
న్యూఢిల్లీ: గల్వాన్ లోయ తమదేనంటున్న చైనా వాదనను భారత్ మరోసారి తోసిపుచ్చింది. చైనా చేస్తున్న ఈ వాదన అతిశయోక్తి అనీ, ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఏసీ) కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించుకునే దిశగా శుక్రవారం భారత్, చైనా ప్రతినిధులు సమావేశం కానున్న నేపథ్యంలో భారత్ ఈ మేరకు స్పందించింది. గల్వాన్ లోయ సహా, ఎల్‌ఏసీ వెంట యథాతధ పరిస్థితిని తప్పనిసరిగా గౌరవించాల్సిందేననీ, రెండు దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు ఇదే ప్రాతిపదిక అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు.
తూర్పు లద్దాఖ్‌లోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి చైనా బలగాలు వెనక్కి మరలడంపై అనురాగ్ శ్రీవాస్తవ స్పందిస్తూ..రెండు దేశాల ప్రతినిధుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం బలగాల ఉపసంహరణతోపాటు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్య, సైనిక ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతాయన్నారు. కాగా, భారత్–చైనా సరిహద్దు వ్యవహారాలపై ఏర్పాటైన సంప్రదింపులు, సమన్వయ కమిటీ ఆన్‌లైన్ ద్వారా శుక్రవారం సంభాషణలు జరిపే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. భారత సైన్యంతో కుదిరిన ఒప్పందం ప్రకారం చైనా సైన్యం తూర్పు లద్దాఖ్‌లోని గొగ్రా, హాట్‌స్ప్రింగ్స్ ప్రాంతాల నుంచి బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment