంలోనే ఘర్షణలు చోటుచేసుకున్నాయన్నారు.
భారత్ పైనే బాధ్యత
గల్వాన్ లోయలో జూన్ 15న చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణలకు భారత సైనికులే కారణమని భారత్‌లో చైనా రాయబారి సున్ వీడన్ పేర్కొన్నారు. ఉద్రిక్తత తగ్గించే బాధ్యత ప్రాథమికంగా భారత్‌పైననే ఉందన్నారు. ‘భారత సైనికులే ఎల్‌ఏసీని దాటి వచ్చి చైనా జవాన్లపై దాడి చేశారు. ద్వైపాక్షిక ఒప్పందాలను భారత దళాలే ఉల్లంఘించాయి. మరో గల్వాన్ తరహా ఘటనను చైనా కోరుకోవడం లేదు’ అన్నారు. ‘దశాబ్దాలుగా గల్వాన్ లోయలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. 2020 నుంచి క్షేత్రస్థాయిలో యథాతథ స్థితిని మారుస్తూ భారత్ పలు నిర్మాణాలు చేపట్టింది’ అని ఆరోపించారు. అనుమానం, ఘర్షణలు సరైన మార్గం కాదని.. అది రెండు దేశాల ప్రజల ప్రాథమిక ఆకాంక్షలకు విరుద్ధమని పేర్కొన్నారు. పరస్పర విశ్వాసం, సహకారం రెండు దేశాలకు ప్రయోజనకరమన్నారు. సరిహద్దు వివాదాన్ని సరైన రీతిలో పరిష్కరించుకునేందుకు చైనా సిద్ధంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment