
న్యూఢిల్లీ: గిల్గిత్–బాల్టిస్తాన్ ప్రాంతానికి ప్రొవెన్షియల్ హోదా కల్పించేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు ప్రారంభించడాన్ని భారత్ తప్పుపట్టింది. తమ దేశ భూభాగంలో అంతర్భాగమైన గిల్గిత్–బాల్టిస్తాన్‌ను పాకిస్తాన్ దొంగదారిలో ఆక్రమించుకుందని, అక్కడి నుంచి తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాలని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తేల్చిచెప్పారు. ప్రొవెన్షియల్ హోదా పేరిట ఆ ప్రాంత ప్రజలను మభ్యపెట్టేందుకు పాక్ పన్నాగాలు పన్నుతోందన్నారు. హోదా మార్చడం కాదు.. ఆక్రమిత ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లిపోవాలని పాకిస్తాన్‌కు హితవు పలికారు. గిల్గిత్–బాల్టిస్తాన్‌కు ప్రొవెన్షియల్ హోదా ఇస్తామంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించినట్లు మీడియా వెల్లడించింది.