న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని ఇండియా స్పష్టం చేసింది. ఈ భారత అంతర్గత విషయంపై మాట్లాడే అర్హత చైనాకు లేదని తేల్చిచెప్పింది. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌ను, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని గుర్తించబోమంటూ చైనా చేసిన ప్రకటనపై గురువారం భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఇతరులు తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని కోరుకునే దేశాలకు.. ఇతర దేశాల అంతర్గత విషయాల్లో తాము జోక్యం చేసుకోకూడదని తెలిసి ఉండాలని వ్యాఖ్యానించింది.
అరుణాచల్ ప్రదేశ్ భారత్ నుంచి విడదీయలేని అంతర్భాగమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ విషయాలను గతంలోనూ పలుమార్లు, అత్యున్నత వేదికలపై సహా భారత్ స్పష్టం చేసిందన్నారు. తూర్పు లద్దాఖ్‌లోని చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల సడలింపు కోసం ప్రారంభించిన చర్చల గురించి వివరిస్తూ.. బలగాల ఉపసంహరణ ఇరు దేశాలకు సంక్లిష్టమైన ప్రక్రియ అని, బలగాలను గత రెగ్యులర్ పోస్ట్‌లకు పంపించాల్సి ఉంటుందని, అందుకు కొంత సమయం పడుతుందని శ్రీవాస్తవ వ్యాఖ్యానించారు.
చర్చిద్దామని అడగలేదు
చర్చలు జరుపుదామంటూ పాకిస్తాన్‌కు భారత్ ఎలాంటి సందేశం పంపలేదని శ్రీవాస్తవ స్పష్టం చేశారు. భారత్ నుంచి అలాంటి సందేశమేదీ వెళ్లలేదన్నారు. ‘ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు భారత్‌పై తప్పుడు వార్తలు ప్రచారం చేయడం పాక్ ఎప్పుడూ చేసే పనే’ అని వ్యాఖ్యానించారు.
చర్చలు కొనసాగుతున్నాయి
సరిహద్దుల్లో ఉద్రిక్తతల సడలింపు కోసం భారత్, చైనాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. రెండు దేశాల మధ్య చర్చల్లో ఏం జరుగుతోందనేది రహస్యమని వ్యాఖ్యానించారు. వాస్తవాధీన రేఖ వెంట ఈ స్థాయిలో బలగాల మోహరింపు గతంలో జరగలేదన్నారు. బ్లూమ్‌బర్గ్ ఇండియా ఎకనమిక్ ఫోరమ్ కార్యక్రమంలో చైనా సరిహద్దుల్లో పరిస్థితిని స్పష్టంగా వివరించమని అడగగా.. జైశంకర్ జవాబిచ్చారు. ‘బహిరంగంగా చెప్పలేని కొన్ని విషయాలుంటాయి. ముందే తీర్పులివ్వాలని నేను కోరుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. 1993 నుంచి పలు ద్వైపాక్షిక ఒప్పందాలతో భారత్, చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment