Anurag Srivastava
-
ముప్పు అనివార్యమైనప్పుడే ముందస్తు దాడులు: భారత్
ఐక్యరాజ్యసమితి: మూడో దేశం భూభాగం నుంచి ఎదురయ్యే సాయుధ దాడి ముప్పును ఎదుర్కొనేందుకే ముందస్తు దాడులకు పాల్పడాల్సి వస్తోందని భారత్ వ్యాఖ్యానించింది. మారుమూల ప్రాంతాల్లో ఉగ్రమూకలకు శిక్షణ, సాయం, ప్రోత్సాహం కల్పిస్తున్న ఈ దేశాలు సార్వభౌమత్వం ముసుగులో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపిం చింది. ఇటువంటప్పుడు ఉగ్రవాదుల ప్రయత్నాలను తిప్పికొట్టడానికి మూడో దేశం భూభాగంపై ముందస్తు దాడులకు దిగాల్సి వస్తోందని పేర్కొంది. 2001లో భద్రతా మండలి చేసిన నంబర్ 1368, 1373 తీర్మానాలు కూడా ముంబై దాడుల వంటి వాటిని నిలువరించేందుకు ఆత్మ రక్షణ చర్యలు అవసరమనే విషయాన్ని ధ్రువీకరి స్తున్నాయని తెలిపింది. మెక్సికో నేతృత్వంలో భద్రతామండలి అనధికారిక అరియా ఫార్ములా సమావేశంలో ఐరాసలో భారత డిప్యూటీ శాశ్వత రాయబారి నాగరాజ్ నాయుడుపై వ్యాఖ్యలు చేశారు. మూడో దేశం దన్నుతో సాగే దాడులను నిలువరించాల్సిన తక్షణ, తీవ్ర పరిస్థితులు ఉత్పన్న మైనప్పుడు ఆత్మరక్షణ అనేది ఒక దేశం ప్రాథమిక హక్కు అని ఆయన అన్నారు. పుల్వామా ఘటనకు ప్రతిగా పాక్‌లోని బాలాకోట్ ఉగ్ర శిబిరాలపై భారత వైమానిక దళం దాడులకు పాల్పడిన విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. పాక్‌తో సాధారణ సంబంధాలను కోరుకుంటున్నాం: భారత్ న్యూఢిల్లీ: కాల్పుల విరమణ ఒప్పందాలను గట్టిగా పాటించాలని భారత్, పాక్ సైనిక బలగాలు నిర్ణయించుకున్నాయని భారత విదేశాంగ శాఖ గురువారం తెలిపింది. పాకిస్తాన్‌తో సాధారణ సంబంధాలను కోరుకుంటున్నామనీ, రెండు దేశాల మధ్య అంశాలను శాంతియుతంగా పరిష్కరించు కునేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ‘కీలక అంశాలపై మా వైఖరిలో మార్పు ఉండదు. ఇదే విషయాన్ని మరోసారి చెప్పాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నాం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మీడియాకు తెలిపారు. భారత్, పాక్‌ల మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరళ్ల మధ్య హాట్‌లైన్ ద్వారా జరిగిన చర్చల అనంతరం రెండు దేశాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. వాస్తవ నియంత్రణ రేఖ సహా ఇతర ప్రాంతాల్లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు, కాల్పుల విరమణ ఒప్పందాలను బుధవారం అర్ధరాత్రి నుంచి తు.చ. తప్పకుండా పాటించేందుకు ఈ చర్చల్లో అంగీకారానికి వచ్చాయి. ఈ పరిణామంపై అనురాగ్ శ్రీవాస్తవ పై వ్యాఖ్యలు చేశారు. -
వ్యవసాయ చట్టాలకు అమెరికా మద్దతు
వాషింగ్టన్ : కొత్త వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమానికి ఇంటా బయటా ఎందరో మద్దతునిస్తున్న వేళ భారత ప్రభుత్వానికి తాజాగా అగ్రరాజ్యం అమెరికా అండగా నిలిచింది. ఈ చట్టాలతో భారత్ మార్కెట్ బలపడుతుందని అభిప్రాయపడింది. రైతుల ఆందోళనల్ని చర్చల ద్వారా పరిష్కరించాలని సూచించింది. శాంతియుతంగా చేసే నిరసనలు ప్రజాస్వామ్య దేశాల లక్షణమని పేర్కొన్న అమెరికా విదేశాంగ శాఖ సంక్షోభ నివారణకు తాము చర్చల్ని ప్రోత్సహిస్తామని స్పష్టం చేసింది. ప్రైవేటు పెట్టుబడుల్ని ఆకర్షించేలా, రైతుల మార్కెట్ పరిధిని పెంచేలా వ్యవసాయ రంగంలో చేపట్టిన సంస్కరణలకి బైడెన్ ప్రభుత్వం మద్దతునిస్తోందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు బుధవారం వెల్లడించారు. సాధారణంగా మార్కెట్లను బలోపేతం చేసే ఎలాంటి చర్యలకైనా తమ మద్దతు ఉంటుందని, భారత్‌లో వ్యవసాయ సంస్కరణల్ని తమ దేశం స్వాగతిస్తుందన్నారు. మరోవైపు కొందరు ప్రజాప్రతినిధులు రైతులకు సంఘీభావంగా ట్వీట్లు చేశారు. రైతు ఆందోళనల్ని భారత్ వైపు నుంచి చూడాలి దేశంలో రైతు నిరసనల్ని పూర్తిగా భారత్ దృష్టి కోణంతో చూడాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ్ అన్నారు. ఈ దేశంలో రాజకీయాలను అర్థం చేసుకొని అభిప్రాయాలను వెల్లడించాలన్నారు. రైతులతో సమస్య పరిష్కారానికి పలు దఫాలు కేంద్రం చర్చలు జరిపిందన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత నవంబర్ నుంచి నిరసన ప్రదర్శనలు చేస్తున్న రైతులతో సమస్య పరిష్కారానికి చర్చల్ని తాము ప్రోత్సహిస్తామని అమెరికా విదేశాంగ శాఖ చేసిన సూచన పట్ల అనురాగ్ స్పందిస్తూ జనవరి 6న అమెరికాలో క్యాపిటల్ భవనంపై దాడి, జనవరి 26న ఎర్రకోటపై దాడిని ఒకేలా చూడాలన్నారు. క్యాపిటల్ భవనంపై దాడి సమయంలో అమెరికాలో ఎలాగైతే భావోద్వేగాలతో కూడిన ప్రతిస్పందనలు వచ్చాయో ఇక్కడ కూడా అలాగే వచ్చాయన్నారు. ఇక్కడ చట్టాల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని చెప్పారు. హింస చెలరేగకుండా ఉండడానికే ఇంటర్నెట్ నిలిపివేశామని స్పష్టం చేశారు. -
ఇప్పటికైనా న్యాయం చేయండి: భారత్
న్యూఢిల్లీ: 26/11 ముంబై ఉగ్రదాడుల ఘటనలో న్యాయం చేయాల్సిందిగా భారత్ గురువారం పాకిస్తాన్‌ను కోరింది. ఇటీవల ముంబై ఉగ్రదాడిలో పాల్గొన్న 19 మంది ఉగ్రవాదులను పాకిస్థాన్ మోస్ట్ వాంటెడ్ హై ఫ్రొఫైల్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌లోని అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) చేర్చింది. 2008 నాటి ఉగ్రదాడికి వీరంతా సహకరించినట్టు దర్యాప్తులో తేలింది. వీరంతా ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన వారే. ముంబై ఉగ్రదాడిలో పాకిస్తానీ టెర్రరిస్టులు పాల్గొన్నారన్నది జగమెరిగిన సత్యం. అయినప్పటికీ ఉగ్రవాదులకు అండగా ఉంటూ పాకిస్తాన్ వారికి ఆశ్రయం కల్పిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.(ముంబై దాడుల దోషి రానా మళ్లీ అరెస్ట్) ముంబైలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి నవంబర్ 26తో 12 ఏళ్లు పూర్తవుతుంది. ఇప్పటికైనా భారత్‌కు న్యాయం చేయాల్సిందిగా పాక్‌ను కోరారు. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ..ఈ దాడిలో భారతీయులే కాక చాలామంది విదేశీ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అన్ని ఆధారాలు ఉన్నా దాదాపు 15 దేశాలకు చెందిన 166 మంది బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంలో పాకిస్తాన్ విఫలమయ్యిందని వ్యాఖ్యానించారు. ముంబై ఉగ్ర దాడి సూత్రధారులైన హఫీజ్ సయీద్, జాకీఉర్ రెహమాన్ లఖ్వీలకు వ్యతిరేకంగా పాక్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని శ్రీ వాస్తవ అన్నారు. ఏఆర్ జడ్ వాటర్ స్పోర్ట్సు కరాచీ నుంచి యమహా మోటారు బోట్ ఇంజిను, లైఫ్ జాకెట్లు, గాలితో కూడిన పడవలను కొనుగోలు చేసేందుకు ఫైనాన్షియర్లు, అల్ హుసేనీ పడవ సిబ్బంది పేర్లను ఎఫ్ఐఏ జాబితాలో చేర్చింది. ఈ మేరకు 880 పేజీలకు పైగా సుదీర్ఘ నివేదిక తయారు చేసింది. 2008 నవంబరు 26న పాకిస్థాన్‌లోని కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం ద్వారా ముంబైలోకి లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన అజ్మల్ కసబ్, మరో తొమ్మిది మంది చొరబడ్డారు. ఒబెరాయ్ హోటల్, తాజ్, త్రపతి శివాజీ టెర్మినస్‌ల వద్ద నాలుగు రోజుల పాటు మారణహోమం సృష్టించిన ఘటన తెలిసిందే. ఈ దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మంది వరకు గాయపడ్డారు. (రాహుల్ గాంధీకి ఆ పట్దుదల లేదు : ఒబామా) -
గిల్గిత్–బాల్టిస్తాన్ నుంచి వెళ్లిపోండి
న్యూఢిల్లీ: గిల్గిత్–బాల్టిస్తాన్ ప్రాంతానికి ప్రొవెన్షియల్ హోదా కల్పించేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు ప్రారంభించడాన్ని భారత్ తప్పుపట్టింది. తమ దేశ భూభాగంలో అంతర్భాగమైన గిల్గిత్–బాల్టిస్తాన్‌ను పాకిస్తాన్ దొంగదారిలో ఆక్రమించుకుందని, అక్కడి నుంచి తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాలని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తేల్చిచెప్పారు. ప్రొవెన్షియల్ హోదా పేరిట ఆ ప్రాంత ప్రజలను మభ్యపెట్టేందుకు పాక్ పన్నాగాలు పన్నుతోందన్నారు. హోదా మార్చడం కాదు.. ఆక్రమిత ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లిపోవాలని పాకిస్తాన్‌కు హితవు పలికారు. గిల్గిత్–బాల్టిస్తాన్‌కు ప్రొవెన్షియల్ హోదా ఇస్తామంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించినట్లు మీడియా వెల్లడించింది. -
లద్దాఖ్, కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని ఇండియా స్పష్టం చేసింది. ఈ భారత అంతర్గత విషయంపై మాట్లాడే అర్హత చైనాకు లేదని తేల్చిచెప్పింది. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌ను, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని గుర్తించబోమంటూ చైనా చేసిన ప్రకటనపై గురువారం భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఇతరులు తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని కోరుకునే దేశాలకు.. ఇతర దేశాల అంతర్గత విషయాల్లో తాము జోక్యం చేసుకోకూడదని తెలిసి ఉండాలని వ్యాఖ్యానించింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ నుంచి విడదీయలేని అంతర్భాగమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ విషయాలను గతంలోనూ పలుమార్లు, అత్యున్నత వేదికలపై సహా భారత్ స్పష్టం చేసిందన్నారు. తూర్పు లద్దాఖ్‌లోని చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల సడలింపు కోసం ప్రారంభించిన చర్చల గురించి వివరిస్తూ.. బలగాల ఉపసంహరణ ఇరు దేశాలకు సంక్లిష్టమైన ప్రక్రియ అని, బలగాలను గత రెగ్యులర్ పోస్ట్‌లకు పంపించాల్సి ఉంటుందని, అందుకు కొంత సమయం పడుతుందని శ్రీవాస్తవ వ్యాఖ్యానించారు. చర్చిద్దామని అడగలేదు చర్చలు జరుపుదామంటూ పాకిస్తాన్‌కు భారత్ ఎలాంటి సందేశం పంపలేదని శ్రీవాస్తవ స్పష్టం చేశారు. భారత్ నుంచి అలాంటి సందేశమేదీ వెళ్లలేదన్నారు. ‘ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు భారత్‌పై తప్పుడు వార్తలు ప్రచారం చేయడం పాక్ ఎప్పుడూ చేసే పనే’ అని వ్యాఖ్యానించారు. చర్చలు కొనసాగుతున్నాయి సరిహద్దుల్లో ఉద్రిక్తతల సడలింపు కోసం భారత్, చైనాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. రెండు దేశాల మధ్య చర్చల్లో ఏం జరుగుతోందనేది రహస్యమని వ్యాఖ్యానించారు. వాస్తవాధీన రేఖ వెంట ఈ స్థాయిలో బలగాల మోహరింపు గతంలో జరగలేదన్నారు. బ్లూమ్‌బర్గ్ ఇండియా ఎకనమిక్ ఫోరమ్ కార్యక్రమంలో చైనా సరిహద్దుల్లో పరిస్థితిని స్పష్టంగా వివరించమని అడగగా.. జైశంకర్ జవాబిచ్చారు. ‘బహిరంగంగా చెప్పలేని కొన్ని విషయాలుంటాయి. ముందే తీర్పులివ్వాలని నేను కోరుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. 1993 నుంచి పలు ద్వైపాక్షిక ఒప్పందాలతో భారత్, చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయన్నారు. -
గల్వాన్‌పై చైనాకు హక్కు లేదు: భారత్
న్యూఢిల్లీ: గల్వాన్ లోయ తమదేనంటున్న చైనా వాదనను భారత్ మరోసారి తోసిపుచ్చింది. చైనా చేస్తున్న ఈ వాదన అతిశయోక్తి అనీ, ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించుకునే దిశగా శుక్రవారం భారత్, చైనా ప్రతినిధులు సమావేశం కానున్న నేపథ్యంలో భారత్ ఈ మేరకు స్పందించింది. గల్వాన్ లోయ సహా, ఎల్ఏసీ వెంట యథాతధ పరిస్థితిని తప్పనిసరిగా గౌరవించాల్సిందేననీ, రెండు దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు ఇదే ప్రాతిపదిక అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. తూర్పు లద్దాఖ్‌లోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి చైనా బలగాలు వెనక్కి మరలడంపై అనురాగ్ శ్రీవాస్తవ స్పందిస్తూ..రెండు దేశాల ప్రతినిధుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం బలగాల ఉపసంహరణతోపాటు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్య, సైనిక ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతాయన్నారు. కాగా, భారత్–చైనా సరిహద్దు వ్యవహారాలపై ఏర్పాటైన సంప్రదింపులు, సమన్వయ కమిటీ ఆన్లైన్ ద్వారా శుక్రవారం సంభాషణలు జరిపే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. భారత సైన్యంతో కుదిరిన ఒప్పందం ప్రకారం చైనా సైన్యం తూర్పు లద్దాఖ్‌లోని గొగ్రా, హాట్‌స్ప్రింగ్స్ ప్రాంతాల నుంచి బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంది. -
మే నుంచే మోహరింపు
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి మే నెల తొలి వారం నుంచే చైనా పెద్ద ఎత్తున బలగాలను, ఆయుధాలను, వాహనాలను మోహరిస్తోందని భారత్ ఆరోపించింది. సరిహద్దుల వద్ద చైనా తీరు గతంలో ఏకాభిప్రాయంతో కుదిరిన ఒప్పందాలను ఉల్లంఘిస్తూ బలగాల మోహరింపు సాగిందంది. తూర్పు లద్దాఖ్‌లో ఇరుదేశాల జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఇటీవలి ఘర్షణలకు కారణం చైనా వ్యవహరించిన తీరేనని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం ఆన్లైన్ ప్రెస్మీట్లో తేల్చిచెప్పారు. ‘మే నెల మొదట్లోనే గల్వాన్ లోయలో భారత్ సాధారణంగా నిర్వహించే పెట్రోలింగ్ విధులను అడ్డుకునేందుకు చైనా ప్రయత్నించింది. వెస్ట్రన్ సెక్టార్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ య«థాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించింది’ అని శ్రీవాస్తవ వివరించారు. ఆ క్రమంలోనే జూన్ 6న ఇరుదేశాల సీనియర్ కమాండర్లు సమావేశమై, బలగాల ఉపసంహరణపై ఒక అంగీకారానికి వచ్చారన్నారు. ‘అయితే, దీన్ని ఉల్లంఘించిన చైనా, గల్వాన్ లోయలో ఎల్ఏసీ పక్కనే నిర్మాణాలు చేపట్టింది. వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో చైనా జవాన్లు హింసకు దిగారు. ఆ క్రమంలో చోటుచేసుకున్న ఘర్షణల్లో ప్రాణనష్టం చోటు చేసుకుంది. ఆ తరువాత చర్చలు కొనసాగుతుండగానే.. రెండు దేశాలు ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించాయి’ అని వివరించారు. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేందుకు కుదిరిన కీలక 1993 ఒప్పందం సహా పలు ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తూ మే తొలి వారం నుంచే చైనా ఎల్ఏసీ వెంట భారీగా బలగాలు, సైనిక సామగ్రిని తరలిస్తోందన్నారు. దాంతో, భారత్ కూడా బలగాల మోహరింపు చేపట్టిందని, ఆ క్రమంలోనే ఘర్షణలు చోటుచేసుకున్నాయన్నారు. భారత్ పైనే బాధ్యత గల్వాన్ లోయలో జూన్ 15న చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణలకు భారత సైనికులే కారణమని భారత్‌లో చైనా రాయబారి సున్ వీడన్ పేర్కొన్నారు. ఉద్రిక్తత తగ్గించే బాధ్యత ప్రాథమికంగా భారత్‌పైననే ఉందన్నారు. ‘భారత సైనికులే ఎల్ఏసీని దాటి వచ్చి చైనా జవాన్లపై దాడి చేశారు. ద్వైపాక్షిక ఒప్పందాలను భారత దళాలే ఉల్లంఘించాయి. మరో గల్వాన్ తరహా ఘటనను చైనా కోరుకోవడం లేదు’ అన్నారు. ‘దశాబ్దాలుగా గల్వాన్ లోయలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. 2020 నుంచి క్షేత్రస్థాయిలో యథాతథ స్థితిని మారుస్తూ భారత్ పలు నిర్మాణాలు చేపట్టింది’ అని ఆరోపించారు. అనుమానం, ఘర్షణలు సరైన మార్గం కాదని.. అది రెండు దేశాల ప్రజల ప్రాథమిక ఆకాంక్షలకు విరుద్ధమని పేర్కొన్నారు. పరస్పర విశ్వాసం, సహకారం రెండు దేశాలకు ప్రయోజనకరమన్నారు. సరిహద్దు వివాదాన్ని సరైన రీతిలో పరిష్కరించుకునేందుకు చైనా సిద్ధంగా ఉందన్నారు. -
గల్వాన్ లోయ మాదే
న్యూఢిల్లీ/బీజింగ్: గల్వాన్ లోయ తమదేనంటూ శనివారం చైనా చేసిన ప్రకటనను భారత్ తీవ్రంగా ఖండించింది. అతిశయోక్తితో కూడిన చైనా వాదన ఏమాత్రం ఆమోదయోగ్యంకాదని స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘గల్వాన్ లోయ చారిత్రకంగా భారత్‌దే. గతంలో ఎన్నడూ ఇది చైనా భూభాగం కాదు. రెండు దేశాల బలగాలు ఈ ప్రాంతంలో గస్తీ చేపడుతున్నా చాలాకాలంగా ఎటువంటి ఘటనలు జరగలేదు. ఇదే తీరును చైనా కొనసాగించాలి. ఉల్లంఘించేందుకు చేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా భారత బలగాలు తగిన విధంగా తిప్పికొడతాయి’ అని అన్నారు. ఇటీవల రెండు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య కుదిరిన అవగాహన మేరకు చైనా వ్యవహరిస్తుందని భావిస్తున్నామన్నారు. చైనా ట్విట్టర్లో కనిపించని మోదీ ప్రసంగం గల్వాన్ ఘటనపై ఈనెల 18వ తేదీన ప్రధాన మంత్రి మోదీ చేసిన ప్రసంగంతోపాటు, విదేశాంగ శాఖ ప్రతినిధి శ్రీవాస్తవ చేసిన వ్యాఖ్యలను చైనాలోని ప్రధాన సోషల్ మీడియా సైట్లు తొలగించాయి. వీబో, వుయ్‌చాట్ సైట్లలో వీటిని తమకు కనిపించకుండా చేశారని చైనాలోని భారత దౌత్యాధికారులు తెలిపారు. చైనా ట్విట్టర్ ‘సినావీబో’, ‘ఉయ్‌చాట్’కు కోట్లాదిగా యూజర్లున్నారు. అన్ని దౌత్య కార్యాలయాలు, ప్రధాని మోదీ వంటి పలువురు ప్రపంచ నేతలకు ఇందులో అకౌంట్లున్నాయి. వీబో, వుయ్చాట్ల్లో భారత్‌తో సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలకు సంబంధించి ఎలాంటి పోస్టులు లేవు. అది దుర్మార్గమైన భాష్యం భారత, చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై ప్రధాని మోదీ ఇచ్చిన వివరణకు కొందరు దుర్మార్గపూరితంగా పెడార్థాలు తీస్తున్నారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) పేర్కొంది. ‘తూర్పు లద్దాఖ్‌లోని భారత భూభాగంలోకి ఎవరూ అడుగు పెట్టలేదు. భారత సైనిక పోస్టులను ఎవరూ ఆక్రమించుకోలేదు.. ’అంటూ శుక్రవారం ప్రతిపక్షాలతో భేటీలో ప్రధాని మోదీ ఇచ్చిన వివరణపై కాంగ్రెస్ నేతల నుంచి వచ్చిన వ్యాఖ్యలపై పీఎంవో వివరణ ఇచ్చింది. ‘మన జవాన్ల వీరోచిత పోరాటం ఫలితంగానే భారత్ వైపునున్న వాస్తవ నియంత్రణ రేఖ దాటి చైనా బలగాలు అడుగుపెట్టలేదని ప్రధాని మోదీ శుక్రవారం ప్రతిపక్షాలకు చెప్పారు. బిహార్ రెజిమెంట్‌లోని 16 మంది జవాన్ల త్యాగాల ఫలితంగానే ఆరోజు చైనా సైన్యం ఎల్ఏసీ దాటి వచ్చి, నిర్మాణాలు చేపట్టేందుకు చేసిన ప్రయత్నం సాగలేదు. మన జవాన్లు వారికి తగిన బుద్ధి చెప్పారు. దేశ సరిహద్దులు కాపాడేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ భారత్ వదులుకోదని ప్రధాని అన్నారు. కానీ, కొన్ని వర్గాలు ప్రధాని మోదీ వ్యాఖ్యలకు దుర్మార్గపూరితంగా వక్రభాష్యాలు చెప్పేందుకు ప్రయత్నించాయి’అని శనివారం పీఎంవో పేర్కొంది. మన భూభాగాన్ని చైనాకు అప్పగించారు: రాహుల్ భారత భూభాగాన్ని ప్రధాని మోదీ చైనాకు అప్పగించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారత భూభాగంలోకి ఎవరూ అడుగుపెట్టలేదనీ, సైనిక పోస్టులను ఎవరూ ఆక్రమించుకోలేదని శుక్రవారం ప్రధాని మోదీ ఇచ్చిన వివరణపై ఆయనతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ మేరకు స్పందించారు. ‘ప్రధాని మోదీ భారతీయ భూభాగాన్ని చైనా దురాక్రమణకు అప్పగించారు. అది చైనా ప్రాంతమే అయితే మన సైనికులు ఎందుకు, ఎక్కడ ప్రాణాలర్పించారు’అని ట్విట్టర్లో రాహుల్ ప్రశ్నలు సంధించారు. చిల్లర రాజకీయాలు వద్దు: అమిత్ షా గల్వాన్ లోయలోని భారత భూభాగాన్ని ప్రధాని మోదీ చైనాకు అప్పగించారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ట్విట్టర్లో విమర్శించారు. గల్వాన్ ఘటనలో గాయపడిన జవాను తండ్రి.. సరిహద్దు ఉద్రిక్తతలను రాజకీయం చేయొద్దంటూ రాహుల్‌ను కోరుతున్నట్లుగా ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. ‘రాహుల్ గాంధీకి సాహస సైనికుడి తండ్రి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. జాతి యావత్తూ కలిసికట్టుగా ఉండాల్సిన ఈ క్లిష్ట సమయంలో చిల్లర రాజకీయాలను పక్కనబెట్టి, జాతి ప్రయోజనాల కోసం సంఘీభావంగా నిలవాలి’అని హోం మంత్రి పేర్కొన్నారు. -
చైనా వాదనలపై అనురాగ్ శ్రీవాస్తవ ఫైర్!
న్యూఢిల్లీ : లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ తమ భూభాగంలోనిదంటూ చైనా చేస్తున్న వాదనలను విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తీవ్రంగా తప్పుబట్టారు. చైనా అతిశయోక్తి, ఆమోదయోగ్యం కాని వాదనలు చేస్తోందని, అటువంటి వాదనలు ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించటానికి పూర్తివిరుద్దమని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ బుధవారం ఉదయం ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జై శంకర్, వాంగ్ యీలు తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న పరిస్థితిపై ఫోన్ ద్వారా చర్చించారు. గాల్వాయ్ లోయ వివాదం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జై శంకర్, వాంగ్ యీని హెచ్చరించారు. ( భారత్‌ను దెబ్బతీసేందుకు చైనా జిత్తులు ) చైనా సైనికుల దుందుడుకు చర్య కారణంగా 20మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. జూన్ 6న రెండు దేశాల కమాండింగ్ అధికారుల స్థాయి చర్చల్లో కుదిరిన ఒప్పందాన్ని ఇరుదేశాలు నిజాయితీగా, నిక్కచ్చిగా అమలు చేయాలని చైనాకు తేల్చిచెప్పారు. అనంతరం సరైన పద్దతిలో వివాదాన్ని పరిష్కరించటానికి ఇరు దేశాల విదేశాంగ మంత్రులు పరస్పరం ఆమోదం తెలుపుకున్నార’’ని పేర్కొన్నారు. ( సరిహద్దు ఘర్షణలో సరికొత్త సవాళ్లు) -
మాల్యా ‘శరణార్థి’ అభ్యర్థనను మన్నించొద్దు
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకులను వేల కోట్ల రూపాయల్లో ముంచి, ప్రస్తుతం బ్రిటన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్ వ్యాపారస్తుడు విజయ్ మాల్యాను దేశానికి రప్పించే దిశలో కేంద్రం కీలక చర్య తీసుకుంది. ‘శరణార్థి’ హోదాలో దేశంలో ఉంటానని మాల్యా అభ్యర్థిస్తే, దానికి ఆమోదముద్ర వేయవద్దని బ్రిటన్‌కు విజ్ఞప్తి చేసింది. నిజానికి తనను భారత్‌కు అప్పగించడం తగదని మాల్యా బ్రిటన్ అత్యున్నత న్యాయస్థానాల్లో చేసిన వాదనలు ఇటీవలే వీగిపోయాయి. అయితే ఆయనను తక్షణం భారత్‌కు పంపడం జరిగే పనికాదనీ, ఇందుకు కొన్ని న్యాయపరమైన చిక్కులు వీడాల్సి ఉందని బ్రిటన్ ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌కు తాజా విజ్ఞప్తి చేసినట్లు గురువారంనాటి ఆన్లైన్ మీడియా బ్రీఫింగ్లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. -
‘చైనాతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి’
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలపై భారత్ స్పందించింది. చైనాతో మిలటరీ స్థాయిలో, దౌత్య మార్గాల్లో వివాద పరిష్కార ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించింది. అయితే, దేశ రక్షణ, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో రాజీ లేదని తేల్చి చెప్పింది. ‘శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం’ అని విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం ఆన్లైన్ మీడియా భేటీలో వ్యాఖ్యానించారు. చైనాతో సరిహద్దుగా భావిస్తున్న వాస్తవాధీన రేఖ వెంట శాంతి, సామరస్యతలను నెలకొల్పే బాధ్యతకు భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సరిహద్దుల నిర్వహణ విషయంలో భారత దళాలు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాయన్నారు. భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనపై శ్రీవాస్తవ స్పందించలేదు. ఈ ప్రతిపాదన అమెరికా వైపు నుంచి భారత్‌కు వచ్చిందా?, ఒకవేళ వస్తే.. భారత్ ఏమని సమాధానమిచ్చింది? చైనాతో ప్రస్తుతం నెలకొన్న వివాదంపై అమెరికాకు భారత్ సమాచారమిచ్చిందా?.. తదితర ప్రశ్నలకు ఆయన జవాబు దాటవేశారు. -
‘వందే భారత్’ కొనసాగుతుంది: విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ: విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన ‘వందే భారత్’ కార్యక్రమం కొనసాగుతుందని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఆ కార్యక్రమ రెండో దశ మే 22తో ముగియనుంది. అయితే, అది జూన్ 13 వరకు కొనసాగుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వెల్లడించారు. గురువారం మధ్యాహ్నానికి వివిధ దేశాల నుంచి 23,475 మందిని భారత్‌కు తీసుకువచ్చామన్నారు.జూన్ 13 తరువాత మూడో దశ ‘వందేభారత్’ కార్యక్రమం ఉంటుందన్నారు. అమెరికా, యూరోప్ దేశాలకు కూడా విమానాల సంఖ్యను పెంచుతాం’ అని వివరించారు. అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, పెరు, మంగోలియా తదితర దేశాల నుంచి కూడా భారతీయులను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 98 దేశాల్లోని 2.59 లక్షల మంది భారతీయులు స్వదేశం వచ్చేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. వెయ్యి రెట్లు పెరిగిన కోవిడ్ పరీక్షలు! కోవిడ్ మహమ్మారికి కళ్లెం వేసే క్రమంలో భారత వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్) గణనీయమైన ప్రగతి సాధించింది. ఒక్కరోజులో చేయగల పరీక్షల సంఖ్యను రెండు నెలల్లోనే వెయ్యి రెట్లు పెంచుకోగలిగామని తెలిపింది. 20వ తేదీ ఉదయం తొమ్మిద గంటలకు మొత్తం 25,12,388 పరీక్షలు నిర్వహించామని ఐసీఎంఆర్ తెలిపింది. రెండు నెలల క్రితం ఒక రోజులో చేయగల పరీక్షల సంఖ్య కేవలం వంద ఉండగా..ఇప్పుడదని లక్షకు చేరుకుందని వెల్లడించింది. -
'జంగిల్ వెంచర్స్'లో రతన్ టాటా
ముంబై: భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా... కేపిటల్ ఫండ్ కంపెనీ జంగిల్ వెంచర్స్ బోర్డు ప్రత్యేక సలహాదారుగా వ్యవరించనున్నారు. అనురాగ్ శ్రీవాస్తవ, అమిత్ ఆనంద్ స్థాపించిన జంగిల్ వెంచర్స్ సింగపూర్ కేంద్రంగా పనిచేస్తోంది. ఆసియా ఫసిపిక్ ప్రాంతంలో 30 స్టార్ట్-అప్ లలో జంగిల్ వెంచర్స్ పెట్టుబడులు పెట్టింది. బోర్డు ప్రత్యేక సలహాదారుగా ఉండేందుకు రతన్ టాటా అంగీకరించారని జంగిల్ వెంచర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేసేందుకు రతన్ సేవలు వినియోగించుకుంటామని వెల్లడించింది. ఆసియా, అంతర్జాతీయ స్థాయిలో నైతికంగా, సాంస్కృతికంగా బలపడేందుకు రతన్ సలహాలు తమకు ఉపకరిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.