Indian Foreign Ministry
-
ఎన్వోసీ లభించక.. ఇంటికి చేరుకోలేక.. పాపం మనోడు
మోర్తాడ్ (బాల్కొండ): ఉపాధికోసం విజిట్ వీసాపై మలేసియాకు వెళ్లిన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెంకు చెందిన కూన గంగాధర్ పక్షవాతంతో మంచం పట్టాడు. వీసా గడువు ముగిసిపోవడంతో అతడిని ఇంటికి పంపించడానికి మలేసియా ప్రభుత్వం భారత విదేశాంగ శాఖ ద్వారా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)ను కోరుతోంది. అయితే ఎన్వోసీని జారీ చేయడంలో భారత విదేశాంగ శాఖ తాత్సారం చేయడంవల్ల అనారోగ్యంతో అవస్థలు పడుతున్న కూన గంగాధర్ ఇంటికి చేరుకోలేకపోతున్నాడు. గంగాధర్ నాలుగు నెలల క్రితం మలేసియాకు వెళ్లాడు. అక్కడ ఒక కంపెనీలో పని చేస్తున్నాడు. పదిహేను రోజుల కిందట పని ముగించుకుని తన గదికి చేరుకున్న తరువాత గంగాధర్‌కు పక్షవాతం వచ్చింది. దీంతో అతనితో పాటు ఉన్న తెలంగాణ వాసులు అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పక్షవాతంతో బాధపడుతున్న గంగాధర్‌ను ఇంటికి పంపించడానికి తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు యనమల వెంకటస్వామి, శుభ్రలు ప్రయత్నిస్తున్నారు. విజిట్ వీసాపై వెళ్లిన గంగాధర్ మలేసియాలో చట్టవిరుద్ధంగా ఉండిపోవడంతో అతడిని ఇంటికి పంపించడానికి రూ.25 వేల జరిమానా చెల్లించడంతో పాటు భారత రాయబార కార్యాలయం నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సి ఉంది. జరిమానా చెల్లించడానికి బాధితుని పక్షాన తెలంగాణ వాసులు సిద్ధంగా ఉన్నారు. ఎన్వోసీ జారీ చేయడానికి విదేశాంగ శాఖ అధికారులు స్పందించకపోవడంతో పదిహేను రోజులుగా గంగాధర్ ఆస్పత్రిలోనే ఉండిపోయాడు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కూన గంగాధర్‌ను ఇంటికి పంపడానికి వేగంగా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. (క్లిక్ చేయండి: పాస్‌పోర్టులో ఇంటి పేరు ఉండాల్సిందే) -
కువైట్‌కు వలస వెళ్లే కార్మికులకు శుభవార్త
మోర్తాడ్ (బాల్కొండ): కువైట్‌కు వలస వెళ్లే కార్మికులకు శుభవార్త. ఆ దేశంలో పని చేసే భారత కార్మికులకు కనీస వేతనంగా నెలకు వంద దినార్లు అంటే మన కరెన్సీలో రూ.24,700 ఇవ్వాలని భారత విదేశాంగ శాఖ అధికారులు ప్రతిపాదించారు. కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (పీఏఎం)కు అధికారులు ఈ మేరకు ప్రతిపాదన చేశారు. కువైట్‌లోని వివిధ రంగాల్లో పని చేస్తున్న వలస కార్మికులకు చెల్లించాల్సిన కనీస వేతన ఆంశంపై అక్కడి ప్రభుత్వం వివిధ దేశాల కార్మిక శాఖలతో చర్చలు జరిపింది. ప్రధానంగా భారత్, ఈజిప్ట్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్‌ల కార్మిక శాఖలతో కువైట్ ప్రభుత్వం చర్చలు నిర్వహించింది. ఈ మేరకు భారత వలస కార్మికులకు కనీస వేతనంగా రూ.24,700 చెల్లించాలనే ప్రతిపాదన సిద్ధమైంది. గతంలో కనీస వేతనంగా నెలకు 45 దినార్లు చెల్లించాలని విదేశాంగ శాఖ అధికారులు చెప్పడంతో కార్మికులనుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఇదిలా ఉండగా కరోనా కష్టాల సమయంలో కువైట్.. వలస కార్మికులకు కనీస వేతనం పెంచే విషయంపై ఆలోచన చేయడం హర్షణీయమని కార్మికులు అంటున్నారు. (క్లిక్: ఎంబసీ బాత్రూమ్లో స్పై కెమెరాల కలకలం) 60 ఏళ్లు నిండిన కార్మికులకు ఊరట.. 60 ఏళ్లు నిండిన వలస కార్మికులను స్వదేశాలకు పంపాలన్న నిర్ణయంపై కువైట్ వెనక్కు తగ్గింది. డిగ్రీ అర్హత లేదా 60 ఏళ్లు దాటినవారి వీసాలు, వర్క్పర్మిట్లను కొంతకాలం రెన్యూవల్ చేయలేదు. దీంతో నిపుణులైన కార్మికులు డిగ్రీ పట్టా లేక ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. అయితే నైపుణ్యం ఉన్న కార్మికులకు కొరత ఏర్పడడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. డిగ్రీ పట్టా లేనివారి నుంచి 250 దినార్లను ఫీజుగా వసూలు చేసి వర్క్పర్మిట్లను రెన్యూవల్ చేస్తోంది. (క్లిక్: అరుదైన గౌరవం అందుకున్న కాజల్ అగర్వాల్) -
లద్దాఖ్, కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని ఇండియా స్పష్టం చేసింది. ఈ భారత అంతర్గత విషయంపై మాట్లాడే అర్హత చైనాకు లేదని తేల్చిచెప్పింది. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌ను, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని గుర్తించబోమంటూ చైనా చేసిన ప్రకటనపై గురువారం భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఇతరులు తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని కోరుకునే దేశాలకు.. ఇతర దేశాల అంతర్గత విషయాల్లో తాము జోక్యం చేసుకోకూడదని తెలిసి ఉండాలని వ్యాఖ్యానించింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ నుంచి విడదీయలేని అంతర్భాగమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ విషయాలను గతంలోనూ పలుమార్లు, అత్యున్నత వేదికలపై సహా భారత్ స్పష్టం చేసిందన్నారు. తూర్పు లద్దాఖ్‌లోని చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల సడలింపు కోసం ప్రారంభించిన చర్చల గురించి వివరిస్తూ.. బలగాల ఉపసంహరణ ఇరు దేశాలకు సంక్లిష్టమైన ప్రక్రియ అని, బలగాలను గత రెగ్యులర్ పోస్ట్‌లకు పంపించాల్సి ఉంటుందని, అందుకు కొంత సమయం పడుతుందని శ్రీవాస్తవ వ్యాఖ్యానించారు. చర్చిద్దామని అడగలేదు చర్చలు జరుపుదామంటూ పాకిస్తాన్‌కు భారత్ ఎలాంటి సందేశం పంపలేదని శ్రీవాస్తవ స్పష్టం చేశారు. భారత్ నుంచి అలాంటి సందేశమేదీ వెళ్లలేదన్నారు. ‘ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు భారత్‌పై తప్పుడు వార్తలు ప్రచారం చేయడం పాక్ ఎప్పుడూ చేసే పనే’ అని వ్యాఖ్యానించారు. చర్చలు కొనసాగుతున్నాయి సరిహద్దుల్లో ఉద్రిక్తతల సడలింపు కోసం భారత్, చైనాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. రెండు దేశాల మధ్య చర్చల్లో ఏం జరుగుతోందనేది రహస్యమని వ్యాఖ్యానించారు. వాస్తవాధీన రేఖ వెంట ఈ స్థాయిలో బలగాల మోహరింపు గతంలో జరగలేదన్నారు. బ్లూమ్‌బర్గ్ ఇండియా ఎకనమిక్ ఫోరమ్ కార్యక్రమంలో చైనా సరిహద్దుల్లో పరిస్థితిని స్పష్టంగా వివరించమని అడగగా.. జైశంకర్ జవాబిచ్చారు. ‘బహిరంగంగా చెప్పలేని కొన్ని విషయాలుంటాయి. ముందే తీర్పులివ్వాలని నేను కోరుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. 1993 నుంచి పలు ద్వైపాక్షిక ఒప్పందాలతో భారత్, చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణే ముందు..
సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువు, ఉద్యోగం కోసం ఎందాకైనా వెళ్లేందుకు ఈ తరం వడివడిగా అడుగులేస్తోంది. పుట్టిన ప్రాంతం, పెరిగిన రాష్ట్రమే కాదు ఏకంగా దేశ సరిహద్దులు దాటి విదేశీ గడ్డపై కాలుమోపేందుకు ఏమాత్రం సంశయించటం లేదు. డిగ్రీ పట్టా చేతికొచ్చే కంటే ముందుగానే ఈ తరం యువత పాస్‌పోర్ట్‌ను పొందేస్తుంది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో పాస్‌పోర్ట్‌లు తీసుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉందని తాజాగా భారత విదేశీ వ్యవహారాల శాఖ విడుదల చేసిన లెక్కలు తేల్చేశాయి. మరాఠా, మలయాళీలే టాప్.. పాస్‌పోర్ట్‌ల స్వీకరణలో దేశంలో జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలను కాదని మహారాష్ట్ర, కేరళ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. 2014–19 మధ్యలో మహారాష్ట్రలో 71,22,849 పాస్‌పోర్ట్‌లు జారీ అయితే అందులో 11,89,846 మంది తమ పాస్‌పోర్ట్‌లను కేవలం 2019లోనే అందుకున్నారు. జనాభా పరంగా చాలా చిన్న రాష్ట్రమైన కేరళ విద్య, ఉపాధి విషయంలో వేగిరపడే దిశగా గడిచిన ఐదేళ్లలో 67,44,557 మందికి పాస్‌పోర్ట్‌లను జారీ చేసింది. అందులోనూ 2019 ఒక్క ఏడాదిలోనే 10,89,859 మంది పాస్‌పోర్ట్‌లు పొందారు. తమిళ, కన్నడనాడుల్లోనూ జోరు.. ప్రపంచంలో ఎక్కడ ఉపాధి లభించినా వెళ్లేందుకు ఆసక్తి చూపే తమిళవాసులు తమ ఆనవాయితీని కొనసాగిస్తూనే ఉన్నారు. గడిచిన ఏడాదిలో తమిళనాడులో 9,58,073, కర్ణాటకలో 7,01,990 పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యాయి. దేశంలోనే జనాభా పరంగా అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో 9,00,462 పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యాయి. అతిచిన్న ప్రాంతాలైన లక్షదీ్వప్‌లో కేవలం 1,903, అండమాన్‌లో 2,263 పాస్‌పోర్ట్‌లను ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణే ముందు.. విద్య, ఉపాధి వేటలో తెలుగోడి స్పీడ్ కొనసాగుతూనే ఉంది. గడిచిన ఏడాదిలో తెలంగాణలో 4,79,408, ఆంధ్రప్రదేశ్‌లో 3,73,492 మందికి పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యాయి. గడిచిన ఐదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 53,85,964 మందికి పాస్‌పోర్ట్‌లు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఐటీ జాబ్లతోపాటు గల్ఫ్ కంట్రీలకు వివిధ రంగాల్లో కారి్మకులుగా(బ్లూకాలర్) వెళ్లేందుకు పాస్‌పోర్ట్‌లు పొందుతున్న వారి సంఖ్య భారీగానే ఉంటోంది. దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ సమయం పదిన్నర రోజులు ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 3 నుంచి 5 పనిదినాలే ఉండటం మరో విశేషం. పాస్‌పోర్ట్.. మస్ట్ అయింది ఐటీ జాబ్లకు వెళ్లిన సమయాల్లో పాస్‌పోర్ట్ ఉండటం అనేది అదనపు అడ్వాంటేజ్. దీనికి తోడు ప్రముఖ కంపెనీలు పాస్‌పోర్ట్‌లోని వివరాలనే పరిగణనలోకి తీసుకుంటున్నాయి. దీంతో పాస్‌పోర్ట్ తప్పనిసరైంది.– పి.జశ్వంత్‌రెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్కడికైనా.. రెడీ పాస్‌పోర్ట్ అనేది కీలక ఐడెంటిటీ. పాస్‌పోర్ట్‌తో ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుంది. అందుకే తొలుత పాస్‌పోర్ట్ పొంది ఆపై అవకాశాల కోసం ఈ తరం ఎదురు చూస్తోంది.– నీలిమ, మేనేజర్, ఐటీ -
ఎఫ్16ను కూల్చింది అభినందనే
న్యూఢిల్లీ / వాషింగ్టన్: పాకిస్తాన్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్–16 యుద్ధ విమానాన్ని భారత్ పైలెట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమానే కూల్చివేశారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అభినందన్ పాక్ విమానాన్ని కూల్చడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్ చెప్పారు. కూల్చడంపై ఎలక్ట్రానిక్ ఆధారాలు తమవద్ద ఉన్నాయన్నారు. ఎఫ్–16 ఫైటర్ జెట్లలో వాడే అమ్రామ్ క్షిపణి శకలాలను ఇప్పటికే మీడియా ముందు ప్రదర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. వీడియో సాక్ష్యాలను ఎందుకు చూపలేదు? భారత్‌కు చెందిన రెండు యుద్ధవిమానాలను కూల్చివేశామని పాక్ చెప్పడాన్ని రవీశ్ తప్పుపట్టారు. పాక్‌తో ఘర్షణ సమయంలో మనం ఒక మిగ్–21 బైసన్ యుద్ధవిమానాన్ని మాత్రమే కోల్పోయిందని, దాన్ని నడుపుతున్న అభినందన్ పాక్ సైన్యానికి చిక్కారని చెప్పారు. నిజంగానే పాక్ మరో విమానాన్ని కూల్చివేస్తే, వారం రోజులైనా ఆ సాక్ష్యాలను అంతర్జాతీయ మీడియా ముందు ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. అదే నిజమైతే ఆ రెండో విమానం శకలాలు ఎక్కడున్నాయి? దాన్ని నడుపుతున్న పైలెట్లకు ఏమైంది? అనే విషయాలను పాక్ వెల్లడించాలన్నారు. పాక్‌లోనే ఉన్నాడని అందరికీ తెలుసు.. పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ పాక్‌లో ఉన్నాడని ఐక్యరాజ్యసమితిలోని భద్రతామండలి సభ్యులకు తెలుసని రవీశ్ చెప్పారు. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి కారకులైన జైషే ఉగ్రశిబిరాలు పాక్‌లో స్వేచ్ఛగా నడుస్తున్నాయన్న విషయం భద్రతామండలికి తెలుసని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడి, తదనంత పరిణామాలతో భారత్–పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో, బ్రిటన్ జాతీయ భద్రతా సలహాదారు మార్క్‌తో చర్చించారు. -
విద్యార్థుల వివరాలకు హాట్‌లైన్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికాలో వీసా మోసం కేసులో అరెస్టయిన 129 మంది భారతీయ విద్యార్థులను విడిపించేందుకు భారత విదేశాంగ శాఖ, అమెరికాలోని భారత దౌత్య కార్యాలయాలు కృషి చేస్తున్నాయి. అరెస్టయిన విద్యార్థులకు సంబంధించిన వివరాలు అందించేందుకు వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయంలో హాట్లైన్లను ఏర్పాటు చేశారు. +12023221190, +12023402590 నంబర్లకు ఫోన్ చేయడం ద్వారా అరెస్టయిన విద్యార్థులకు సంబంధించిన వివరాలను వారి బంధువులు, స్నేహితులు తెలుసుకోవచ్చని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ నంబర్లు 24x7 పనిచేస్తాయనీ, cons3. washington@mea.gov.in కు ఈ–మెయిల్ పంపడం ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. విద్యార్థి వీసాలను దుర్వినియోగం చేస్తున్న విదేశీయులను పట్టుకునేందుకు అమెరికా అధికారులే ఫార్మింగ్టన్ యూనివర్సిటీ పేరుతో నకిలీ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి వల పన్నడం తెలిసిందే. ఈ యూనివర్సిటీలో 600 మంది విద్యార్థులుగా చేరారు. వారిని చేర్పించిన 8 మంది మధ్యవర్తులను కూడా పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ యూనివర్సిటీలో తరగతులుండవు, నిబంధనల ప్రకారం ఈ విశ్వవిద్యాలయం పనిచేయదని తెలిసినా కేవలం అమెరికాలో ఉండి, ఇతర ఉద్యోగాలు చేసుకోవడం కోసమే ఆ 600 మంది ఇక్కడ చేరారని అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయం వారికి తెలియదనీ, చాలా యూనివర్సిటీ కోర్సుల్లో చదువుతున్న సమయంలోనే ఉద్యోగాలు చేసుకునే వీలు కూడా ఉంది కాబట్టి ఇది కూడా అసలైనదేనని విద్యార్థులు భావించారని అరెస్టయిన వారి తరఫు న్యాయవాదులు అంటున్నారు. రాజకీయ చర్య తీసుకున్న భారత్ విద్యార్థులు అరెస్టవ్వడంపై భారత్ శనివారం రాజకీయపరమైన చర్య తీసుకుంది. అరెస్టయిన విద్యార్థులను కలిసేందుకు భారత దౌత్యాధికారులను తక్షణం అనుమతించాలని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని కోరింది. ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామనీ, చర్యలు తీసుకుంటున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పటికే కొందరు దౌత్యాధికారులు అరెస్టయిన విద్యార్థులను కలుసుకున్నారని చెప్పింది. అరెస్టయిన వారందరినీ విడుదల చేయాలనీ, వారికి ఇష్టం లేకుండానే అమెరికా నుంచి పంపించి వేయద్దని భారత్ కోరింది. ఎక్కడికీ వెళ్లకుండా ప్రత్యేక పరికరాలు ఈ యూనివర్సిటీలో చేరిన 130 మందిని (వారిలో 129 మంది భారతీయులు) ఇప్పటికే అరెస్టు చేసిన అధికారులు, మరింత మందిని త్వరలో పట్టుకునే చాన్సుంది. కాగా, కొంతమంది విద్యార్థులు వారు నివసిస్తున్న ప్రదేశం నుంచి ఎక్కువ దూరం బయటకు వెళ్లడానికి వీలు లేకుండా వారి కాలి చీలమండ దగ్గర ట్రాకింగ్ పరికరాలను అమర్చారు. -
పక్కా చర్యలు కావాలి
♦ ఉగ్రవాదంపై పాక్‌కు భారత్ డిమాండ్ ♦ కశ్మీరే కీలకాంశం: పాక్ న్యూఢిల్లీ: భారత్-పాక్ ద్వైపాక్షిక సంబంధాలపై ఉగ్రవాద ప్రభావం పడుతోందని.. ఉగ్రవాదంపై పక్కాగా చర్యలు తీసుకోవాలని భారత్.. పాకిస్తాన్‌ను డిమాండ్ చేసింది. భారత్ లక్ష్యంగా పాక్‌లో పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులను అనుమతించరాదని.. వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అయితే చర్చల్లో కశ్మీరే కీలకాంశమని పాక్ తేల్చి చెప్పింది. హార్ట్ ఆఫ్ ఆసియా సమావేశానికి హాజరైన పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి అజీజ్ చౌదరితో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జై శంకర్ మంగళవారం ఇక్కడ భేటీ అయ్యారు. పఠాన్‌కోట్ ఉగ్రదాడి విచారణ, 26/11 విచారణ, సంరతా ఎక్స్‌ప్రెస్ పేలుడుపై దర్యాప్తు తదితర అంశాలపై ఇరువురు సుమారు 90 నిమిషాల పాటు చర్చించారు. చర్చల్లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం ప్రకారమే కీలకమైన కశ్మీర్ సమస్యను పరిష్కరించాలని అజీజ్ చౌదరి అభిప్రాయపడ్డారు. కశ్మీర్ లోయలో ఉన్న ప్రజల మనోభీష్టం కూడా అదేనన్నారు. ఈ సందర్భంగా నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ అపహరణ ఉదంతాన్ని భారత్ లేవనెత్తింది. ఆయన్ని పాక్‌కు తీసుకెళ్లారని.. వెంటనే కాన్సుల్‌కు అందుబాటులో ఉంచాలని కోరింది. దీనికి స్పందించిన పాక్.. బలూచిస్తాన్, కరాచీలలో కుల్‌భూషణ్ విద్రోహ చర్యలకు పాల్పడ్డారంది. దీనిని భారత్ ఖండించింది. అలాగే పఠాన్‌కోట్ ఉగ్రదాడి, ముంబై బాంబుపేలుళ్ల కేసులపై విచారణ త్వరితగతిన ముగించాలని జైశంకర్ పాక్‌ను కోరారు. జైషే మొహమ్మద్ నేత మసూద్ అజహర్‌పై కఠిన చర్య తీసుకోవాలన్నారు. కాగా, సరిహ ద్దు దేశాలతో స్నేహసంబంధాలు కోరుకుంటున్నామని చర్చల అనంతరం పాక్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ చర్చలు ఇరు దేశాల మధ్య సానుకూల వాతావరణం నెలకొల్పాయని వ్యాఖ్యనించింది. -
'టెర్రరిస్టుల్లో మంచివారు, చెడ్డవారు ఉండరు'
న్యూఢిల్లీ : ముంబైపై దాడి కేసులో ప్రధాన సూత్రధారి లఖ్వీ విడుదల చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించడం పట్ల భారత విదేశాంగ శాఖ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ముంబై దాడి కేసులో లఖ్వీకు సంబంధించిన సరైన ఆధారాలు పాక్ కోర్టు ముందు పెట్టడంలో నవాజ్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. లఖ్వీ విడుదల కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాకిస్థాన్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. టెర్రరిస్టుల్లో మంచివారు, చెడ్డవారు ఉండరనే సంగతి గుర్తుంచుకోవాలని భారత విదేశాంగ శాఖ... పాక్ ప్రభుత్వానికి సూచించింది. 2008 ముంబైపై దాడిలో కీలక సూత్రధారి లఖ్వీ నిర్బంధం అక్రమమని ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. అతడిని జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖపై విధంగా స్పందించింది. -
ఇరాక్‌లో చిక్కుకున్న తెలంగాణవారిని ఆదుకోండి
విదేశాంగ శాఖ కార్యదర్శికి సీఎస్ రాజీవ్‌శర్మ లేఖ సాక్షి, హైదరాబాద్: ఇరాక్‌లో జరుగుతున్న అతర్యుద్ధంలో చిక్కుకుపోయిన 1,038 మంది తెలంగాణ ప్రజలను క్షేమంగా వెనక్కి తీసుకురావాలని కోరుతూ కేంద్ర విదేశాంగ కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గురువారం లేఖ రాశారు. తెలంగాణ నుంచి ఇరాక్ వెళ్లిన వారు 850 మంది కాగా దేశంలోని మిగతా ప్రాంతాల నుంచి వెళ్లిన తెలంగాణ వారిని కూడా కలుపుకొంటే ఆ సంఖ్య 1,038కి చేరిందని లేఖలో పేర్కొన్నారు. వీరందరినీ క్షేమంగా రాష్ట్రానికి తీసుకురావాలని, అందుకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని రాజీవ్‌శర్మ కోరారు. -
'ఇరాక్ లో తెలంగాణవాసుల క్షేమ సమాచారం తెలపండి'
ఇరాక్‌లో అంతరుద్ధ్యం నేపథ్యంలో స్వదేశం వచ్చేందుకు సుముఖంగా ఉన్న రాష్ట్ర వాసులను తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఆయన లేఖ రాశారు. ఇరాక్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి తెలంగాణ వాసుల యోగక్షేమాలను తమకు తెలపాల్సిందిగా కేంద్రానికి రాసిన లేఖలో ఆయన కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి ఇరాక్ వెళ్లిన వారి వివరాలను ఆ లేఖలో పొందుపరిచారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం 1038 మంది ఇరాక్‌లో ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వారిలో 858 మంది ముంబై ట్రావెల్స్ ఏజెన్సీ, మరో 180 మంది జైపూర్ ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా ప్రొటెక్టర్ అధికారికంగా వెళ్లారని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్రానికి రాసిన లేఖలో వివరించారు.