పక్కా చర్యలు కావాలి
♦ ఉగ్రవాదంపై పాక్‌కు భారత్ డిమాండ్
♦ కశ్మీరే కీలకాంశం: పాక్
న్యూఢిల్లీ: భారత్-పాక్ ద్వైపాక్షిక సంబంధాలపై ఉగ్రవాద ప్రభావం పడుతోందని.. ఉగ్రవాదంపై పక్కాగా చర్యలు తీసుకోవాలని భారత్.. పాకిస్తాన్‌ను డిమాండ్ చేసింది. భారత్ లక్ష్యంగా పాక్‌లో పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులను అనుమతించరాదని.. వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అయితే చర్చల్లో కశ్మీరే కీలకాంశమని పాక్ తేల్చి చెప్పింది. హార్ట్ ఆఫ్ ఆసియా సమావేశానికి హాజరైన పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి అజీజ్ చౌదరితో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జై శంకర్ మంగళవారం ఇక్కడ భేటీ అయ్యారు.
పఠాన్‌కోట్ ఉగ్రదాడి విచారణ, 26/11 విచారణ, సంరతా ఎక్స్‌ప్రెస్ పేలుడుపై దర్యాప్తు తదితర అంశాలపై ఇరువురు సుమారు 90 నిమిషాల పాటు చర్చించారు. చర్చల్లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం ప్రకారమే కీలకమైన కశ్మీర్ సమస్యను పరిష్కరించాలని అజీజ్ చౌదరి అభిప్రాయపడ్డారు. కశ్మీర్ లోయలో ఉన్న ప్రజల మనోభీష్టం కూడా అదేనన్నారు. ఈ సందర్భంగా నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ అపహరణ ఉదంతాన్ని భారత్ లేవనెత్తింది. ఆయన్ని పాక్‌కు తీసుకెళ్లారని.. వెంటనే కాన్సుల్‌కు అందుబాటులో ఉంచాలని కోరింది. దీనికి స్పందించిన పాక్.. బలూచిస్తాన్, కరాచీలలో కుల్‌భూషణ్ విద్రోహ చర్యలకు పాల్పడ్డారంది.
దీనిని భారత్ ఖండించింది. అలాగే పఠాన్‌కోట్ ఉగ్రదాడి, ముంబై బాంబుపేలుళ్ల కేసులపై విచారణ త్వరితగతిన ముగించాలని జైశంకర్ పాక్‌ను కోరారు. జైషే మొహమ్మద్ నేత మసూద్ అజహర్‌పై కఠిన చర్య తీసుకోవాలన్నారు. కాగా, సరిహ ద్దు దేశాలతో స్నేహసంబంధాలు కోరుకుంటున్నామని చర్చల అనంతరం పాక్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ చర్చలు ఇరు దేశాల మధ్య సానుకూల వాతావరణం నెలకొల్పాయని వ్యాఖ్యనించింది.